
సాక్షి, హైదరాబాద్: సొంతిల్లు కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది. కాకపోతే కొందరే తక్కువ ధరలో ఇంటిని సొంతం చేసుకుంటారు. వీలైనంత తక్కువ ధరకు ఇంటిని కొనాలంటే.. మార్కెట్ పరిస్థితులను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసికొని తక్షణమే నిర్ణయం తీసుకోవాలి. ఇతర నగరాలకు చెందిన నిర్మాణ సంస్థలు నగరంలోకి అడుగుపెట్టి కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ రేటు కంటే అధిక ధరను నిర్ణయించాయి. దీంతో అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్మాణాన్ని చేపట్టే స్థానిక డెవలపర్లు తప్పనిసరి పరిస్థితుల్లో ధరలను పెంచేశారు. ఈ కారణంగా గత రెండు మూడు నెలల నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో రేట్లు పెరిగాయి.
రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముంది కాబట్టి సొంతింటి ఎంపికకు ఆలస్యం చేయకపోవటమే మంచిది. ముఖ్యంగా మొదటిసారి సొంతిల్లు కొనాలని భావించేవారికిదే సరైన సమయమని చెప్పొచ్చు. ఆకాశాన్నంటిని నిర్మాణ సామగ్రి ధరలు ఈ ఏడాది స్వల్పంగా తగ్గొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గృహ రుణాలపై వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయని అంచనా. దీంతో రియల్టీ మార్కెట్ పుంజుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదే నిజమైతే కొనుగోలుదారుల సంఖ్య పెరుగుతుంది. ఫలితంగా పెట్టుబడులు పెట్టేవారు ఈ రంగంలోకి అగుడుపెట్టి కృత్రిమ డిమాండ్‌ను సృష్టిస్తారు కాబట్టి గృహ కొనుగోలు నిర్ణయానికి ఇదే సరైన సమయం.