ఎల్ అండ్ టీ - కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్
ప్రస్తుత ధర: రూ.1,413
టార్గెట్ ధర: రూ.1,540
ఎందుకంటే: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు క్వార్టర్లు బలహీనంగా ఉన్న ఆర్డర్ల వృద్ధి ఈ క్యూ3లో పుంజుకుంది. ఈ క్యూ3లో ఇప్పటికే రూ.37,300 కోట్ల ఆర్డర్లు సాధించింది.మొత్తం మీద ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్డర్లు 5 శాతం వరకూ వృద్ధి చెంది రూ.1.5 లక్షల కోట్లకు చేరతాయని భావిస్తున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 15 శాతంగా ఉన్న దేశీయ ఇంజనీరింగ్, కన్‌స్ట్రక్షన్ విభాగం వృద్ధి ఈ క్యూ2లో 5 శాతానికే పరిమితమైంది. జీఎస్‌టీ సంబంధిత సమస్యలే దీనికి ప్రధాన కారణం.
జీఎస్‌టీ సమస్యలు క్రమక్రమంగా తగ్గుతుండటంతో ఈ విభాగం వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10%, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 12%గా ఉండగలదని అంచనా. 2015–16 ఆర్థిక సంవత్సరం చివరికల్లా 25 శాతంగా(నికర అమ్మకాల్లో) ఉన్న నెట్ వర్కింగ్ క్యాపిటల్(ఎన్‌డబ్ల్యూసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో 20 శాతానికి తగ్గింది. జీఎస్‌టీ కింద ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందడానికి సుదీర్ఘమైన జాప్యం జరుగుతుండడం, దేశీయ ఆర్డర్ల అమలులకు భారీగా వర్కింగ్ క్యాపిటల్ అవసరమవుతుండడం వంటి కారణాల వల్ల ఈ క్యూ3లో కూడా ఎన్‌డబ్ల్యూసీ 20 శాతం రేంజ్‌లోనే ఉండనున్నదని అంచనా వేస్తున్నాం.
2020–21 ఆర్థిక సంవత్సరం కల్లా ఎన్‌డబ్ల్యూసీని 18 శాతంగా (నికర అమ్మకాల్లో) సాధించాలని కంపెనీ ‘లక్ష్య’ వ్యూహాత్మక ప్రణాళిక నిర్దేశించింది. దీనికనుగుణంగానే కంపెనీ చర్యలు తీసుకుంటోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనా షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్)కు 22 రెట్ల ధరకు ప్రస్తుతం ఈ షేర్ ట్రేడవుతోంది. సమ్ ఆఫ్ ద పార్ట్స్(ఎస్‌ఓటీపీ) ప్రాతిపదికన టార్గెట్ ధరను రూ.1,540గా నిర్ణయించాం. ఏడాదిలోగా ఈ షేర్ ఈ ధరను చేరగలదని భావిస్తున్నాం. ప్రభుత్వ వ్యయంలో భారీగా కోత ఏర్పడడం, పశ్చిమాసియా ప్రాంతం(ఇక్కడే ఈ కంపెనీ భారీ ఆర్డర్లను సాధించింది)లో ముడి చమురు ధరలు బాగా పతనం కావడం ప్రతికూలాంశాలు.
జీ ఎంటర్‌టైన్మెంట్ - కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్
ప్రస్తుత ధర: రూ.595
టార్గెట్ ధర: రూ.640
ఎందుకంటే: జీ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ప్రకటనల ఆదాయం 26శాతం పెరగడంతో మొత్తం ఆదాయం రూ.1,838 కోట్లకు పెరిగింది. చందా ఆదాయం మాత్రం 16 శాతం క్షీణించి రూ.502 కోట్లకు తగ్గింది. స్పోర్ట్స్‌వ్యాపారం నుంచి ఈ కంపెనీ నిష్క్రమించడం, అంతర్జాతీయ చందా ఆదాయం బలహీనంగా ఉండడం దీనికి ప్రధాన కారణాలు. మొత్తం ఆదాయం పెరగడంతో ఇబిటా కూడా పుంజుకుంది. ఇబిటా రూ.594 కోట్లుగా ఉండగా, ఇబిటా మార్జిన్లు 1 శాతం వృద్ధితో 32.3 శాతానికి ఎగిశాయి. ప్రకటనల ఆదాయం వృద్ధి, మార్జిన్ల విషయంలో ఈ రంగంలో అగ్రస్థానం ఈ కంపెనీదే.
కంటెంట్‌పై తగిన విధంగా వ్యయం చేయడం, ప్రాంతీయ చానెళ్లు పటిష్టంగా ఉండడం వంటి కారణాల వల్ల ఇతర బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీల కంటే మంచి వృద్ధి సాధిస్తోంది. ఈ క్యూ3లో రూ.322 కోట్ల నికర లాభం సాధించింది. పన్ను కేటాయింపులు అధికంగా ఉండటం నికర లాభంపై ప్రతికూల ప్రభావం చూపించింది. స్పోర్ట్స్‌యేతర ఎంటర్‌టైన్మెంట్ నెట్‌వర్క్ వ్యూయర్షిప్ మార్కెట్ షేర్ 2 శాతం వృద్ధితో 18.3 శాతానికి ఎగసింది. ‘జడ్‌ఫైవ్’ పేరుతో డిజిటల్ వెంచర్‌ను వచ్చే నెలలో ఈ కంపెనీ అందుబాటులోకి తేనున్నది.
డిజిటల్ సెగ్మెంట్లో మార్జిన్లు 30 శాతానికి పైగానే ఉండగలవన్న అంచనాలున్నాయి. రెండేళ్లలో నికర ఆదాయం 15 శాతం చొప్పున చక్రగతి వృద్ధితో రూ.5,560 కోట్లకు, చందా ఆదాయం 6 శాతం చక్రగతి వృద్ధితో రూ.2,696 కోట్లకు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. 2019–20 ఆర్థిక సంవత్సరం అంచనా పీ/ఈకి 20 రెట్ల ధరను టార్గెట్ ధరగా నిర్ణయించాం. ట్రాయ్ కొత్త టారిఫ్ నిబంధనల కారణంగా డిస్ట్రిబ్యూషన్ భాగస్వాములతో కంటెంట్ డీల్స్ కుదరడంలో జాప్యం జరుగుతుండడం..ప్రతికూలాంశం.
Comments
Please login to add a commentAdd a comment