అవెన్యూ సూపర్ మార్ట్(డీ మార్ట్) - అమ్మొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: మోతీలాల్ ఓస్వాల్
ప్రస్తుత ధర: రూ.1,454 ; టార్గెట్ ధర: రూ.900
ఎందుకంటే: డీ మార్ట్ పేరుతో రిటైల్ స్టోర్స్‌ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్ మార్ట్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలం ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. కానీ లైక్–ఫర్–లైక్ గ్రోత్ మాత్రం క్షీణించింది. ఆదాయం 22% వృద్ధితో రూ.3,810 కోట్లకు, ఇబిటా 42% వృద్ధితో రూ.290 కోట్లకు పెరిగాయి. ఇబిటా మార్జిన్ 1 శాతం వృద్ధితో 7.7 శాతానికి పెరిగింది. నికర లాభం 73 శాతం వృద్ధితో రూ.160 కోట్లకు ఎగసింది.
పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, ఆదాయం 26 శాతం వృద్ధితో రూ.15,000 కోట్లకు ఇబిటా 39% వృద్ధితో రూ.1,330 కోట్లకు, నికర లాభం 63 శాతం వృద్ధితో రూ.780 కోట్లకు పెరిగాయి. 2016–17లో 131గా ఉన్న మొత్తం స్టోర్స్ సంఖ్య ఈ ఏడాది మార్చి నాటికి 155కు పెరిగింది. అయితే లైక్ ఫర్ లైక్ గ్రోత్(ఎల్‌ఎఫ్‌ఎల్–రిటైల్ కంపెనీల వృద్ధిని కొలిచే కీలకమైన కొలమానాల్లో ఇది ఒకటి. ఈ విధానంలో గత ఏడాదిలో ఉన్న స్టోర్స్ అమ్మకాలను ఈ ఏడాదిలో ఉన్న స్టోర్స్ అమ్మకాలతో (కొత్తగా ఏర్పాటైన స్టోర్స్ అమ్మకాలను పరిగణనలోకి తీసుకోరు)పోల్చుతారు
. 2016–17లో 21.2%గా ఉన్న లైక్ –ఫర్–లైక్ వృద్ధి గత ఆర్థిక సంవత్సరంలో 14.2%కి పడిపోయింది. జీఎస్‌టీ అమలు, పెద్ద కరెన్సీ నోట్ల రద్దు దీనికి కారణాలు. రెండేళ్లలో ఆదాయం 26%, నికర లాభం 32% చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని భావిస్తున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్(షేర్ వారీ ఆర్జన)కు 86 రెట్ల ధరకు, వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్‌కు 65 రెట్ల ధరకు ప్రస్తుతం ఈ షేర్ ట్రేడవుతోంది. ఇది చాలా ఖరీదు.
కజారియా సిరామిక్స్ - కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: ఎడిల్‌వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్
ప్రస్తుత ధర: రూ.540; టార్గెట్ ధర: రూ.690
ఎందుకంటే: సెరామిక్, విట్రిఫైడ్ టైల్స్ తయారీలో అగ్ర స్థానంలో ఉన్న కజారియా సిరామిక్స్ గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో కూడా నిరాశమయమైన ఫలితాలను వెల్లడించింది. ఆదాయం 4 శాతమే వృద్ధి చెందింది. ఇంధన వ్యయాలు అధికంగా ఉండటంతో ఇబిటా మార్జిన్ 2 శాతం తగ్గి 16%కి పడిపోయింది. గ్లేజ్‌డ్ వెట్రిఫైల్ టైల్స్(జీవీటీ) ధరల్లో ఒత్తిడి, పోటీ తీవ్రంగా ఉండటం వంటి కారణాల వల్ల ఇబిటా రూ.120 కోట్లకు, నికర లాభం రూ.66 కోట్లకు పరిమితమయ్యాయి.
ఇ–వే బిల్లు అమలు కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 12–15% రేంజ్‌లో పెరగగలవని కంపెనీ అంచనా వేస్తోంది. గ్యాస్ ధరలు పెరుగుతుండటం, పోటీ తీవ్రమవుతుండటం వంటి కారణాల వల్ల మార్జిన్ 16–18% రేంజ్‌లోనే ఉండగలవని కంపెనీ భావిస్తోంది. జీఎస్‌టీ సమర్థవంతంగా అమలైతే సంఘటిత రంగంలోని ఇలాంటి కంపెనీలకు ప్రయోజనం కలుగుతుంది.
టైల్స్ రంగంలో అగ్రస్థానంలో ఉండటం, పటిష్టమైన నగదు నిల్వలు, రాబడి నిష్పత్తులు ఉన్నత స్థాయిలో ఉండటం(రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్–ఆర్‌ఓసీఈ 30%), ఏడు జాయింట్‌వెంచర్లలో ఒక్కో దాంట్లో ఈక్విటీ వాటాను 51% మేర పెంచుకోనుండటం, విస్తృతమైన ఉత్పత్తుల రేంజ్, పటిష్టమైన డీలర్ల నెట్‌వర్క్... ఇవన్నీ సానుకూలాంశాలు. రియల్టీ రంగం వృద్ధి మందగించే అవకాశాలు, పోటీ తీవ్రత పెరుగుతుండటం, టైల్స్ తయారీలో కీలకమైన నేచురల్ గ్యాస్ ధరల్లో ఒడిదుడుకులు చోటు చేసుకోవడం, చైనా నుంచి చౌక టైల్స్ డంప్ అయ్యే అవకాశాలు... ప్రతికూలాంశాలు.
Comments
Please login to add a commentAdd a comment