
సాక్షి, అమరావతి: దేశీయ యువత తక్కువ బరువు ఉన్న స్పోర్ట్స్ షూలవైపు అత్యధికంగా మొగ్గుచూపుతున్నారని, ఒకసారి విడుదలైన మోడల్ ఆరు నెలలకు మించి ఉండటం లేదని ప్రముఖ పాదరక్షల సంస్థ ‘వాకరూ’ చైర్మన్ వి.నౌషద్ తెలిపారు. దేశీయ మిలీనియల్స్(యువత) ప్రతీ ఆరు నెలలకు ఒకసారి మోడల్స్‌ను మార్చేస్తున్నారని, ఇందుకోసం పాదరక్షల సంస్థ కొత్త మోడల్స్ విడుదలపై అత్యధికంగా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం విజయవాడ పర్యటలనకు వచ్చిన నౌషద్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. పాదరక్షల విషయంలో ప్రజల అభిరుచులు, అభిప్రాయాలు వేగంగా మారుతున్నాయి, గతంలో కేవలం ఒక జత చెప్పులతో సరిపెడితే ఇప్పుడు సగటున అందరి వద్ద రెండు కంటే ఎక్కువ జతలు ఉంటున్నాయన్నారు. కానీ ఇది అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే చాలా తక్కువని, ఆ దేశాల్లో ప్రతీ ఒక్కరు సగటున 4–6 జతలు కలిగి ఉంటున్నారన్నారు. దీంతో దేశీయ పాదరక్షల రంగం వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు అనేకమున్నాయన్నారు. ప్రస్తుతం దేశీయ పాదరక్షల పరిశ్రమ ఏటా 10 శాతం వృద్ధితో రూ.40,000 కోట్లకు చేరిందన్నారు. ఇందులో అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో దేశీయ తయారీ సంస్థలు ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు.
కొత్త మోడల్స్ విడుదల
యువతను ఆకర్షించే విధంగా ఈ ఏడాది వాకరూ నుంచి కనీసం 100కు పైగా మోడల్స్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇప్పుడు యువత చెప్పుల కంటే షూలకు ఎక్కువ మొగ్గు చూపుతుండటంతో షూలో కొత్త మోడల్స్ విడుదలపై ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం 100 మందికి పైగా ఆర్‌అండ్‌డీ సిబ్బంది పనిచేస్తుండటమే కాకుండా యూరోపియన్ డిజైనర్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. వాకరూకు దేశవ్యాప్తంగా ఉన్న 15 తయారీ కేంద్రాల నుంచి రోజుకు 5 లక్షల జతలు తయారవుతున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లా తడ వద్ద ఉన్న తయారీ కేంద్రంలో 500 మంది పనిచేస్తున్నట్లు తెలిపారు.
సొంత షోరూంలు ఏర్పాటు
ఇప్పటివరకు డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్ల విక్రయాల ద్వారా అమ్మకాలు చేస్తున్న తాము ఇక నుంచి ‘వాకరూ’ బ్రాండ్ పేరుతో ప్రత్యేక షోరూంలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్తు తెలిపారు. ఈ ఏడాది దక్షిణాది రాష్ట్రాల్లోని ముఖ్యమైన పట్టణాల్లో కనీసం 30 ఔట్‌లెట్లను ఫ్రాంచైజీ మోడల్‌లో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అదే విధంగా ఆన్‌లైన్ విక్రయాలపై కూడా ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్తు వివరించారు. ఇప్పటి వరకు కేవలం ఫ్లిఫ్‌కార్ట్ ద్వారా మాత్రమే విక్రయాలు జరుపుతున్నామని త్వరలోనే అమెజాన్‌తో పాటు మరికొన్ని ఆన్‌లైన్ రిటైల్ పోర్టల్స్‌తో పాటు సొంత పోర్టల్ ద్వారా కూడా ప్రొడక్టులను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆదాయంలో కేవలం ఒక శాతంలోపు ఆన్‌లైన్ అమ్మకాల ద్వారా వస్తుంటే వచ్చే రెండేళ్లలో 5 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
రూ. 1,000 కోట్ల వ్యాపార లక్ష్యం
2013లో ప్రారంభించిన వాకరూ ప్రస్తుత వ్యాపార పరిమాణం రూ.480 కోట్లకు చేరుకుందని, ఈ సంవత్సరం ఈ మొత్తం రూ.1,000 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కొత్త మోడల్స్, ప్రత్యేక ఔట్‌లెట్లు, భారీ ప్రచారం వంటి కారణాలతో ఈ ఏడాది వ్యాపారంలో రెట్టింపు వృద్ధిని ఆశిస్తున్నట్లు తెలిపారు. వాకరూ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆమిర్‌ఖాన్‌ను ఎంపిక చేయడమే కలిసోచ్చే అంశమన్నారు. ఈ ఏడాది ప్రచారం కోసం రూ.30 కోట్లు వ్యయం చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 550 డిస్ట్రిబ్యూటర్లు, 1.5 లక్షల మంది రిటైలర్లను కలిగి ఉన్నట్లు తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment