స్పైస్‌జెట్ - కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: ఎడిల్‌వీజ్
ప్రస్తుత ధర: 138 టార్గెట్ ధర: రూ. 166
ఎందుకంటే: వివిధ ప్రభుత్వ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలను చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గించుకుంది. కొత్త ప్రమోటర్ సారధ్యంలో టర్న్ అరౌండ్ సాధించిన ఈ కంపెనీ వరుసగా 12 క్వార్టర్ల పాటు లాభాలు(రూ.1,400 కోట్ల మేర) కళ్లజూసింది. రెండేళ్లలో రూ.200 కోట్ల రుణ భారం తగ్గించుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి నికర నగదు కంపెనీగా నిలుస్తామని, 2019–20 ఆర్థిక సంవత్సరం కల్లా రూ.250 కోట్ల నగదు నిల్వలు సమకూర్చుకోగలమని కంపెనీ అంచనా వేస్తోంది.
ఇప్పటిదాకా సాధారణ స్థాయికి రావడంపై దృష్టి పెట్టిన ఈ కంపెనీ ఇప్పుడు వృద్ధిపై దృష్టి సారిస్తోంది. ఈ కంపెనీ విమాన ట్రాఫిక్ 22% పెరిగింది. ఉడాన్ స్కీమ్ వల్ల విమాన ట్రాఫిక్ మరింతగా పెరగగలదని అంచనా. చమురు ధరలు మెల్లమెల్లగా పెరుగుతుండటంతో దీనిని ఎదుర్కొనడానికి 8–9% రేంజ్‌లో వ్యయ నియంత్రణ సాధించే ప్రయత్నాలు చేస్తోంది. విస్తరణ కోసం విమానాల సంఖ్యను పెంచుకుంటోంది.
లాభదాయకతలో మంచి వృద్ధి ధీమాతోనే ఈ కంపెనీ 205 విమానాలకు ఆర్డర్ చేసింది. వీటి డెలివరీ ఈ ఆగస్టు నుంచి మొదలవుతుంది. తక్కువ మెయింటెనెన్స్, ఇంధన ఆదాల కారణంగా నిర్వహణ వ్యయాలు 15% తగ్గుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. 2017–20 కాలానికి ఒక్కో షేర్‌పై వచ్చే రాబడి(ఈపీఎస్) 37 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించగలదని భావిస్తున్నాం.
కెపాసిటీకి తగ్గట్లుగా డిమాండ్ పెరుగుతుండడం, దేశ ఆర్థిక వృద్ధి పటిష్టంగా ఉండటం, ఎగువ మధ్య తరగతి మరింతగా విస్తరిస్తుండడం, ట్రావెల్, టూరిజమ్ మరింతగా పెరుగుతుండటం, విమానాశ్రయాల విస్తరణ.. ఇవన్నీ సానుకూలాంశాలు. మాజీ ప్రమోటర్లతో వారంట్ల వివాదం కొనసాగుతుండడం, ముడి చమురు ధరలు పెరుగుతుండడం ప్రతికూలాంశాలు.
ఆర్‌బీఎల్ బ్యాంక్ - కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: యాక్సిస్ డైరెక్ట్
ప్రస్తుత ధర: 494 టార్గెట్ ధర: రూ. 650
ఎందుకంటే: ఒక ప్రాంతీయ స్థాయి రుణ సంస్థ నుంచి నవీన తరం సాంకేతిక సంస్థగా రూపాంతరం చెందుతోంది. వ్యవసాయ రుణాల కారణంగా రుణ నాణ్యతలో సమస్యలు, సూక్ష్మ రుణాలకు సంబంధించిన వడ్డీ వ్యయాలు,..ఇలాంటి సమస్యలు రానున్న క్వార్టర్లలో తగ్గిపోవచ్చని యాజమాన్యం ధీమాగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో 5.2%గా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఆర్థిక సంవత్సరంలో 1%కి పడిపోవచ్చని అంచనా. అలాగే రుణ వృద్ధి 30–35 శాతం రేంజ్‌లో ఉండొచ్చని భావిస్తున్నాం.
క్రెడిట్ కార్డ్ బిజినెస్ మంచి వృద్ధి సాధిస్తోంది. క్రెడిట్ కార్డ్ సంబంధిత స్థూల మొండి బకాయిలు గత క్యూ3లో 1.1%గానే ఉన్నాయి. పరిశ్రమ సగటు(1.5–1.8%)తో పోల్చితే ఇది మెరుగైన స్థాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పది లక్షల క్రెడిట్ కార్డ్‌లు జారీ చేయాలని, 4–5 ఏళ్లలో క్రెడిట్ కార్డ్‌ల రంగంలో 4/5వ స్థానాన్ని సాధించాలని లక్ష్యాలుగా పెట్టుకుంది. మార్జిన్లు అధికంగా ఉండే రిటైల్ రంగ రుణాలు పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది.
డిపాజిట్ల రేట్ల తగ్గింపు, కాసా నిష్పత్తి మెరుగుపడడం, నిధుల సమీకరణ వ్యయం తక్కువగా ఉండనుండటం వంటి కారణాల వల్ల నికర వడ్డీ మార్జిన్(ఎన్‌ఐఎమ్) 3.9% రేంజ్‌లో కొనసాగించగలమని బ్యాంక్ భావిస్తోంది. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు పుంజుకుంటున్నాయని భావిస్తున్న ఈ బ్యాంక్ 12–18 నెలల్లో రీఫైనాన్సింగ్ అవకాశాలు బాగా ఉంటాయని అంచనా వేస్తోంది.
15 ఏళ్ల కాలం పాటు ఉండే మౌలిక రంగ రుణాలను కాకుండా 2–3 ఏళ్ల కాలపరిమితి ఉండే మౌలిక రంగ రుణాలనే ఇవ్వనున్నది. రుణ వృద్ధి పరిశ్రమతో పోల్చితే 3–4 రెట్లు అధికంగా ఉండనుండటం, ఫీజు ఆదాయం పెరగనుండటం, తక్కువ వడ్డీ చెల్లించే డిపాజిట్ల సమీకరణ, రిటైల్ రుణాలు పెరుగుతుండడం.. సానుకూలాంశాలు.
గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment