హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇటీవలే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ లైసెన్సు పొందిన స్టాక్ బ్రోకింగ్ సంస్థ జీరోధా త్వరలో రుణాల విభాగంలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ ఆర్థిక సంవత్సరం మధ్య నాటికి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని జీరోధా వైస్ ప్రెసిడెంట్ (ఎడ్యుకేషనల్ సర్వీసెస్) కార్తీక్ రంగప్ప వెల్లడించారు. షేర్లపై చిన్న మొత్తాల్లో స్వల్పకాలిక రుణాలు ఇవ్వనున్నట్లు మంగళవారమిక్కడ విలేకరులతో చెప్పారు.
2017–18లో తమ యూజర్ల సంఖ్య 8 లక్షలకు చేరిందని, వీరిలో యాక్టివ్ యూజర్స్ సంఖ్య 5.5 లక్షల పైచిలుకు ఉందని తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరం యూజర్ల సంఖ్యను 10–12 లక్షలకు చేర్చుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన వివరించారు. తెలంగాణలో తమకు 41,000 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 31,000 మంది క్లయింట్స్ ఉన్నారని జీరోధా ఏవీపీ సల్మాన్ ఖురేషి తెలిపారు. దేశవ్యాప్తంగా 25 శాఖలు, 96 పార్ట్‌నర్ ఆఫీసులు ఉన్నట్లు వివరించారు.
మరోవైపు, నేరుగా మ్యూచువల్ ఫండ్ సంస్థల నుంచి ఫండ్స్ కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించేలా గతేడాది ప్రారంభించిన ’కాయిన్’ ప్లాట్‌ఫాం ద్వారా ఇప్పటిదాకా రూ.1,100 కోట్ల మేర పెట్టుబడులు జరిగాయని కార్తీక్ చెప్పారు. ఈ ప్లాట్‌ఫాం ద్వారా నెలకు రూ.5,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే.. పాతికేళ్లలో రూ.28 లక్షల దాకా కమీషన్లను ఆదా చేసుకున్నట్లవుతుందని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment