ఒడిదుడుకుల వారం
♦ ఎఫ్ అండ్ ఓ ముగింపు నేపథ్యంలో మార్కెట్లో హెచ్చుతగ్గులు
♦ ఈ నెల 24న శివరాత్రి సెలవు
♦ ట్రేడింగ్ నాలుగు రోజులే
న్యూఢిల్లీ: ఫిబ్రవరి సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా ఈ వారం స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులమయంగా సాగవచ్చని నిపుణులు అంటున్నారు. శివరాత్రి సందర్భంగా ఈ నెల 24(శుక్రవారం) స్టాక్ మార్కెట్‌కు సెలవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానున్నది. ప్రస్తుతం జరుగుతున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు, డాలర్‌తో రూపాయి మారకం, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల గమనం, ప్రపంచ స్టాక్ మార్కెట్ల పోకడ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి...తదితర అంశాలు కూడా స్టాక్ మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పరిమిత శ్రేణిలో మార్కెట్..
దేశీయంగా ప్రధాన సంఘటనలేవీ లేనందున మన మార్కెట్‌పై అంతర్జాతీయ సంకేతాలే ప్రభావం చూపుతాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డైరెక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు(ఈ నెల 23–గురువారం) కారణంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ట్రేడర్లు తమ పొజిషన్లను రోల్ ఓవర్ చేస్తారని, ఫలితంగా ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయని వివరించారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో పోలింగ్ సరళి ప్రభావం మార్కెట్‌పై ఉంటుందని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ వస్తుందన్న సంకేతాలు వెలువడితే స్టాక్ మార్కెట్లో ర్యాలీ వస్తుందని వివరించారు. మొత్తం మీద ఈ వారంలో స్టాక్ సూచీలు పరిమిత శ్రేణిలోనే కదలాడుతాయని ఆయన అంచనా వేస్తున్నారు.
దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా చెప్పుకోదగ్గ ప్రధాన సంఘటనలేవీ లేనందున మార్కెట్ స్తబ్ధుగానే ఉండొచ్చని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ డైరెక్టర్ అభ్నిష్ కుమార్ సుధాంశు చెప్పారు. ట్రేడర్లు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, స్తంభించిపోయిన పలు ప్రాజెక్టుల భవితవ్యం ఈ ఎన్నికల ఫలితాలు తేలుస్తాయని వివరించారు.
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మార్కెట్లో స్వల్పకాలంలో ర్యాలీ ఉంటుందని కోటక్ సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపేన్ షా చెప్పారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు ప్రస్తుత ప్రభుత్వానికి కీలకమని శామ్‌కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ చెప్పారు. యూపీ ఫలితాలపైననే సంస్కరణల వేగం అధారపడి ఉందని పేర్కొన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు వచ్చే నెల 11న జరుగుతుంది. నిఫ్టీ 8,900 పాయింట్లను చేరితే లాభాల స్వీకరణ చోటు చేసుకుంటుందని జైఫిన్ అడ్వైజర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దేవేంద్ర నేవ్‌గి చెప్పారు.
ఇక అంతర్జాతీయంగా చూస్తే యూరోజోన్, అమెరికా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ గణాంకాలు ఈ వారంలోనే రానున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్‌కు సంబంధించిన విధానాల రూపకల్పన విభాగం ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌ఓఎంసీ), ఆర్‌బీఐ ఎంపీసీ(మానిటరీ పాలసీ కమిటీ) సమావేశ మినట్స్ కూడా ఈ వారంలోనే వెల్లడవుతాయి. గత వారంలో సెన్సెక్స్135 పాయింట్లు, లాభపడి 28,469 పాయింట్ల వద్ద, నిఫ్టీ 28 పాయింట్లు లాభపడి 8,822 పాయింట్ల వద్ద ముగిశాయి.
విదేశీ పెట్టుబడుల జోరు..
భారత క్యాపిటల్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. ఈ నెలలో ఇప్పటిదాకా ఎఫ్‌పీఐలు రూ.9,500 కోట్లు పెట్టుబడులు పెట్టారు. విదేశీ ఇన్వెస్టర్లకు సంబంధించి పన్ను నిబంధనల్లో స్పష్టత కారణంగా ఈ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయని నిపుణులంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెల 17వ తేదీ వరకూ మన స్టాక్ మార్కెట్లో రూ.3,002 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.6,559 కోట్లు వెరశి మన క్యాపిటల్ మార్కెట్లో రూ.9,561 కోట్లను నికరంగా ఇన్వెస్ట్ చేశారు. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది జనవరి మధ్య కాలానికి విదేశీ ఇన్వెస్టర్లు రూ.80,310 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.