Airport Development
-
మధురపూడికి మహర్దశ.. రూ.347 కోట్లతో ఎయిర్పోర్ట్ విస్తరణ
సాక్షి, రాజమహేంద్రవరం: ఉభయగోదావరి జిల్లాల వాసులకు గగనతల ప్రయాణ సేవలందిస్తున్న (రాజమహేంద్రవరం) మధురపూడి విమానాశ్రయానికి మహర్దశ పట్టనుంది. ఇందుకోసం భారత పౌర విమానయాన శాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నది. ఈ మేరకు రూ.347.15 కోట్లు విడుదల చేస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. బిల్డింగ్ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభించేందుకు ఆ శాఖ సన్నాహాలు చేస్తోంది. పనులకు రాజమండ్రి ఎయిర్ పోర్ట్ ఇంజినీరింగ్ విభాగం నిర్వహించనుందని జాతీయ విమానాశ్రయం అధికారి అరుణ్‌కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇలా.. మధురపూడి విమానాశ్రయంలో ప్రస్తుతం 3,165 మీటర్ల పొడవున్న రన్‌వే, 11 పార్కింగ్ బేస్‌తో కూడిన ఏఫ్రాన్, 11 విమాన సర్వీసులు ఏకకాలంలో నిలుపుదలకు అవకాశం కలిగిన వసతి ఉంది. 4,065 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న టెర్మినల్ భవనంలో ఏకకాలంలో 225 మంది ప్రయాణికులు స్టే చేసేందుకు సరిపోతుంది. అంతర్జాతీయ స్థాయికి అవసరమైన సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయి. 90 శాతం ఆక్యుపెన్సీతో విమానాలు నడుస్తున్నాయి. విమానాశ్రయం నుంచి ప్రస్తుతం 12 సర్వీసులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నంకు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతి రోజూ 1,200 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. టెర్మినల్ భవన సామర్థ్యం పెంపు.. విమాన రాకపోకల సందర్భంగా ప్రయాణికుల తాకిడి పెరిగింది. ప్రతి రోజూ 1,200 మంది రాకపోకలు సాగిస్తుంటే.. ప్రస్తుతం ఉన్న భవనంలో కేవలం 225 మంది మాత్రమే స్టే చేసేందుకు అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం భవన సామర్థ్యం విస్తరించేందుకు నిధులు మంజూరయ్యాయి. రూ.347 కోట్లతో మరో 16,000 చదరపు గజాలకు విస్తరించేందుకు గానూ నూతన భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. భవన నిర్మాణం పూర్తయితే 1,400 మంది ప్రయాణికులు స్టే చేయవచ్చు. అంతేగాక ఒకేసారి 5 విమానాలు అరైవల్ అయినా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులుండవు. భద్రతలోనూ మేటి ప్రయాణికులు, విమానాశ్రయ భద్రత, రక్షణ విషయంలో మధురపూడి ఏయిర్ పోర్ట్ ప్రత్యేకంగా నిలుస్తుంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దీని నిర్మాణం జరిగింది. యుద్ధ సమయంలో సముద్ర మార్గం ద్వారా రావాణాకు అనువైన ప్రాంతంగా ఖ్యాతి గడించింది. రెండో ప్రపంచ యుద్ధంలో యుద్ద విమానాలను ఇక్కడ ఉంచేవారు. సంతోషంగా ఉంది.. టెర్మినల్ భవన నిర్మాణ అనుమతులు, నిధుల విడుదల కోసం కొన్నేళ్లుగా చేస్తున్న కృషికి ఫలితం దక్కింది. గతేడాది డిసెంబరు 16న జరిగిన బోర్డు మీటింగ్‌లో తీర్మానం చేశాం. కాంపిటేటివ్ అథారిటీ, పరిపాలనా ఆమోదం, వ్యయం మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడటం సంతోషంగా ఉంది. ఇందుకు సంబంధించిన శాంక్షన్ ఆర్డర్స్ సంబంధిత ఉన్నతాధికారులకు అందాయి. –మార్గాని భరత్‌రామ్, ఎంపీ, రాజమహేంద్రవరం పనులు ప్రారంభిస్తాం.. టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు, నిధులు మంజూరయ్యాయి. త్వరలోనే పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రయాణికులకు అధునాతన సేవలు అందించేందుకు భవన నిర్మాణం ఎంతగానో దోహదం చేస్తుంది. ప్రస్తుత సేవలను మరింతగా విస్తరించే వెసులుబాటు కలుగుతుంది. – ఎస్.జ్ఞానేశ్వరరావు, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ -
టాటా ప్రాజెక్ట్స్ చేతికి నోయిడా ఎయిర్పోర్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విభిన్న రంగాల్లో ఉన్న టాటా గ్రూప్ కంపెనీ, మౌలిక రంగ నిర్మాణ సంస్థ టాటా ప్రాజెక్ట్స్ తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణ కాంట్రాక్ట్‌ను చేజిక్కించుకుంది. ఇందులో భాగంగా టెర్మినల్, రన్‌వే, ట్యాక్సీవే, రోడ్లు, విద్యుత్, మంచినీటి ఏర్పాట్లు, అనుబంధ భవనాలను టాటా ప్రాజెక్ట్స్ నిర్మించాల్సి ఉంటుంది. ఎయిర్పోర్ట్ అభివృద్ధి ప్రాజెక్టును 2019లో స్విస్ డెవలపర్ జ్యూరిక్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఏజీ దక్కించుకుంది. విమానాశ్రయ అభివృద్ధికై యమునా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (వైఐఏపీఎల్) పేరుతో స్పెషల్ పర్పస్ వెహికిల్‌ను ఏర్పాటు చేసింది. 1,334 హెక్టార్ల విస్తీర్ణంలో విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. తొలి దశలో ఒకే రన్‌వేతో ఏటా 1.2 కోట్ల మందికి సేవలు అందించే సామర్థ్యంతో రూ.5,700 కోట్ల పెట్టుబడితో ఇది రానుంది. 2024లో విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. -
ఆంకజాతో జీఎంఆర్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్‌పోర్టుల వ్యాపారంలో ఉన్న జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ అనుబంధ కంపెనీ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ నెదర్లాండ్స్ తాజాగా ఆంకజా పురా–2తో షేర్‌హోల్డర్స్, షేర్ సబ్స్క్రిప్షన్ ఒప్పందం చేసుకుంది. ఇండోనేషియా మిడాన్లోని క్వాలనాము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి, కార్యకలాపాలకు సంబంధించిన ప్రాజెక్టును జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఈ ఏడాది నవంబర్‌లో చేజిక్కించుకుంది. ప్రాజెక్టులో జీఎంఆర్‌కు 49 శాతం, ఆంకజా పురా–2నకు 51 శాతం వాటాలు ఉంటాయి. కాంట్రాక్టు ప్రకారం 25 ఏళ్ల పాటు విమానాశ్రయ నిర్వహణ, అభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టాల్సి ఉంటుంది. -
విమానాశ్రయాలపై రూ.20,000 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతమున్న విమానాశ్రయాల విస్తరణ, కొత్త ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి రూ.20,000 కోట్లు వెచ్చిస్తున్నట్టు మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ గ్రూప్ వెల్లడించింది. విమానాశ్రయాల అభివృద్ధి, నిర్మాణంలో ప్రపంచస్థాయి ప్రమాణాలను ఏర్పరిచామని కంపెనీ వార్షిక నివేదికలో గ్రూప్ చైర్మన్ జీఎం రావు తెలిపారు. ‘ఢిల్లీ విమానాశ్రయంలో ప్రస్తుతం మౌలిక వసతుల విస్తరణ, టెర్మినల్ వార్షిక సామర్థ్యం 10 కోట్ల ప్రయాణికుల స్థాయికి పెంపు పనులు జరుగుతున్నాయి. ఫేజ్ 3ఏ విస్తరణ 2023 జూన్ నాటికి పూర్తి కానుంది. 2022 సెప్టెంబర్ నాటికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వార్షిక సామర్థ్యం 3.5 కోట్ల ప్రయాణికుల స్థాయికి చేరుకుంటుంది’ అని వివరించారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, కర్ణాటకలోని బీదర్, ఫిలి ప్పైన్స్‌లోని మక్టన్ సెబు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ నిర్వహిస్తోంది. నాగ్‌పూర్ విమానాశ్రయం..: నాగ్‌పూర్ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ విషయంలో జీఎంఆర్‌కు అనుకూలంగా బాంబే హైకోర్ట్ నాగ్‌పూర్ బెంచ్ తీర్పు వెలువరించిన నేపథ్యంలో కంపెనీ తదుపరి ప్రణాళిక వెల్లడించింది. నాగ్‌పూర్‌లోని బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆధునీకరణ, అభివృద్ధిలో భాగంగా వార్షిక సామర్థ్యాన్ని రాబోయే కాలంలో 3 కోట్ల ప్రయాణికుల స్థాయికి చేర్చనున్నారు. నాలుగేళ్లలో పూర్తి కానున్న తొలి దశలో 40 లక్షల ప్రయాణికులు, 20,000 మెట్రిక్ టన్నుల కార్గోను నిర్వహించే స్థాయికి విమానాశ్రయం చేరనుంది. -
ఎయిర్‌పోర్ట్‌లకు కరోనా కాటు
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన పరిణామాల నేపథ్యంలో విమానాశ్రయాల అభివృద్ధి ప్రాజెక్టులపైనా ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇతర సంస్థలతో తీవ్రంగా పోటీపడి మరీ గతేడాది దక్కించుకున్న మూడు ఎయిర్‌పోర్ట్‌ల అభివృద్ధి పనులను ఇప్పుడప్పుడే చేపట్టలేమంటూ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ (ఏఏఐ)కు అదానీ గ్రూప్ తెలియజేయడం ఇందుకు నిదర్శనం. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏవియేషన్ రంగంలో అనిశ్చితి నెలకొనడంతో ఈ విమానాశ్రయాలను టేకోవర్ చేయడానికి కనీసం 6 నెలల వ్యవధి ఇవ్వాలని కోరింది. ఏఏఐకు కంపెనీ ఈ మేరకు లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒప్పందం ఇలా.. అదానీ గ్రూప్ గతేడాది ఫిబ్రవరిలో ఆరు ఎయిర్‌పోర్టుల అభివృద్ధి కాంట్రాక్టులను దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం వీటిని 50 ఏళ్ల పాటు అదానీ గ్రూప్ ఆపరేట్ చేయొచ్చు. వీటిలో జైపూర్, త్రివేండ్రం, మరో విమానాశ్రయ ప్రాజెక్టు వివాదంలో ఉండటంతో ఏఏఐతో ఇంకా ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. లక్నో, మంగళూరు, అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుల అభివృద్ధి కోసం ఫిబ్రవరి 15న ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ముందుగా రూ.1,500 కోట్లు ఏఏఐకి చెల్లించి ఒప్పందం కుదుర్చుకున్న నాటి నుంచి 180 రోజుల్లోగా అసెట్స్‌ను తన స్వాధీనంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్‌పోర్ట్‌ల నిర్వహణ వ్యాపారం కోసం గ్రూప్ ప్రత్యేకంగా అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ పేరిట మరో సంస్థను కూడా ఏర్పాటు చేసింది. అంచనాలు తల్లకిందులు .. లాండింగ్, పార్కింగ్ చార్జీల్లాంటి ప్రధాన వ్యాపారం కన్నా ఇతరత్రా భారీ ఆదాయాలు ఆర్జించవచ్చనే వ్యూహాలతో అదానీ గ్రూప్ ఎయిర్‌పోర్ట్స్ నిర్వహణ కోసం దూకుడుగా బిడ్డింగ్ చేసింది. ఏరోట్రోపోలిస్, మాల్స్, హోటళ్లు వంటివి ఏర్పాటు చేయడం ద్వారా ఆదాయాలు రాగలవని భావించింది. కానీ ప్రస్తుతం కరోనా వైరస్‌పరమైన పరిణామాలతో ఏవియేషన్ రంగం వ్యాపార అవకాశాలు గణనీయంగా దెబ్బతినడంతో పునరాలోచనలో పడింది. విమాన ట్రాఫిక్ మళ్లీ పూర్వ స్థాయికి తిరిగి రావడానికి కనీసం రెండేళ్లయినా పట్టొచ్చని అంచనా వేస్తోంది. దీంతో వేసుకున్న ప్రణాళికలన్నీ తల్లకిందులయ్యాయి. ఒకవేళ అదానీ గ్రూప్ ఇప్పుడు తప్పుకున్న పక్షంలో ఒక్కో ఎయిర్‌పోర్టుకు రూ. 100 కోట్లు చొప్పున కట్టిన గ్యారంటీని వదులుకోవాల్సి వస్తుంది. అయినప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లో ఈ వ్యాపారంలో ఇరుక్కోవడం కన్నా కాస్తంత ఖర్చయినా తప్పుకోవడమే శ్రేయస్కరం కాగలదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం ఫోర్స్ మెజర్ నిబంధనను ఉపయోగించవచ్చని (తమ చేతుల్లో లేని కారణాల వల్ల కాంట్రాక్టును రద్దు చేసుకోవడం) పేర్కొన్నాయి. అయితే, ఫోర్స్ మెజర్ నిబంధనను ఏకపక్షంగా ఉపయోగించే వీలు ఉండకపోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. దీనికి రెండు పక్షాలు అంగీకరించాల్సి ఉంటుందని వివరించాయి. ఒకవేళ ఎయిర్‌పోర్టుల టేకోవర్‌కు మరింత గడువివ్వాలన్న అదానీ గ్రూప్ ప్రతిపాదనకు ఏఏఐ అంగీకరించని పక్షంలో బిడ్లను రద్దు చేసి, విక్రయ ప్రక్రియను పునఃప్రారంభించాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. ఏదైతేనేం.. ఈ పరిణామాలన్నీ కూడా ప్రభుత్వం భారీగా తలపెట్టిన ప్రైవేటీకరణ ప్రక్రియకు విఘాతం కలిగించేవేనని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. మరో ఆరు విమానాశ్రయాల విక్రయ ప్రక్రియను ఏఏఐ త్వరలో ప్రారంభిస్తుందంటూ కేంద్రం ఇటీవలే ప్రకటించింది. వారణాసి, అమృత్సర్, భువనేశ్వర్, ఇండోర్, రాయపూర్, తిరుచ్చి విమానాశ్రయాలు జాబితాలో ఉన్నాయి. -
జీఎంఆర్‌లో ఫ్రాన్స్ సంస్థకు వాటాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్రాన్స్‌కు చెందిన గ్రూప్ ఏడీపీ తమ ఎయిర్పోర్ట్ వ్యాపార విభాగంలో 49 శాతం వాటాలు కొనుగోలు చేయనున్నట్లు జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెల్లడించింది. ఈ డీల్ విలువ రూ. 10,780 కోట్లు ఉంటుందని పేర్కొంది. దీని ప్రకారం జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ (జీఏఎల్) విలువ సుమారు రూ. 22,000 కోట్లుగా ఉండనుంది. నిర్దిష్ట మైలురాళ్లను సాధించిన పక్షంలో మరో రూ. 4,475 కోట్లు లభించగలవని, దీంతో మొత్తం వేల్యుయేషన్ రూ. 26,475 కోట్ల స్థాయిలో ఉండగలదని జీఎంఆర్ గ్రూప్ తెలిపింది. డీల్ ప్రకారం జీఎంఆర్ గ్రూప్ నుంచి రూ. 9,780 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేయనున్న గ్రూప్ ఏడీపీ.. మరో రూ. 1,000 కోట్లు ఈక్విటీ కింద జీఏఎల్‌లో ఇన్వెస్ట్ చేయనుంది. ‘తొలి విడతలో రూ. 5,248 కోట్లు తక్షణమే జీఎంఆర్ గ్రూప్‌కు లభిస్తాయి. రుణభారాన్ని మరింత తగ్గించుకునేందుకు ఈ నిధులను వినియోగించనున్నాం‘ అని జీఎంఆర్ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. ఒప్పందం ప్రకారం.. ఎయిర్‌పోర్ట్స్ వ్యాపార విభాగంపై జీఎంఆర్‌కు నియంత్రణ కొనసాగుతుంది. ఏడీపీకి జీఏఎల్,కీలక అనుబంధ సం స్థల బోర్డుల్లో ప్రాతినిధ్యం, ఇతర హక్కులు లభిస్తాయి. మరిన్ని అంతర్జాతీయ మార్కెట్లలో ప్రవేశించేందుకు గ్రూప్ ఏడీపీతో భాగస్వామ్యం దోహదపడగలదని జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎం రావు తెలిపారు. మరోవైపు, తమ వ్యూహంలో భాగంగానే జీఏఎల్‌లో వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు గ్రూప్ ఏడీపీ చైర్మన్ అగస్టిన్ డి రొమానెట్ పేర్కొన్నారు. 33.6 కోట్ల ప్రయాణికులు.. జీఏఎల్, గ్రూప్ ఏడీపీ కలిసి 2019లో దాదాపు 33.65 కోట్ల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేసినట్లు జీఎంఆర్ పేర్కొంది. ఇది ప్రపంచంలోనే అత్యధికమని వివరించింది. గ్రూప్ ఏడీపీ సంస్థ.. విమానాశ్రయాల అభివృద్ధి, నిర్వహణ వ్యాపార కార్యకలాపాలు సాగిస్తోంది. ప్యారిస్‌లోని చార్లెస్ డి గాల్, ఒర్లి మొదలైనవి వీటిలో ఉన్నాయి. రూ.1,075 కోట్లు సమీకరించిన జీఎంఆర్ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ అనుబంధ కంపెనీ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. సీనియర్ సెక్యూర్డ్ నోట్స్ జారీ ద్వారా రూ.1,075 కోట్లు సమీకరించినట్లు జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ గ్రంధి కిరణ్ కుమార్ తెలిపారు. -
విజయవాడ విమానాశ్రయానికి రూ.145 కోట్లతో కొత్త రన్‌వే...
కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక విమానాలు సాక్షి, విజయవాడ: విమానశ్రయ అభివృద్ధిలో భాగంగా కొత్త రన్‌వే ఏర్పాటుకు రూ.145 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు గన్నవరం విమానాశ్రయం డెరైక్టర్ జి.మధుసూదనరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం విమానశ్రయ అభివృద్ధి, కొత్త విమానాలు రాకపోకలు వంటి అంశాలపై సదస్సు నిర్వహించారు. చాంబర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సదస్సుకు పలువురు పారిశ్రామిక , వ్యాపారవేత్తలు, ఇతర రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యఅతిథి మధుసూదనరావు మాట్లాడుతూ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అందులో భాగంగానే కొత్త రన్‌వే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త టెర్మినల్ నిర్మాణ పనులు రూ.108 కోట్ల అంచనాతో కొనసాగుతున్నట్లు తెలిపారు. నవ్యాంధ్ర రాజధాని నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య 70 శాతం పెరిగినట్లు తెలిపారు. విమానాల రాకపోకలు సైతం 40 శాతం పెరిగినట్లు తెలిపారు. కార్గో భవన నిర్మాణాన్ని రూ.50 లక్షల అంచనాతో చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది జరగనున్న కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రత్యేక విమానాలు నడపనున్నట్లు విమానాశ్రయం డెరైక్టర్ మధుసూదనరావు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ విమానాలు నడుస్తాయని, అందరికీ అందుబాటులో వుండేలా స్లాట్స్ కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీ చాంబర్ అధ్యక్షుడు (ఎలక్ట్) ముత్తవరపు మురళీకృష్ణ, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పొట్లూరి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
విమానాశ్రయ అభివృద్ధికి చర్యలు
కోరుకొండ : మధురపూడి విమానాశ్రయం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ అన్నారు. మంగళవారం నిడిగట్ల గ్రామంలో రోడ్డు శంకుస్థాపనలో పాల్గొనడానికి వచ్చిన ఎంపీ మాట్లాడుతూ జూన్ లో ఉదయం, రాత్రి ప్రత్యేక విమానం తిరుగుతుందని అందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నామన్నారు. విమానాశ్రయ విస్తరణలో రన్‌వేను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఒకేసారి మూడు విమానాలు దిగేలా చర్యలు చేపట్టామన్నారు. రాజమండ్రి నుంచి బూరుగుపూడి వరకు రోడ్డుకిరువైపులా వెడల్పు చేయడంతో భూముల రేట్లు పెరుగుతున్నాయన్నారు. విమానాశ్రయ విస్తరణ పనులో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానన్నారు. రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో జరిగే నంది మహోత్సవాలకు ప్రజాదరణ బాగుందన్నారు. విమాన విస్తరణలో పొలాలు, చెట్లుపోయిన రైతులకు చేయూతనిస్తామని రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ అన్నారు. సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలకు రైతుల మొర : మార్కెట్ ధర ప్రకారం నష్ట పరిహారం ఇప్పించాలని మధురపూడి విమానాశ్రయ విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులు విజ్ఞప్తి చేశారు. ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌లకు బూరుగుపూడి, మధురపూడి రైతులు వినతిపత్రాలు అంద జేశారు.