స్టాక్స్‌ వ్యూ | Stocks view | Sakshi
Sakshi News home page

స్టాక్స్‌ వ్యూ

Published Mon, May 28 2018 12:58 AM | Last Updated on Mon, May 28 2018 12:58 AM

Stocks view - Sakshi

రెప్‌కో హోమ్‌ ఫైనాన్స్‌ - కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఎడిల్‌వీజ్‌ ఫైనాన్స్‌
ప్రస్తుత ధర: రూ.573  
టార్గెట్‌ ధర: రూ.835

ఎందుకంటే: రెప్‌కో బ్యాంక్‌ ప్రమోటర్‌గా ఉన్న రెప్‌కో హోమ్‌ ఫైనాన్స్‌ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి.  రుణ మంజూరీ 30 శాతం వృద్ధితో రూ.920 కోట్లకు పెరగ్గా,  రుణ పంపిణి 28 శాతం వృద్ధితో రూ.850 కోట్లకు  పెరిగాయి. నిర్వహణ ఆస్తులు 10 శాతం ఎగిశాయి. గత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు క్వార్టర్లలో అంతంతమాత్రంగా ఉన్న కంపెనీ పనితీరు  నాలుగో క్వార్టర్‌లో పుంజుకుంది. రుణ నాణ్యత మెరుగుపడింది.

గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో 3.2 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 2.9 శాతానికి తగ్గాయి. రుణ రికవరీపై దృష్టి పెట్టడం, పెద్ద మొత్తాల రుణాల జారీకి  దూరంగా ఉండటం వల్ల స్థూల మొండి బకాయిలు మరింతగా తగ్గే అవకాశాలున్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి 11 రాష్ట్రాల్లో 129 కార్యాలయాలతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పెద్ద హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు పట్టించుకోని చిన్న నగరాలు, చిన్న పట్టణాల్లోని వేతన, స్వయం ఉపాధి కేటగిరి వినియోగదారులపై ప్రధానంగా దృష్టి సారిస్తోంది.

రెండేళ్లలో నికర లాభం 17–18 శాతం రేంజ్‌లో,  ఆదాయం 18–20 శాతం రేంజ్‌లో  చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా. అలాగే రిటర్న్‌ ఆన్‌  అసెట్‌(ఆర్‌ఓఏ) 2.4 శాతానికి, రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(ఆర్‌ఓఈ) 17 శాతానికి పెరుగుతాయని భావిస్తున్నాం. కంపెనీ కార్యకలాపాలు అధికంగా ఉన్న తమిళనాడులో రిజిస్ట్రేషన్‌ సంబంధిత సమస్యలు సమసిపోవడం, అందుబాటు ధరల గృహాలకు డిమాండ్‌ పెరుగుతుండటం సానుకూలాంశాలు. రియల్‌ ఎస్టేట్‌ రంగం మందగించడం, నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌(ఎన్‌హెచ్‌బీ) నిబంధనలను కఠినతరం చేయడం...ఈ అంశాలు చోటు చేసుకుంటే,  కంపెనీ వృద్ధి, లాభదాయకతపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ - కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌  
ప్రస్తుత ధర: రూ.505                         
టార్గెట్‌ ధర: రూ.725

ఎందుకంటే: కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌...నౌక నిర్మాణ ప్రభుత్వ రంగ కంపెనీ. నౌక నిర్మాణం, రిపేర్ల రంగాల్లో గుత్తాధిపత్యం ఉన్న  ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలు అంచనాలను మించాయి.  షిప్‌బిల్డింగ్‌ సెగ్మెంట్‌ ఇబిటా మార్జిన్లు సాధారణంగా 8–15 శాతం రేంజ్‌లో ఉంటాయి. కానీ ఈ కంపెనీ 27 శాతం మార్జిన్లు సాధించింది. షిప్‌ రిపేర్‌ సెగ్మెంట్‌ ఇబిటా మార్జిన్లు సాధారణంగా 25–35 శాతం రేంజ్‌లో ఉంటాయి. కానీ ఈ కంపెనీ 18 శాతం మార్జిన్లు మాత్రమే సాధించగలిగింది.

ఆదాయం 15 శాతం వృద్ధితో రూ.601 కోట్లకు పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2016–17) క్యూ4లో 5.7 శాతంగా ఉన్న నిర్వహణ లాభ మార్జిన్‌ గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 19 శాతానికి పెరిగింది. నిర్వహణ లాభం దాదాపు మూడు రెట్లు పెరిగి రూ.115 కోట్లకు పెరిగింది. ఇక నికర లాభం 122 శాతం వృద్ధితో రూ.92 కోట్లకు ఎగిసింది. ఒక్కో షేర్‌కు రూ.12 డివిడెండ్‌ను ప్రకటించింది. షిప్‌ రిపేర్‌ సెగ్మెంట్‌ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 20 శాతానికి పైగా వృద్ధి చెంది రూ.623 కోట్లకు చేరింది. 

ఇప్పటికే యుద్ధవాహన నౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య రిపేర్‌ ఆర్డర్లను సాధించడం, కొత్తగా ఆయిల్‌ రిగ్‌ల రిపేర్లను కూడా చేపట్టటం, షిప్‌ రిపేర్ల ప్లాంట్ల నిర్వహణ నిమిత్తం ముంబై, కోల్‌కత పోర్ట్‌ ట్రస్ట్‌లతో ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల  ఇదే జోరు రానున్న రెండేళ్లలో కొనసాగనున్నది. జల రవాణా, కోస్టల్‌ షిప్పింగ్‌ వెస్సల్స్‌ తదితర రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకోవడానికి గాను ఇటీవలనే హూగ్లీ డాక్‌ అండ్‌ పోర్ట్‌ ఇంజనీర్స్‌ సంస్థతో జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ఈ జేవీ కోసం రూ.100 కోట్లు పెట్టుబడులు పెడుతోంది.

ఇతర అవకాశాలు అందిపుచ్చుకోవడానికి మూడేళ్లలో రూ.3,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది. నికర రుణ భారం రూ.123 కోట్లుగా, నగదు నిల్వలు రూ.3,500 కోట్లుగా.. కంపెనీ బ్యాలన్స్‌ షీట్‌ పటిష్టంగా ఉంది. కంపెనీ ఆర్డర్‌ బుక్‌ రూ.2,112 కోట్లుగా ఉంది. రెండేళ్లలో కనీసం రూ.18,950 కోట్ల ఆర్డర్లు సాధించే అవకాశాలున్నాయి. ఈ ఆర్డర్ల కారణంగా మూడేళ్లలో షిప్‌ బిల్డింగ్‌ సెగ్మెంట్‌  19 శాతం, షిప్‌ రిపేర్‌ వ్యాపారం 6 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించగలవని అంచనా. రెండేళ్లలో ఆదాయం 16 శాతం, నిర్వహణ లాభం 19 శాతం, నికర లాభం 17 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని భావిస్తున్నాం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement