హోదా ఊహించిందే: ఎస్‌బీఐ
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)ను వ్యవస్థాగతంగా కీలకమైన బ్యాంకుగా (డీ-ఎస్‌ఐబీ) రిజర్వ్ బ్యాంక్ గుర్తించటం ఊహించిందేనని ఆ బ్యాంక్ చీఫ్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. అయితే తాజా ముసాయిదా మార్గదర్శకాల ప్రకారం టైర్1 క్యాపిటల్ అవసరానికి సంబంధించి అదనపు మూలధనం 20 బేసిస్ పాయింట్లు తక్కువగా ఉందని ఆమె అన్నారు. బ్యాంకుకు ప్రస్తుతం 9.62 శాతం టైర్1 మూలధనం ఉంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం అవసరమైన మూలధనం 7 శాతం కన్నా ఇది అధికం. ఎస్‌బీఐ సహా ఐసీఐసీఐ బ్యాంక్‌కు (డీ-ఎస్‌ఐబీ) ఈ హోదా కల్పిస్తున్నట్లు ఆర్‌బీఐ సోమవారం పేర్కొంది. ఇవి భారీ స్థాయిలో ఆర్థిక సేవలు అందిస్తున్నందున... ఒకవేళ వీటి సర్వీసులకు విఘాతం కలిగినా ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి సమస్యలు రాకుండా, వీటికి మరింత అత్యున్నత స్థాయి పర్యవేక్షణ నిబంధనలు వర్తిస్తాయని ఆర్‌బీఐ పేర్కొంది.