స్టాక్స్‌ వ్యూ | Stocks view | Sakshi
Sakshi News home page

స్టాక్స్‌ వ్యూ

Published Mon, Oct 22 2018 1:27 AM | Last Updated on Mon, Oct 22 2018 1:27 AM

Stocks view - Sakshi

ఇన్ఫోసిస్‌ - కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌ 
ప్రస్తుత ధర: రూ.683   టార్గెట్‌ ధర: రూ.800

ఎందుకంటే:  ఇన్ఫోసిస్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో అంచనాలను మించిన ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. డాలర్ల పరంగా ఆదాయం 3 శాతం వృద్ధితో 292 కోట్ల డాలర్లకు పెరిగింది. బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ ఇన్సూరెన్స్‌(బీఎఫ్‌ఎస్‌ఐ), రిటైల్‌ విభాగాల్లో  ఆరోగ్యకరమైన వృద్ధిని సాధించింది. రూపాయిల్లో చూస్తే ఆదాయం 8 శాతం వృద్ధితో రూ.20,609 కోట్లకు పెరిగింది. పరిహార, సబ్‌కాంట్రాక్టింగ్‌ వ్యయాలతో పాటు  వేతన వ్యయాలు కూడా  పెరగడంతో రూపాయి క్షీణించిన ప్రయోజనం కంపెనీకి పెద్దగా దక్కలేదు.

ఫ్లూయిడో సంస్థ విలీన ఫలాలు దక్కనుండటం, డిజిటల్‌ విభాగం జోరైన వృద్ధి, డీల్స్‌ పటిష్టంగా ఉండటం, ఉద్యోగుల వలస (ఆట్రీషన్‌) తగ్గడం కంపెనీకి కలసివచ్చింది. అయితే ఉద్యోగుల వ్యయాలు అధికంగా ఉండటం వల్ల మార్జిన్లు అంచనాలను అందుకోలేకపోయాయి. ఒక్కో షేర్‌కు రూ.7 మధ్యంతర డివిడెండ్‌ను  ప్రకటించింది. బీఎఫ్‌ఎస్‌ఐపై అమెరికా క్లయింట్లు మరికొన్ని క్వార్టర్ల పాటు వ్యయాలు కొనసాగించనున్నారని యాజమాన్యం ధీమాగా  ఉంది. పటిష్టమైన డీల్స్‌ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయ అంచనాలను ఈ కంపెనీ సునాయాసంగానే అందుకోగలదని భావిస్తున్నాం.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో ఈ కంపెనీ భారీగానే మూలధన పెట్టుబడులు పెడుతోంది.  రూపాయి పతనం ప్రయోజనంతో ఈ ఆర్థిక సంవత్సరం అంచనాలను అందుకునే అవకాశాలు అధికంగానే ఉన్నాయి. డిజిటల్‌ విభాగం జోరుగా వృద్ధి సాధిస్తుండటం, డీల్స్‌ ఎగ్జిక్యూషన్‌ పటిష్టంగా ఉండడం వల్ల మార్జిన్లు పుంజుకోగలవని భావిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్‌కు 21 రెట్ల ధరకు పోటీ కంపెనీ టీసీఎస్‌ షేర్‌ ట్రేడవుతోంది. దీంతో పోల్చితే ఇన్ఫోసిస్‌ షేర్‌.. వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్‌కు 16 రెట్ల ధరకే ట్రేడవుతోంది. ప్రస్తుత ధర... ఇన్వెస్ట్‌మెంట్‌కు ఆకర్షణీయంగా ఉంది.  


ట్రైడెంట్‌ - కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌
ప్రస్తుత ధర: రూ.64  టార్గెట్‌ ధర: రూ.83

ఎందుకంటే: ట్రైడెంట్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక(2018–19, క్యూ2) కాలంలో అన్ని విభాగాల్లో మంచి వృద్ధి కనబరిచింది. ఆదాయం 24% వృద్ధితో రూ.1,391 కోట్లకు పెరిగింది ఇబిటా 83% పెరిగి రూ.317 కోట్లకు చేరింది. ముడి పదార్ధాల, ఉద్యోగుల వ్యయాలు తక్కువగా ఉండటంతో ఎబిటా మార్జిన్‌ 7.3 శాతం పెరిగి 22.8%కి చేరింది. నికర లాభం 195 శాతం వృద్ధితో రూ.148 కోట్లకు పెరిగింది. ఇదే జోరు రానున్న రెండు క్వార్టర్లలో కొనసాగగలదని అంచనా వేస్తున్నాం. గత క్యూ2లో 32 శాతంగా ఉన్న పన్ను రేటు ఈ క్యూ2లో 28.8 శాతానికి తగ్గడం కంపెనీకి కలసివచ్చింది.

టెక్స్‌టైల్స్‌ విభాగం 25 శాతం, పేపర్‌ అండ్‌ కెమికల్స్‌ విభాగం 22 శాతం చొప్పున వృద్ది చెందాయి. వివిధ కారణాల వల్ల కాగితం(పేపర్‌) విభాగం మంచి వృద్ధి సాధించడం కంపెనీకి ప్రయోజనం చేకూర్చింది. కాపీయర్‌ పేపర్‌కు డిమాండ్‌ పెరగడం, చైనాలో పేపర్‌ మిల్లుల మూసివేత కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో కొరత ఏర్పడడం వల్ల పేపర్‌కు డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో పబ్లిషింగ్‌ సీజన్‌ ప్రారంభం కానుండటంతో పేపర్‌కు మరింతగా డిమాండ్‌ పెరుగుతుందని కంపెనీ అంచనా వేస్తోంది.

గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర రుణ భారం రూ.271 కోట్లు తగ్గి ఈ క్యూ2 చివరి నాటికి రూ.2,527 కోట్లకు తగ్గింది. షేర్‌ వారీ ఆర్జన(ఈపీఎస్‌)  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7% చొప్పున  వృద్ధి చెందుతాయని భావిస్తున్నాం.  రెండేళ్లలో ఆదాయం 10 శాతం, నికర లాభం 32 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతాయని అంచనా వేస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(ఆర్‌ఓఈ) 4.6% పెరిగి 13.8 శాతానికి చేరుతుందని భావిస్తున్నాం.


గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజ్‌ సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement