
తీవ్ర హెచ్చుతగ్గులకు అవకాశం
► డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యం
►వర్షాలు, క్యూ1 ఫలితాలపై ఇన్వెస్టర్ల దృష్టి
►విదేశీ పెట్టుబడులు, ఆయిల్ ధరలూ కీలకమే
►ఈ వారం మార్కెట్లపై స్టాక్ నిపుణుల అంచనా
►రంజాన్ సందర్భంగా ట్రేడింగ్ 4 రోజులకే పరిమితం
న్యూఢిల్లీ: కార్పొరేట్ దిగ్గజాల ఫలితాలు, రుతుపవన కదలికలు ఈ వారం మార్కెట్లపై ప్రభావాన్ని చూపనున్నట్లు స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు జూలై నెల డెరివేటివ్స్ గురువారం(31న) ముగియనున్న నేపథ్యంలో మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశమున్నదని అంచనా వేశారు. వీటికితోడు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడులు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరల తీరు వంటి అంశాలు సైతం కీలకం కానున్నాయని చెప్పారు. కాగా, ఈదుల్ ఫితర్(రంజాన్) సందర్భంగా మంగళవారం(29న) మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది.
ఆటో రంగంపై చూపు
జూలై నెలకు వాహన విక్రయ గణాంకాలు శుక్రవారం వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆటో రంగ షేర్లపై దృష్టిపెడతారని విశ్లేషకులు పేర్కొన్నారు. ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కావడంతోపాటు, ఎఫ్‌అండ్ వో ముగింపు కారణంగా ఈ వారం ఇండెక్స్‌లు ఒడిదుడుకులను చవిచూస్తాయని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్‌లిక్ అభిప్రాయపడ్డారు. గురువారం పారిశ్రామిక కార్మిక సంబంధ రిటైల్ ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు వెలువడనుండటంతో ఇన్వెస్టర్లు ఆవైపు చూపు నిలుపుతారని తెలిపారు. వీటితోపాటు జూలై సిమెంట్ అమ్మకాలు, హెచ్‌ఎస్‌బీసీ తయారీ రంగ గణాంకాలూ వెల్లడికానున్నాయి.
ఫలితాల జాబితాలో బ్లూచిప్స్
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్) కాలానికి ఫలితాలు ప్రకటించనున్న బ్లూచిప్ కంపెనీల జాబితాలో హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, సెసాస్టెరిలైట్, డాక్టర్ రెడ్డీస్, ఎన్‌టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, డీఎల్‌ఎఫ్ తదితరాలున్నాయి. దేశీ కంపెనీల క్యూ1 ఫలితాల వె ల్లడి దాదాపు చివరిస్థాయికి చేరుకున్న నేపథ్యంలో మార్కెట్లు హెచ్చుతగ్గులను చవిచూస్తాయని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ అంచనా వేశారు.
ఐసీఐసీఐ, మారుతీతోపాటు ఐటీసీ, ర్యాన్‌బాక్సీ, ఎంఅండ్‌ఎం, టెక్ మహీంద్రా వంటి కంపెనీల ఫలితాల కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయంగా చూస్తే ఉక్రెయిన్, ఇజ్రాయెల్ సంక్షోభాలనూ మార్కెట్లు నిశితంగా పరిశీలిస్తాయన్నారు. ఇలాంటి అంశాలు పసిడి వంటి రక్షణాత్మక పెట్టుబడులవైపునకు దారిచూపిస్తాయని చెప్పారు. మరోపక్క, పాలసీ సమీక్షలో భాగంగా రెండు రోజుల సమావేశాన్ని నిర్వహించనున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశంపైనా ఇన్వెస్టర్లు దృష్టి నిలుపుతారని చెప్పారు. గడిచిన వారం సెన్సెక్స్ 485 పాయింట్లు ఎగసి 26,127 వద్ద ముగియడం తెలిసిందే.
ఎఫ్‌ఐఐల పెట్టుబడుల జోరు..
ఈ నెలలో ఇప్పటివరకూ దేశీ క్యాపిటల్ మార్కెట్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) 5 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. ఈ బాటలో జనవరి మొదలు ఇప్పటివరకూ ఎఫ్‌ఐఐల పెట్టుబడులు 25 బిలియన్ డాలర్లకు చేరాయి. జూలై 1-25 మధ్య ఈక్విటీలలో 2.2 బిలియన్ డాలర్లను(రూ. 13,166 కోట్లు) ఇన్వెస్ట్‌చేయగా, 3 బిలియన్ డాలర్ల(రూ. 17,829 కోట్లు) విలువైన డెట్ సెక్యూరిటీలను కొనుగోలు చేశారు. వెరసి జూలైలో మొత్తం ఎఫ్‌ఐఐల పెట్టుబడులు నికరంగా 5.2 బిలియన్ డాలర్లను(రూ. 31,000 కోట్లు) తాకాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించిన తాజా గణాంకాలివి. నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, తీసుకువస్తున్న సంస్కరణలు వంటి అంశాలు ఎఫ్‌ఐఐలకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు నిపుణులు విశ్లేషించారు.
చిన్న షేర్లే మిన్న...
గత కొన్ని నెలలుగా బుల్లిష్ ధోరణిలో కొనసాగుతున్న మార్కెట్లో మధ్య(మిడ్), చిన్న(స్మాల్) తరహా షేర్లు ప్రధాన ఇండెక్స్‌లను మించి పురోగమించాయి. జనవరి నుంచి చూస్తే మార్కెట్ల ప్రామాణిక సూచీ అయిన బీఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్ సెన్సెక్స్ 23% పుంజుకుంది. అయితే ఇదే సమయంలో మిడ్ క్యాప్ సూచీ దాదాపు 37% దూసుకెళ్లగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 53% జంప్ చేసింది. తద్వారా ఇటీవల మార్కెట్లపట్ల అత్యంత ఆసక్తి చూపుతున్న రిటైల్ ఇన్వెస్టర్లకు భారీ లాభాలు అందించాయని నిపుణులు పేర్కొన్నారు. కాగా, గత నాలుగేళ్ల అనిశ్చిత మార్కెట్లో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు భారీగా నష్టపోయిన నేపథ్యంలో ప్రస్తుత ర్యాలీలో ఇవి సహజంగానే జోరు చూపుతున్నాయనేది మార్కెట్ నిపుణుల అభిప్రాయం.