న్యూఢిల్లీ: సెలవుల కారణంగా మూడురోజులు మాత్రమే ట్రేడింగ్ జరిగే ఈ వారంలో మార్కెట్...ప్రపంచ సంకేతాలకు అనుగుణంగా కదులుతుందని విశ్లేషకులు చెపుతున్నారు. అమెరికా–చైనాల మధ్య తాజాగా తలెత్తిన వాణిజ్య యుద్ధం విస్త్రతమవుతుందన్న భయాలు, మార్చి డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియనుండటం వంటి అంశాల కారణంగా ఈక్విటీల్లో ఒడిదుడుకులు చోటుచేసుకుంటాయని వారు హెచ్చరిస్తున్నారు.
మహవీర్ జయంతి, గుడ్‌ఫ్రైడే పండుగలతో వచ్చే గురు, శుక్రవారాల్లో (మార్చి 28, 29 తేదీలు)మార్కెట్‌కు సెలవుకాగా, డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు బుధవారమే (మార్చి 28) జరుగుతుంది. సాధారణంగా ప్రతీ నెలా చివరి గురువారం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ విభాగపు కాంట్రాక్టులు క్లోజ్‌చేయాల్సివుంటుంది.
వాణిజ్య యుద్ధంతో దెబ్బ...
చైనా దిగుమతులపై 60 బిలియన్ డాలర్ల విలువైన సుంకాలు విధించే ప్రతిపాదనకు సంబంధించిన ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత గురువారం సంతకాలు చేయగా, ఆ మర్నాడే అమెరికా దిగుమతులపై 3 బిలియన్ డాలర్ల మేర సుంకాల్ని విధిస్తున్నట్లు చైనా ప్రకటించడంతో అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాలు పెరిగాయని, దీంతో ఈక్విటీ మార్కెట్లు దెబ్బతింటున్నాయని మార్కెట్ నిపుణులు చెప్పారు.
సమీప భవిష్యత్తులో ఈ తరహా రక్షణాత్మక విధానాలు మరిన్ని వుండవచ్చన్న ఆందోళన మార్కెట్లో నెలకొందని, ఈ విధానాలు ప్రపంచ ఆర్థికాభివృద్ధికి ఆటంకం కల్గిస్తాయని వారు వివరించారు. అమెరికా–చైనాల మధ్య తలెత్తిన ఈ వాణిజ్య యుద్ధ ప్రభావంతో గత వారం భారత్‌తో సహా ప్రపంచ ప్రధాన మార్కెట్లన్నీ పతనమయ్యాయి. గత గురు, శుక్రవారాల్లో అమెరికా సూచీలు 4 శాతం వరకూ క్షీణించాయి. ఇక్కడ సెన్సెక్స్ వారం మొత్తం మీద 579 పాయింట్లు కోల్పోయింది.
దేశీయ సమస్యలు కూడా...
అంతర్జాతీయ పరిణామాలకు తోడు దేశీయ సమస్యలు కూడా మన మార్కెట్‌ను పట్టిపీడిస్తున్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఇక్కడి ఈక్విటీలు అధిక విలువల్ని కలిగివుండటం, ఎన్నికల ముందస్తు రాజకీయ అనిశ్చితి వంటి అంశాలతో ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే భారత్ సూచీలు భారీగా తగ్గాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. అయితే ఇక్కడ ఫండ్స్‌లో రిడంప్షన్ల ఒత్తిడి తగ్గిందని, ఈ మార్చి నెలాఖరునాటికి పరిస్థితులు కుదుటపడతాయని అంచనావేస్తున్నామన్నారు.
కానీ అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం తీవ్రతరమయ్యే అవకాశాలున్నందున, మార్కెట్లో కొద్దిరోజులపాటు హెచ్చుతగ్గులు చోటుచేసుకోవొచ్చని, ఈ వారం మార్కెట్‌కు రెండు రోజుల సెలవు దినాలుకావడం, డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు దగ్గరపడటం వంటి అంశాలతో ఒడిదుడుకులు పెరగవచ్చని ఆయన అన్నారు. వాణిజ్య యుద్ధ భయాలు, రాజకీయ వాతావరణం కారణంగా మధ్యకాలికంగా బుల్స్‌పై ఒత్తిడి వుండవచ్చని సామ్‌కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్ మోది అంచనావేశారు.
Comments
Please login to add a commentAdd a comment