విజయవాడ విమానాశ్రయానికి రూ.145 కోట్లతో కొత్త రన్వే...
కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక విమానాలు
సాక్షి, విజయవాడ: విమానశ్రయ అభివృద్ధిలో భాగంగా కొత్త రన్‌వే ఏర్పాటుకు రూ.145 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు గన్నవరం విమానాశ్రయం డెరైక్టర్ జి.మధుసూదనరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం విమానశ్రయ అభివృద్ధి, కొత్త విమానాలు రాకపోకలు వంటి అంశాలపై సదస్సు నిర్వహించారు. చాంబర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సదస్సుకు పలువురు పారిశ్రామిక , వ్యాపారవేత్తలు, ఇతర రంగాల ప్రముఖులు హాజరయ్యారు.
ముఖ్యఅతిథి మధుసూదనరావు మాట్లాడుతూ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అందులో భాగంగానే కొత్త రన్‌వే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త టెర్మినల్ నిర్మాణ పనులు రూ.108 కోట్ల అంచనాతో కొనసాగుతున్నట్లు తెలిపారు. నవ్యాంధ్ర రాజధాని నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య 70 శాతం పెరిగినట్లు తెలిపారు. విమానాల రాకపోకలు సైతం 40 శాతం పెరిగినట్లు తెలిపారు. కార్గో భవన నిర్మాణాన్ని రూ.50 లక్షల అంచనాతో చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
ఈ ఏడాది జరగనున్న కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రత్యేక విమానాలు నడపనున్నట్లు విమానాశ్రయం డెరైక్టర్ మధుసూదనరావు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ విమానాలు నడుస్తాయని, అందరికీ అందుబాటులో వుండేలా స్లాట్స్ కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీ చాంబర్ అధ్యక్షుడు (ఎలక్ట్) ముత్తవరపు మురళీకృష్ణ, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పొట్లూరి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.