న్యూఢిల్లీ: లగ్జరీ వాచ్‌ల విక్రయంలో ఉన్న టైటన్ హీలియోస్ మరిన్ని విదేశీ బ్రాండ్స్‌ను జోడిస్తోంది. 12–18 నెలల్లో కొత్తగా 10 బ్రాండ్స్‌ను పరిచయం చేయనుంది. ప్రస్తుతం హీలియోస్ స్టోర్లలో టామీ హిల్‌ఫిగర్, టిస్సో, స్వరోస్కీ, ఫాజిల్ వంటి 45 బ్రాండ్ల వాచ్‌లు కొలువుదీరాయి. వీటి ధరలు రూ.5,000 మొదలుకుని రూ.1,00,000 వరకు ఉన్నాయి. మరోవైపు హీలియోస్ స్టోర్ల సంఖ్యను కంపెనీ గణనీయంగా పెంచుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 50 ఔట్‌లెట్లు రానున్నాయని టైటన్ వాచెస్, వేరబుల్స్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ శుక్లా వెల్లడించారు.
‘మొత్తం వ్యాపారంలో హీలియోస్ నుంచి 10 శాతం ఆదాయం సమకూరుతోంది. ఈ విభాగం ఆదాయం 45 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నాం. హీలియోస్ టర్నోవర్‌లో 20 శాతం కొత్త కలెక్షన్, లిమిటెడ్ ఎడిషన్స్ నుంచి అందుకోవాలని దృష్టిపెట్టాం. పండుగల సీజన్ ప్రమోషన్స్ కారణంగా కస్టమర్ల రాక, ఆన్‌లైన్ సేల్స్ 20–25 శాతం అధికం అవుతాయని భావిస్తున్నాం. అన్ని బ్రాండ్స్‌లో కలిపి ఏటా 150 దాకా కేంద్రాలను జోడిస్తున్నాం’ అని వివరించారు. టైటన్‌కు దేశవ్యాప్తంగా 95 నగరాలు, పట్టణాల్లో 240 హీలియోస్ స్టోర్లు ఉన్నాయి. హీలియోస్‌తోపాటు టైటన్ వరల్డ్, ఫాస్ట్‌ట్రాక్, రాగా, జూప్, ఎస్‌ఎఫ్ బ్రాండ్లలో 1,110కిపైగా కేంద్రాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment