లక్ష్యం రూ.1,200 కోట్లు
సికాఫ్ జీఎం సుబ్రమణియమ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంట నూనెల తయారీలో ఉన్న సౌత్ ఇండియా కృష్ణ ఆయిల్, ఫ్యాట్స్ (సికాఫ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,200 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది. 2013-14లో రూ.1,000 కోట్లకుపైగా ఆర్జించామని సికాఫ్ జీఎం సుబ్రమణియమ్ పలనిసామి తెలిపారు. సూర్యగోల్డ్ బ్రాండ్‌లో కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టిన సందర్భంగా కంపెనీ ప్రతినిధులు శారద తదితరులతో కలిసి శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ఏటా విక్రయిస్తున్న 2 లక్షల టన్నుల్లో 30 శాతం ప్యాకేజ్డ్ ఆయిల్ కైవసం చేసుకుందన్నారు.
2-3 ఏళ్లలో ప్యాకింగ్ నూనెల విక్రయాలను రెండింతలు చేస్తామన్నారు. ‘రోజుకు 1,200 టన్నుల నూనె ప్రాసెస్ చేయగల ప్లాంటు కృష్ణపట్నం వద్ద ఉంది. రూ.120 కోట్లు వెచ్చించాం. విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకై రూ.10 కోట్లతో విస్తరణ చేపడుతున్నాం. తమిళనాడులోని నాగపట్నం వద్ద రోజుకు 400 టన్నుల సామర్థ్యంగల ప్లాంటును రూ.36 కోట్లతో కొనుగోలు చేశాం. జూన్ నుంచి ఈ ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభమవుతుంది’ అని చెప్పారు.