టైటాన్ కంపెనీ
బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్
కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.793
టార్గెట్ ధర: రూ.1,070
ఎందుకంటే: టాటా గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ ఇటీవలనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక విక్రయ అంచనాలను విడుదల చేసింది. ఈ క్యూ1లో అంతంతమాత్రంగా ఉన్న జ్యుయలరీ విభాగం అమ్మకాలు ఈ క్యూ2లో పుంజుకున్నాయి. పెళ్లి ముహూర్తాలు తక్కువగా ఉండటం, పుత్తడి ధరలు అధికంగా ఉండటం, పరిశ్రమకు రుణ లభ్యత కటకటగా ఉండటం, వినియోగదారుల డిమాండ్ బలహీనంగా ఉండటం వంటి ప్రతికూలతలు జ్యుయలరీ పరిశ్రమలో నెలకొన్నాయి. అయితే జ్యుయలరీ పరిశ్రమలో పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నా, కొత్త కలెక్షన్ ఆఫర్ల కారణంగా ఈ కంపెనీ మార్కెట్ వాటా పెరిగింది. గుల్‌నాజ్ బ్రాండ్ కింద విలువైన రాళ్లతో కూడిన ఆభరణాలను, మియా బ్రాండ్ కింద వెండి ఆభరణాల కలెక్షన్లను అందుబాటులోకి తెచ్చింది. వీటికి వినియోగదారుల నుంచి మంచి స్పందనే లభిస్తోంది. ఇక బ్రాండ్ ప్రచారం జోరుగా ఉండటం, కొత్త ఉత్పత్తుల ఆఫర్ల కారణంగా వాచ్‌ల సెగ్మెంట్ కూడా మంచి విక్రయాలను సాధించింది. మార్కెటింగ్ విస్తృతంగా ఉండటం, డిస్కౌంట్ల ధరల కారణంగా కళ్ల జోళ్ల విభాగం కూడా జోరుగానే వృద్ధి సాధించింది. ఈ క్యూ2లో ఈ కంపెనీ కొత్తగా ఆరు తనిష్క్ స్టోర్లను ప్రారంభించింది. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకూ కొత్తగా ఏర్పాటు చేసిన స్టోర్ల సంఖ్య 16కు పెరిగింది. కంపెనీ ఆఫర్ చేస్తున్న ‘స్కిన్న్’ బ్రాండ్.. డిపార్ట్‌మెంటల్ స్టోర్లలో అత్యధికంగా అమ్ముడయ్యే సెంట్ బ్రాండ్‌గా నిలిచింది. ఈ బ్రాండ్ కింద కంపెనీ కొత్తగా ఆఫర్ చేసిన అమల్పి బ్లూ మంచి అమ్మకాలు సాధిస్తోంది. సేమ్ స్టోర్స్ సేల్స్ గ్రోత్ (ఎస్‌ఎస్‌ఎస్‌జీ) జోరుగా ఉండనుండటంతో ఈ ఆర్థిక సంవత్సరం కంపెనీ ఆదాయం 20 శాతం పెరగగలదని, అలాగే మార్జిన్లు కూడా మంచి వృద్ధి సాధించగలవని అంచనా వేస్తున్నాం. రెండేళ్లలో షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) 28 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలదని భావిస్తున్నాం.
గెయిల్
బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్
కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.332
టార్గెట్ ధర: రూ.450
ఎందుకంటే: గెయిల్ కంపెనీకి సంబంధించిన నాలుగు గ్యాస్ పైప్‌లైన్ల తుది టారిఫ్‌లను పెట్రోలియమ్ అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్(పీఎన్‌జీఆర్‌బీ) ఖరారు చేసింది. ఈ నాలుగు గ్యాప్ పైప్‌లైన్లలో ముఖ్యమైనదైన దహేజ్–ఉరాన్–పన్వేల్/దభోల్ పైప్‌లైన్ టారిఫ్ 54 శాతం పెరిగింది. ఇతర మూడు గ్యాప్ పైప్‌లైన్లు చిన్నవే అయినప్పటికీ, వీటి టారిఫ్‌లు 161–691 శాతం రేంజ్‌లో పెరిగాయి. ఈ టారిఫ్‌ల పెరుగుదల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంపెనీ షేర్‌వారీ ఆర్జన (ఈపీఎస్) 1 శాతం, అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం ఈపీఎస్ 4 శాతం వరకూ పెరుగుతాయని అంచనా. హజీరా–విజయ్‌పూర్–జగదీశ్‌పూర్(హెచ్‌వీజే), దహేజ్–విజయ్‌పూర్ పైప్‌లైన్(డీవీపీఎల్)లకు సంబంధించి ఒకే టారిఫ్ ప్లాన్ ఉండాలన్న గెయిల్ ప్రతిపాదనను పీఎన్‌జీఆర్‌బీ ఆమోదిస్తే, గెయిల్ పనితీరుపై దీర్ఘకాలంలో చెప్పుకోదగ్గ సానుకూల ప్రభావం చూపుతుంది. గ్యాస్ అమ్మకాలు నిలకడగా ఉండటం, పైప్‌లైన్ల విస్తరణ, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్(సీజీడీ) జోరు పెరుగుతుండటం, ఎల్పీజీ, పెట్రో కెమికల్స్ ధరలు పెరుగుతుండటం.. ఇవన్నీ సానుకూలాంశాలు. 2016–17లో రూ.48,902 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి కల్లా రూ.73,782 కోట్లకు పెరుగుతుందని అంచనా. అలాగే నికర లాభం రూ.3,503 కోట్ల నుంచి రూ.5,945 కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment