స్నాప్‌డీల్ విక్రయానికి మరో అడుగు!
నెక్సస్ వెంచర్స్‌తో సాఫ్ట్‌బ్యాంక్ చర్చలు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థ స్నాప్‌డీల్‌ను పోటీ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు విక్రయించే ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. స్నాప్‌డీల్‌లో కీలకమైన సహ ఇన్వెస్టరు నెక్సస్ వెంచర్ పార్ట్‌నర్స్ (ఎన్‌వీపీ) నుంచి విక్రయానికి ఆమోదముద్ర దక్కించుకునే దిశగా సాఫ్ట్‌బ్యాంక్ మరికాస్త పురోగతి సాధించింది. ఇరు సంస్థలూ మంగళవారం సమావేశమయ్యాయని, త్వరలోనే ప్రతిష్టంభన తొలగిపోగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వారంలోనే నిర్ణయం రావొచ్చని పేర్కొన్నాయి.
దీనిపై బుధవారం మరోసారి సమావేశం జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలియజేశాయి. స్నాప్‌డీల్ మాతృసంస్థ జాస్పర్ ఇన్ఫోటెక్ బోర్డులో సహ వ్యవస్థాపకులైన కునాల్ బెహల్, రోహిత్ బన్సల్‌తో పాటు సాఫ్ట్‌బ్యాంక్, కలారి క్యాపిటల్ తదితర ఇన్వెస్టర్లు డైరెక్టర్లుగా ఉన్నారు. స్నాప్‌డీల్‌ను ఫ్లిప్‌కార్ట్‌కు విక్రయించేందుకు సాఫ్ట్‌బ్యాంక్ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, డీల్ సాకారం కావాలంటే స్నాప్‌డీల్‌లో ప్రారంభ దశలో ఇన్వెస్ట్ చేసిన ఎన్‌వీపీ ఆమోదముద్ర తప్పనిసరి కావడంతో చర్చలు జరుపుతోంది.