మీ బ్యాంకుకు మీరు వీఐపీనా?
♦ ప్రీమియం కస్టమర్లయితే ప్రత్యేక సేవలు
♦ లావాదేవీలపై పరిమితులే కాదు... చార్జీలూ ఉండవు
♦ లాకర్లు, అడ్వయిజరీ సేవలూ అందించేందుకు సిద్ధం
♦ ఇంటి ముంగిటకే సేవలు; రుణాలపై వడ్డీలోనూ రాయితీ
♦ రిలేషన్ షిప్ వాల్యూ మాత్రం కాస్త ఎక్కువే ఉండాలి
♦ బ్యాంకులను బట్టి మారుతున్న రిలేషన్‌షిప్ వాల్యూ
ఈ మధ్య బ్యాంకంటేనే భయమేస్తోంది. ఎందుకంటే అన్ని సేవలపైనా చార్జీల బాదుడు షురూ అయింది. ఏటీఎం లావాదేవీల నుంచి మొదలు పెడితే... శాఖల్లో నగదు ఉపసంహరణ, డిపాజిట్ సహా ఇదివరకు ఉచితంగా లభించిన సేవలన్నీ ఇపుడు షరతులతోను, చార్జీలతోను మాత్రమే అందుతున్నాయి. కాకపోతే ఇవన్నీ సామాన్య ఖాతాదారులకే సుమండీ!!. ప్రీమియం ఖాతాదారులకు ఇలాంటి షరతులేవీ లేవు. అధిక మొత్తంలో వ్యాపారాన్నిస్తున్నారు కనక వీరికి ప్రివిలేజ్ బ్యాంకింగ్ పేరిట రెడ్ కార్పెట్ వేసి మరీ వీఐపీ సేవలందిస్తున్నాయి. బ్యాంకు బ్రాంచుల్లో నిర్వహించే నగదు లావాదేవీలు మాత్రమే కాదు!. ఏటీఎం లావాదేవీలు, ఆఖరికి డిమాండ్ డ్రాఫ్ట్‌ల జారీ వంటి సేవలు కూడా వీరికి ఉచితమే!! అదీ లెక్క. ఆ వీఐపీ సేవలు ఎవరికిస్తున్నారో... ఎలా ఇస్తున్నారో... వాటిని అందుకోవాలనుకునేవారు ఏం చేయాలో వివరించే కథనమే ఇది...
ఇక్కడ సేవలన్నీ ప్రత్యేకమే...
రుణాలపై వడ్డీ రేటులో కూడా తమ వీఐపీ కస్టమర్లకు బ్యాంకులు ప్రాధాన్యమిస్తున్నాయి. అంటే సాధారణ ఖాతాదారులతో పోలిస్తే వీరికిచ్చే రుణాలపై వడ్డీ రేటు తక్కువే ఉంటుంది. లాకర్లపై చార్జీలు కూడా ఉండవు. అంతేకాదు!! వీరికి మంచి ప్రీమియం లాకర్లను కేటాయిస్తున్నాయి. వీరు పిలిస్తే పలికేందుకు, కావాల్సిన సేవలు అందించేందుకు రిలేషన్‌షిప్ అధికారుల పేరిట ప్రత్యేక సిబ్బంది, వీరికోసం టోల్ ఫ్రీ నంబర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. డిపాజిట్ చేయాలన్నా, డిమాండ్ డ్రాఫ్ట్ కావాలన్నా ఇంటి వద్దకే వచ్చి నగదు స్వీకరించడం, విత్‌డ్రాల విషయంలో ఇంటికే వచ్చి నగదు చెల్లించడం తదితర సేవలను అందిస్తున్నాయి. అంతేకాదు! పలు బ్యాంకులు వీరికోసం అదనపు వేళలు పనిచేస్తున్నాయి.
ఇక రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితుల్లోనూ వీరికి ప్రత్యేక నియమాలున్నాయి. బ్యాంకు శాఖల్లో వీరి కోసం ప్రత్యేక కౌంటర్లు కూడా ఉంటున్నాయి. ఇవికాక అత్యాధునిక ప్లాస్టిక్ కార్డులు, ఇంధన సర్‌చార్జీల ఎత్తివేతతో పాటు షాపింగ్, పర్యటనలు, రెస్టారెంట్లకు సంబంధించిన ఆఫర్లు కూడా అందిస్తున్నాయి. ఖాతాల్లో కనీస నగదు నిల్వలు ఉంచకపోయినా, ఫిక్స్‌డ్ డిపాజిట్లను గడువుకు ముందే రద్దు చేసుకున్నా గానీ చార్జీలు విధించడం లేదు!! అడిగిన వారి విషయంలో పెట్టుబడులకు సంబంధించి వీరికి ప్రత్యేకమైన సలహా సేవలు కూడా అందిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకులు ఈ సేవల్లో ముందుంటున్నాయి. భిన్నమైన ఉత్పత్తులు, సేవలతో సంపన్న ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి.
ఈ సేవలు... ఎవరికేంటి?
సేవలన్నీ బాగానే ఉన్నాయి. మరి బ్యాంకుల నుంచి ఇలాంటి వీఐపీ సేవలు పొందాలంటే ఏం చేయాలి...? ఇందుకోసం బ్యాంకులకు ఆ మేరకు వ్యాపారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్యాంకులు ఈ తరహా సేవలందించేందుకు అధిక వ్యయం చేయాల్సి వస్తుంది. అందుకే అవి కస్టమర్ల నుంచి అధిక వ్యాపారాన్ని ఆశిస్తున్నాయి. ఇందుకోసం రిలేషన్‌షిప్ వాల్యూ అధికంగా ఉండాలి. ఖాతాలో బ్యాలెన్స్‌లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, బీమా పాలసీలు, పెట్టుబడులు, రుణాలు ఇవన్నీ కలిపి బ్యాంకులు ఆశిస్తున్న విలువ మేర కొనసాగిస్తే... వారికి సేవలన్నీ ఎంచక్కా ప్రీమియం స్థాయిలో అందుతాయి.
ప్రయోజనమేనా...?
ప్రైవేటు బ్యాంకుల్లో ఆర్‌బీఎల్ ప్రిఫర్డ్ బ్యాంకింగ్ సేవల కోసం సులభమైన నిబంధనలు విధించింది. కేవలం రూ.15 లక్షల రిలేషన్‌షిప్ వాల్యూ కలిగి ఉంటే సరిపోతుంది. ఇక, ఐసీఐసీఐ బ్యాంకు అర్హతలు మధ్యస్తంగా ఉన్నాయి. సిటీబ్యాంకులో ఇది మరీ ఎక్కువ. అయితే, ఈ తరహా సేవలకు ఓకే చెప్పే ముందే... ఏ సేవలు అందుతాయి? వేటికి చార్జీల మినహాయింపులున్నాయి? రుణాల్లో వడ్డీపై రాయితీలు ఇస్తున్నాయా? ఇలా అన్ని అంశాలనూ ఓసారి గమనించాలి. సంపద నిర్వహణకు సంబంధించి (వెల్త్ మేనేజ్‌మెంట్) బ్యాంకు అదే పనిగా ఇస్తున్న సలహాలు, పోర్ట్‌ఫోలియోలో మార్పులతో ప్రయోజనం కలగకపోవచ్చు. అందుకే బ్యాంకుల్లో వీఐపీ ట్రీట్‌మెంట్ ఆశించే దృష్టితో కాకుండా వాస్తవానికి మీకు ఏ సేవలు అవసరమన్న దానిపై దృష్టి పెట్టాలి. కనీస రిలేషన్‌షిప్ వాల్యూను కొనసాగించడంలో విఫలమైతే బ్యాంకులు సంబంధిత ఖాతాలను సాధారణ ఖాతాల కిందకు మార్చేస్తాయి. దీంతో సాధారణ ఖాతాదారులకు విధించే అన్ని చార్జీలు, ఏటీఎం ఉచిత లావాదేవీ పరిమితులు అమలవుతాయి.
నచ్చితే మరో మెట్టు పైకి
ప్రీమియం సేవలకు ముగ్ధులై బ్యాంకుతో మరింత పెద్ద మొత్తంలో రిలేషన్‌షిప్ వాల్యూకి సిద్ధమైతే మరో మెట్టు ముందుకు తీసుకెళ్లేందుకూ పలు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి. రూ.కోట్ల రూపాయల రిలేషన్‌షిప్ వాల్యూకు ముందుకు వస్తే లగ్జరీ బ్యాంకింగ్ సేవలు అందుకోవచ్చు. వీరికి సీనియర్ బ్యాంకర్లు వ్యక్తిగతంగా సలహాలు, సూచనలు అందిస్తారు. కోరితే వారికోసమే ప్రత్యేకంగా సేవలు రెడీ అవుతాయి కూడా!!.
ఏ బ్యాంకుకు... ఎవరు వీఐపీ?
మరి వీఐపీ అంటే ఎవరు? రిలేషన్ షిప్ వాల్యూ ఎంతుండాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు బ్యాంకులను బట్టి మారుతుంటాయి. ఉదాహరణకు ఆర్‌బీఎల్ బ్యాంకు సిగ్నేచర్ బ్యాంకింగ్ పేరిట ఖాతాదారులకు ప్రీమియం సర్వీసులను ఆఫర్ చేస్తోంది. వీటిని పొందాలంటే ఖాతాదారుడు కనీసం రూ.15 లక్షల రిలేషన్‌షిప్ వాల్యూ (మొత్తం విలువ) కలిగి ఉండాలి. సేవింగ్స్ ఖాతా అయితే నెలవారీ రూ.2 లక్షల కనీస నగదు నిల్వలు, కరెంటు ఖాతా అయితే రూ.5 లక్షల కనీస బ్యాలెన్స్‌ను ఉంచాల్సి ఉంటుంది. అదే ఐసీఐసీఐ బ్యాంకు వెల్త్ కస్టమర్ అయితే రూ.25 లక్షల రిలేషన్‌షిప్ వాల్యూను బ్యాంకుతో కలిగి ఉండాలి. సేవింగ్స్, కరెంటు ఖాతాల బ్యాలెన్స్‌లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, బీమా పాలసీల ప్రీమియం కూడా ఇందులో భాగమే. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఇంపీరియా ప్రోగ్రామ్ సేవల కోసం సేవింగ్స్ ఖాతా బ్యాలెన్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో రూ.30 లక్షల విలువను కొనసాగించాలి. లేదా త్రైమాసికంవారీగా సేవింగ్స్ ఖాతాలో అయితే రూ.10 లక్షల కనీస బ్యాలెన్స్, కరెంటు ఖాతాలో అయితే రూ.15 లక్షల బ్యాలెన్స్‌ను నిర్వహించడం తప్పనిసరి.
కోటక్ మహింద్రా బ్యాంకు ప్రైవీలీగ్ బ్యాంకింగ్ పేరిట నాలుగు రకాల ఆప్షన్లను ఆఫర్ చేస్తోంది. ఇన్‌సిగ్నియా, ఆప్టిమా, ప్రైమా, మ్యాక్సిమా అంటూ సేవలను వర్గీకరించింది. ఇన్‌సిగ్నియా కస్టమర్ బ్యాంకుతో రూ.కోటి రిలేషన్‌షిప్ వాల్యూ కలిగి ఉండాలి. నెలవారీగా రూ.2.5 లక్షల బ్యాలెన్స్ ఉంచాలి. ఆప్టిమా కస్టమర్ అయితే రూ.30 లక్షల రిలేషన్‌షిప్ వ్యాల్యూ, ఖాతాలో నెలవారీ కనీస బ్యాలెన్స్ రూ.2.5 లక్షలు కలిగి ఉండాలి. సిటీబ్యాంకు ఇండియా సైతం ‘సిటీగోల్డ్’ పేరిట ప్రివిలేజ్ బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. ఇందుకోసం ఖాతాదారులు బ్యాంకుతో కనీసం రూ.75 లక్షల రిలేషన్‌షిప్ వాల్యూ కలిగి ఉండాలి. సేవింగ్స్, కరెంట్ ఖాతాల్లోని బ్యాలెన్స్‌లు, డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, రుణాలు (గృహ రుణం కూడా), బీమా ప్రీమియం, డీమ్యాట్ ఖాతాలోని హోల్డింగ్స్‌ను కూడా రిలేషన్‌షిప్ వాల్యూ కోసం పరిగణనలోకి తీసుకుంటోంది. హెఎస్‌బీసీ ప్రీమియం బ్యాంకింగ్ సేవల కోసం ఖాతాదారులు కనీసం రూ.40 లక్షల రిలేషన్‌షిప్ వాల్యూను కలిగి ఉండాలి.