స్టాక్స్‌ వ్యూ | Stocks view | Sakshi
Sakshi News home page

స్టాక్స్‌ వ్యూ

Published Mon, Sep 3 2018 1:57 AM | Last Updated on Mon, Sep 3 2018 1:57 AM

Stocks view - Sakshi

ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ - కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: చోళమండలం సెక్యూరిటీస్‌
ప్రస్తుత ధర: రూ.520     టార్గెట్‌ ధర: రూ.640

ఎందుకంటే: భారత హౌసింగ్‌ ఫైనాన్స్‌ రంగంలో రెండో అతి పెద్ద కంపెనీ ఇది. వ్యక్తులకు, కార్పొరేట్‌ సంస్థలకు గృహ రుణాలందిస్తోంది. డెవలపర్లకు, బిల్డర్లకు నిర్మాణ రుణాలను కూడా అందిస్తోంది. మరోవైపు ఈ కంపెనీ అనుబంధ సంస్థ, ఎల్‌ఐసీ హౌసింగ్‌... హోమ్‌ లోన్‌ ఏజెంట్లతోనూ, డైరెక్ట్‌ సెల్లింగ్‌ ఏజెంట్లతోనూ పటిష్టమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. ఈ కంపెనీ రుణాలు ఈ క్యూ1లో 15 శాతం వృద్ధితో రూ.1.69 లక్షల కోట్లకు చేరాయి. ఇళ్ల తాకట్టు రుణాలు 42 శాతం, ప్రాజెక్ట్‌ రుణాలు 51 శాతం చొప్పున పెరగడమే దీనికి కారణం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధి 15 శాతం రేంజ్‌లో ఉండగలదని అంచనా.

ఈ క్యూ1లో రుణ పంపిణీ 10 శాతం పెరిగి రూ.9,590 కోట్లకు పెరిగింది.  అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, రుణ పంపిణీ 45 శాతం క్షీణించింది. పోటీ తీవ్రత పెరుగుతుండటంతో నికర వడ్డీ మార్జిన్‌(ఎన్‌ఐఎమ్‌) స్వల్పంగా తగ్గింది. ›ప్రైమ్‌ లెండింగ్‌ రేట్‌(పీఎల్‌ఆర్‌)ను ఈ కంపెనీ జూన్, ఆగస్టుల్లో పెంచడంతో నికర వడ్డీ మార్జిన్‌ మెరుగుపడగలదని భావిస్తున్నాం. స్థూల మొండి బకాయిలు 1.2 శాతానికి, నికర మొండి బకాయిలు 0.8 శాతానికి పెరిగాయి.

అయితే ఈ క్యూ1లో రూ.40 కోట్ల మేర డెవలపర్‌ లోన్‌ను ఈ కంపెనీ వంద శాతం రికవరీ చేయగలిగింది. రుణ నాణ్యత మెరుగుపడగలదని కంపెనీ భావిస్తోంది. ఈ క్యూ1లో నికర వడ్డీ ఆదాయం 7 శాతం వృద్ధితో రూ.980 కోట్లకు, ఇతర ఆదాయం 50 శాతం వృద్ధితో రూ.32 కోట్లకు పెరిగాయి. నికర లాభం 18 శాతం పెరిగి రూ.568 కోట్లకు పెరిగింది. రెరా అమలు కారణంగా ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌ సెగ్మెంట్‌ జోరు పెరుగుతుందని, ఇది ఈ కంపెనీకి ప్రయోజనకరమేనని భావిస్తున్నాం.  


నెస్లే ఇండియా - కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌
ప్రస్తుత ధర: 11,577     టార్గెట్‌ ధర: 12,000

ఎందుకంటే: కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తేవడం ద్వారా అమ్మకాలు మరింతగా పెంచుకోవాలని ఈ కంపెనీ యోచిస్తోంది. ఆరోగ్య,  పోషక సంబంధిత ఉత్పత్తులపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తోంది.  కొత్త ఉత్పత్తుల కోసం తగిన స్థాయిల్లో పెట్టుబడులు పెడుతోంది. ఇన్‌స్టంట్‌ నూడుల్స్, పాస్తా, ఇన్‌ఫాంట్‌ సెరియల్స్, టీ క్రీమర్, వైట్‌ అండ్‌ వేఫర్‌ చాక్లెట్స్, ఇన్‌స్టంట్‌ కాఫీ తదితర కేటగిరీల్లో ఈ కంపెనీదే అగ్రస్థానం. 2011–13 కాలంలో భారీ పెట్టుబడులతో చేపట్టిన ప్లాంట్ల విస్తరణ, ఉత్పత్తి సామర్థ్య పెంపు ఫలితాలు అందడం మొదలైంది. ఫలితంగా రాబడి నిష్పత్తులు మరింతగా మెరుగపడనున్నాయి.

ఆరోగ్యానికి హానికరమంటూ వార్తలు రావడంతో కంపెనీ బ్రాండ్‌ మ్యాగీ అమ్మకాలు గతంలో బాగా పడిపోయాయి. కంపెనీ తీసుకున్న వివిధ చర్యల కారణంగా మ్యాగీ తిరిగి తన పూర్వ మార్కెట్‌ వాటాను  సొంతం చేసుకోగలిగింది. గత రెండేళ్లలో వివిధ కేటగిరీల్లో మొత్తం 39 కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది.  గత ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో 16 శాతంగా ఉన్న ఎబిటా ఈ ఏడాది ఇదే కాలానికి 22 శాతానికి ఎగసింది. ముడి పదార్ధాల ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణం.

పట్టణీకరణ వేగం పుంజుకోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో మహిళల మాటకు విలువ పెరుగుతుండటం(ఈ కంపెనీ ఉత్పత్తులు మహిళలకు శ్రమను, కాలాన్ని తగ్గిస్తాయి) కలసి వచ్చే అంశాలు.  రెండేళ్లలో ఆదాయం 13 శాతం, అమ్మకాలు 12 శాతం చొప్పున పెరుగుతాయని అంచనా. వృద్ధి జోరును పెంచడానికి ఉద్దేశించిన కన్సూమర్‌ క్లస్టర్‌ అప్రోచ్‌ (భారత్‌ను 15 క్లస్టర్లుగా విభజించింది) మంచి ఫలితాలనిస్తోంది.   


గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజ్‌ సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement