Stock View
-
స్టాక్స్ వ్యూ
టైటాన్ కంపెనీ బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.793 టార్గెట్ ధర: రూ.1,070 ఎందుకంటే: టాటా గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ ఇటీవలనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక విక్రయ అంచనాలను విడుదల చేసింది. ఈ క్యూ1లో అంతంతమాత్రంగా ఉన్న జ్యుయలరీ విభాగం అమ్మకాలు ఈ క్యూ2లో పుంజుకున్నాయి. పెళ్లి ముహూర్తాలు తక్కువగా ఉండటం, పుత్తడి ధరలు అధికంగా ఉండటం, పరిశ్రమకు రుణ లభ్యత కటకటగా ఉండటం, వినియోగదారుల డిమాండ్ బలహీనంగా ఉండటం వంటి ప్రతికూలతలు జ్యుయలరీ పరిశ్రమలో నెలకొన్నాయి. అయితే జ్యుయలరీ పరిశ్రమలో పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నా, కొత్త కలెక్షన్ ఆఫర్ల కారణంగా ఈ కంపెనీ మార్కెట్ వాటా పెరిగింది. గుల్నాజ్ బ్రాండ్ కింద విలువైన రాళ్లతో కూడిన ఆభరణాలను, మియా బ్రాండ్ కింద వెండి ఆభరణాల కలెక్షన్లను అందుబాటులోకి తెచ్చింది. వీటికి వినియోగదారుల నుంచి మంచి స్పందనే లభిస్తోంది. ఇక బ్రాండ్ ప్రచారం జోరుగా ఉండటం, కొత్త ఉత్పత్తుల ఆఫర్ల కారణంగా వాచ్‌ల సెగ్మెంట్ కూడా మంచి విక్రయాలను సాధించింది. మార్కెటింగ్ విస్తృతంగా ఉండటం, డిస్కౌంట్ల ధరల కారణంగా కళ్ల జోళ్ల విభాగం కూడా జోరుగానే వృద్ధి సాధించింది. ఈ క్యూ2లో ఈ కంపెనీ కొత్తగా ఆరు తనిష్క్ స్టోర్లను ప్రారంభించింది. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకూ కొత్తగా ఏర్పాటు చేసిన స్టోర్ల సంఖ్య 16కు పెరిగింది. కంపెనీ ఆఫర్ చేస్తున్న ‘స్కిన్న్’ బ్రాండ్.. డిపార్ట్మెంటల్ స్టోర్లలో అత్యధికంగా అమ్ముడయ్యే సెంట్ బ్రాండ్‌గా నిలిచింది. ఈ బ్రాండ్ కింద కంపెనీ కొత్తగా ఆఫర్ చేసిన అమల్పి బ్లూ మంచి అమ్మకాలు సాధిస్తోంది. సేమ్ స్టోర్స్ సేల్స్ గ్రోత్ (ఎస్‌ఎస్‌ఎస్‌జీ) జోరుగా ఉండనుండటంతో ఈ ఆర్థిక సంవత్సరం కంపెనీ ఆదాయం 20 శాతం పెరగగలదని, అలాగే మార్జిన్లు కూడా మంచి వృద్ధి సాధించగలవని అంచనా వేస్తున్నాం. రెండేళ్లలో షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) 28 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలదని భావిస్తున్నాం. గెయిల్ బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.332 టార్గెట్ ధర: రూ.450 ఎందుకంటే: గెయిల్ కంపెనీకి సంబంధించిన నాలుగు గ్యాస్ పైప్లైన్ల తుది టారిఫ్‌లను పెట్రోలియమ్ అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్(పీఎన్జీఆర్బీ) ఖరారు చేసింది. ఈ నాలుగు గ్యాప్ పైప్లైన్లలో ముఖ్యమైనదైన దహేజ్–ఉరాన్–పన్వేల్/దభోల్ పైప్‌లైన్ టారిఫ్ 54 శాతం పెరిగింది. ఇతర మూడు గ్యాప్ పైప్లైన్లు చిన్నవే అయినప్పటికీ, వీటి టారిఫ్‌లు 161–691 శాతం రేంజ్లో పెరిగాయి. ఈ టారిఫ్‌ల పెరుగుదల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంపెనీ షేర్‌వారీ ఆర్జన (ఈపీఎస్) 1 శాతం, అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం ఈపీఎస్ 4 శాతం వరకూ పెరుగుతాయని అంచనా. హజీరా–విజయ్‌పూర్–జగదీశ్‌పూర్(హెచ్వీజే), దహేజ్–విజయ్‌పూర్ పైప్‌లైన్(డీవీపీఎల్)లకు సంబంధించి ఒకే టారిఫ్ ప్లాన్ ఉండాలన్న గెయిల్ ప్రతిపాదనను పీఎన్జీఆర్బీ ఆమోదిస్తే, గెయిల్ పనితీరుపై దీర్ఘకాలంలో చెప్పుకోదగ్గ సానుకూల ప్రభావం చూపుతుంది. గ్యాస్ అమ్మకాలు నిలకడగా ఉండటం, పైప్లైన్ల విస్తరణ, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్(సీజీడీ) జోరు పెరుగుతుండటం, ఎల్పీజీ, పెట్రో కెమికల్స్ ధరలు పెరుగుతుండటం.. ఇవన్నీ సానుకూలాంశాలు. 2016–17లో రూ.48,902 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి కల్లా రూ.73,782 కోట్లకు పెరుగుతుందని అంచనా. అలాగే నికర లాభం రూ.3,503 కోట్ల నుంచి రూ.5,945 కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నాం. -
స్టాక్స్ వ్యూ
ఎల్ అండ్ టీ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.1,413 టార్గెట్ ధర: రూ.1,540 ఎందుకంటే: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు క్వార్టర్లు బలహీనంగా ఉన్న ఆర్డర్ల వృద్ధి ఈ క్యూ3లో పుంజుకుంది. ఈ క్యూ3లో ఇప్పటికే రూ.37,300 కోట్ల ఆర్డర్లు సాధించింది.మొత్తం మీద ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్డర్లు 5 శాతం వరకూ వృద్ధి చెంది రూ.1.5 లక్షల కోట్లకు చేరతాయని భావిస్తున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 15 శాతంగా ఉన్న దేశీయ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ విభాగం వృద్ధి ఈ క్యూ2లో 5 శాతానికే పరిమితమైంది. జీఎస్టీ సంబంధిత సమస్యలే దీనికి ప్రధాన కారణం. జీఎస్టీ సమస్యలు క్రమక్రమంగా తగ్గుతుండటంతో ఈ విభాగం వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10%, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 12%గా ఉండగలదని అంచనా. 2015–16 ఆర్థిక సంవత్సరం చివరికల్లా 25 శాతంగా(నికర అమ్మకాల్లో) ఉన్న నెట్ వర్కింగ్ క్యాపిటల్(ఎన్డబ్ల్యూసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో 20 శాతానికి తగ్గింది. జీఎస్టీ కింద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందడానికి సుదీర్ఘమైన జాప్యం జరుగుతుండడం, దేశీయ ఆర్డర్ల అమలులకు భారీగా వర్కింగ్ క్యాపిటల్ అవసరమవుతుండడం వంటి కారణాల వల్ల ఈ క్యూ3లో కూడా ఎన్డబ్ల్యూసీ 20 శాతం రేంజ్‌లోనే ఉండనున్నదని అంచనా వేస్తున్నాం. 2020–21 ఆర్థిక సంవత్సరం కల్లా ఎన్డబ్ల్యూసీని 18 శాతంగా (నికర అమ్మకాల్లో) సాధించాలని కంపెనీ ‘లక్ష్య’ వ్యూహాత్మక ప్రణాళిక నిర్దేశించింది. దీనికనుగుణంగానే కంపెనీ చర్యలు తీసుకుంటోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనా షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్)కు 22 రెట్ల ధరకు ప్రస్తుతం ఈ షేర్ ట్రేడవుతోంది. సమ్ ఆఫ్ ద పార్ట్స్(ఎస్ఓటీపీ) ప్రాతిపదికన టార్గెట్ ధరను రూ.1,540గా నిర్ణయించాం. ఏడాదిలోగా ఈ షేర్ ఈ ధరను చేరగలదని భావిస్తున్నాం. ప్రభుత్వ వ్యయంలో భారీగా కోత ఏర్పడడం, పశ్చిమాసియా ప్రాంతం(ఇక్కడే ఈ కంపెనీ భారీ ఆర్డర్లను సాధించింది)లో ముడి చమురు ధరలు బాగా పతనం కావడం ప్రతికూలాంశాలు. జీ ఎంటర్టైన్మెంట్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ.595 టార్గెట్ ధర: రూ.640 ఎందుకంటే: జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ప్రకటనల ఆదాయం 26శాతం పెరగడంతో మొత్తం ఆదాయం రూ.1,838 కోట్లకు పెరిగింది. చందా ఆదాయం మాత్రం 16 శాతం క్షీణించి రూ.502 కోట్లకు తగ్గింది. స్పోర్ట్స్వ్యాపారం నుంచి ఈ కంపెనీ నిష్క్రమించడం, అంతర్జాతీయ చందా ఆదాయం బలహీనంగా ఉండడం దీనికి ప్రధాన కారణాలు. మొత్తం ఆదాయం పెరగడంతో ఇబిటా కూడా పుంజుకుంది. ఇబిటా రూ.594 కోట్లుగా ఉండగా, ఇబిటా మార్జిన్లు 1 శాతం వృద్ధితో 32.3 శాతానికి ఎగిశాయి. ప్రకటనల ఆదాయం వృద్ధి, మార్జిన్ల విషయంలో ఈ రంగంలో అగ్రస్థానం ఈ కంపెనీదే. కంటెంట్‌పై తగిన విధంగా వ్యయం చేయడం, ప్రాంతీయ చానెళ్లు పటిష్టంగా ఉండడం వంటి కారణాల వల్ల ఇతర బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీల కంటే మంచి వృద్ధి సాధిస్తోంది. ఈ క్యూ3లో రూ.322 కోట్ల నికర లాభం సాధించింది. పన్ను కేటాయింపులు అధికంగా ఉండటం నికర లాభంపై ప్రతికూల ప్రభావం చూపించింది. స్పోర్ట్స్యేతర ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ వ్యూయర్షిప్ మార్కెట్ షేర్ 2 శాతం వృద్ధితో 18.3 శాతానికి ఎగసింది. ‘జడ్ఫైవ్’ పేరుతో డిజిటల్ వెంచర్‌ను వచ్చే నెలలో ఈ కంపెనీ అందుబాటులోకి తేనున్నది. డిజిటల్ సెగ్మెంట్లో మార్జిన్లు 30 శాతానికి పైగానే ఉండగలవన్న అంచనాలున్నాయి. రెండేళ్లలో నికర ఆదాయం 15 శాతం చొప్పున చక్రగతి వృద్ధితో రూ.5,560 కోట్లకు, చందా ఆదాయం 6 శాతం చక్రగతి వృద్ధితో రూ.2,696 కోట్లకు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. 2019–20 ఆర్థిక సంవత్సరం అంచనా పీ/ఈకి 20 రెట్ల ధరను టార్గెట్ ధరగా నిర్ణయించాం. ట్రాయ్ కొత్త టారిఫ్ నిబంధనల కారణంగా డిస్ట్రిబ్యూషన్ భాగస్వాములతో కంటెంట్ డీల్స్ కుదరడంలో జాప్యం జరుగుతుండడం..ప్రతికూలాంశం. -
స్టాక్స్ వ్యూ
టెక్ మహీంద్రా : కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్ ప్రస్తుత ధర: రూ.535 టార్గెట్ ధర: రూ.615 ఎందుకంటే: 1,690 కోట్ల డాలర్ల మహీంద్రా గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ వినూత్నమైన. వినియోగదారుడు కేంద్రంగా ఐటీ సర్వీసులను, సొల్యూషన్లను, కన్సల్టింగ్, ఎంటర్ప్రైజ్, టెలికాం సొల్యూషన్లను అందిస్తోంది. 390 కోట్ల డాలర్ల టెక్ మహీంద్రా కంపెనీ లక్షకు పైగా ఉద్యోగులతో 90 దేశాల్లో 788కి పైగా కంపెనీలకు తన సర్వీసులను ఆఫర్ చేస్తోంది. వీటిల్లో కొన్ని ఫార్చ్యూన్ 500 కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో కంపెనీ నికర లాభం 9 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.రూ.720 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.786 కోట్లకు ఎగసింది. ఆదాయం రూ.5,488 కోట్ల నుంచి 21 శాతం వృద్ధితో రూ.6,615 కోట్లకు, ఇబిటా రూ.1,155 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.1,266 కోట్లకు పెరిగాయి. షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) రూ.8.16గా ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.3,492 కోట్లుగా ఉన్నాయి. ఈ క్యూ2లో యాక్టివ్ క్లయింట్ల సంఖ్య 788కు పెరిగింది. నార్డిస్ సర్వీసెస్, ఒక అంతర్జాతీయ కార్ల కంపెనీ నుంచి భారీ డీల్స్‌ను సాధించింది. ఎయిర్‌క్రాఫ్ట్ గ్రౌండ్ సపోర్ట్ సిస్టమ్(ఏసీజీఎస్) డెవలప్ చేయడానికి గ్లోబల్ ఏరోస్పేస్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ కంపెనీ టెక్ మహీంద్రా కంపెనీనే ఎంపిక చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్డ్ సర్వీసెస్ భాగస్వామిగా టెక్ మహీంద్రాను ఏషియన్ టెలికాం కంపెనీ ఎంచుకుంది. డేటా సర్వీసుల టెస్టింగ్,డిజైన్, యాక్టివేట్ వంటి కార్యకలాపాలకు ఒక ఉత్తర అమెరికా టెలికాం కంపెనీ కూడా టెక్ మహీంద్రానే ఎంచుకుంది. రెండేళ్లలో నికర అమ్మకాలు 45 శాతం, నికర లాభం 43 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. ఇటీలనే ఆర్బీఐ నుంచి చెల్లింపుల బ్యాంక్ లెసైన్స్‌ను పొందింది. సీఈఎస్ఈ : కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్ ప్రస్తుత ధర: రూ.542 టార్గెట్ ధర: రూ.668 ఎందుకంటే: ఈ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలం ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. విద్యుత్తు టారిఫ్‌లు 8 శాతం పెరగడంతో ఆదాయం 7 శాతం వృద్ధితో రూ.1,757 కోట్లకు పెరిగింది. విద్యుత్తు కొనుగోలు వ్యయం 58 శాతం, ఉద్యోగుల వ్యయం 7 శాతం చొప్పున పెరగడంతో ఇబిటా మార్జిన్లు స్వల్పంగా తగ్గి 24 శాతానికి పడిపోయాయి. ఇంధన వ్యయం 20 శాతం, ఇతర వ్యయాలు 14 శాతం చొప్పున తగ్గాయి. 2,325 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఉన్న ఈ కంపెనీకి కోల్‌కత, హౌరాలకు డిస్ట్రిబ్యూషన్ లెసైన్స్ ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) 15.5 శాతం సాధిస్తోంది. ఏడాదికి రూ.500 కోట్ల నగదు నిలకడగా ఆర్జిస్తోంది. గత ఆరేళ్లుగా తన రిటైల్ విభాగం స్పెన్సర్స్‌లో రూ.1,400 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. ఇలా పెట్టుబడులు పెట్టడం సీఈఎస్సీ నగదు స్థితిగతులపై ప్రభావం చూపినప్పటికీ, స్పెన్సర్ వ్యాపారం మెరుగుపడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ4లోనే స్పెన్సర్స్ ఇబిటా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందన్న అంచనాలున్నాయి. రెండేళ్లలో స్పెన్సర్స్ ఆదాయం 23 శాతం, స్టోర్ ఏరియా 14 శాతం, స్టోర్ సేల్స్ 8 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. 2012-13లో ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ అనే ఐటీ కంపెనీలో 57% వాటాను రూ.454 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ కంపెనీ రుణభారం తగ్గడానికి, మార్జిన్లు పెరగడానికి తన వంతు ప్రయత్నాలు చేసింది. ఈ ఏడాదిమార్చి నాటికి ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ స్థూల రుణం 11 కోట్ల డాలర్లుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి 5 కోట్ల డాలర్ల నగదు నిల్వలున్న కంపెనీగా మారనున్నది. 600 మెగావాట్ల చంద్రపూర్ ప్రాజెక్ట్‌కు ఇటీవలనే అనుమతులు సాధించింది. హల్దియా ప్లాంట్ ఇటీవలనే కార్యకలాపాలు ప్రారంభించింది. అన్ని వ్యాపార విభాగాలన్నింటినీ కలిపి సీఈఎస్సీ టార్గెట్ ధరను నిర్ణయించాం. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.