స్టాక్స్‌ వ్యూ | Stocks view | Sakshi
Sakshi News home page

స్టాక్స్‌ వ్యూ

Published Mon, May 29 2017 12:52 AM | Last Updated on Tue, Sep 5 2017 12:13 PM

Stocks view

వోల్టాస్‌    
బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌
ప్రస్తుత ధర: రూ.499   ;   టార్గెట్‌ ధర: రూ.400


టాటా గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయం 10 శాతం వృద్ధితో రూ.2,040 కోట్లకు, ఇబిటా 23 శాతం వృద్ధితో రూ.220 కోట్లకు పెరిగాయి. మార్జిన్‌ 120 బేసిస్‌ పాయింట్లు పెరిగి 10.9 శాతానికి చేరింది. నికర లాభం 46 శాతం వృద్ధితో రూ.200 కోట్లకు పెరిగింది. యూసీపీ(యూనిటరీ కూలింగ్‌ ప్రోడక్ట్స్‌) అమ్మకాలు 28 శాతం వృద్ధితో రూ.1,090 కోట్లకు పెరిగాయి. ఈ రంగంలో 21 శాతం మార్కెట్‌ వాటాతో ఈ కంపెనీదే అగ్రస్థానం. ఈ సెగ్మెంట్‌ ఇబిటా మార్జిన్‌ నిలకడగా 16.4 శాతంగా ఉంది. అయితే ఎలక్ట్రో మెకానికల్‌ ప్రాజెక్ట్స్‌(ఈఎంపీ) విభాగం ఆదాయం 9 శాతం తగ్గి రూ.830 కోట్లకు చేరింది.

 కొన్ని ప్రాజెక్ట్‌ల ప్రగతి అంచనాల కంటే మందకొడిగా ఉండడమే దీనికి కారణం. తక్కువ మార్జిన్లు వచ్చే ఆర్డర్లను వదిలివేసి, ఎక్కువ మార్జిన్లు వచ్చే కొత్త ఆర్డర్లను చేపట్టడంతో ఈ సెగ్మెంట్‌ ఇబిటా మార్జిన్‌ 5.7 శాతంగా ఉంది. ఈ కంపెనీ టర్కీకి చెందిన ఆర్సెలిక్‌ కంపెనీ అనుబంధ సంస్థ, బెకోతో ఒక జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నది. ఇటీవలే దీనికి సంబంధించి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ జేవీలో భాగంగా  ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషీన్లు, మైక్రోవేవ్‌ ఓవెన్‌ వంటి గృహోపకరణాలను వొల్టాస్‌ బేకో బ్రాండ్‌ కింద తయారు చేసి, విక్రయించనున్నారు. ఇన్ని సానుకూలతలు ఉన్నప్పటికీ, రూ.400 టార్గెట్‌ ధరకు ఈ షేర్‌ను ప్రస్తుత ధరలో అమ్మేయాలంటూ సిఫార్సు చేస్తున్నాం. ఎందుకంటే, ఏసీ సెగ్మెంట్‌లో తీవ్ర పోటీ కారణంగా మార్జిన్లు బాగా తగ్గే అవకాశాలున్నాయి.

కెనరా బ్యాంక్‌    
బ్రోకరేజ్‌ సంస్థ: ఇండియా ఇన్ఫోలైన్‌
ప్రస్తుత ధర: రూ.360  ;  టార్గెట్‌ ధర: రూ.497


ఇటీవలి మొండి బకాయిల సంబంధిత ఆర్డినెన్స్‌ కారణంగా ఈ బ్యాంక్‌ రుణ నాణ్యత మెరుగుపడే అవకాశాలున్నాయి.  ఫలితంగా రెండేళ్లలో స్థూల మొండి బకాయలు 211 బేసిస్‌ పాయింట్లు తగ్గి 7.5 శాతానికి దిగిరావొచ్చని అంచనా వేస్తున్నాం. ఒత్తిడి గల రుణాలు గత ఆర్థిక సంవత్సరంలో  23 బేసిస్‌ పాయింట్లు తగ్గి 13.45 శాతానికి చేరాయి. మరో రెండేళ్ల పాటు ఈ ఒత్తిడి గల రుణాలు తక్కువ స్థాయిలోనే ఉంటాయని బ్యాంక్‌ అంచనా వేస్తోంది. లఘు, చిన్న, మద్య తరహా, రిటైల్, వ్యవసాయ రంగ రుణాలపై దృష్టిని కొనసాగిస్తోంది. మార్జిన్లు అధికంగా ఉండే రిటైల్‌ రుణాలను పెంచుకోవాలని బ్యాంక్‌ భావిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 61 శాతంగా ఉన్న మొత్తం రుణాల్లో రిటైల్‌ రుణాల వాటాను వచ్చే ఆర్థిక సంవత్సరం చివరికల్లా 65 శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

 కాసా వాటా గత ఆర్థిక సంవత్సరంలో 738 బేసిస్‌ పాయింట్లు పెరిగి 33 శాతానికి చేరింది. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరికల్లా దీనిని 35 శాతానికి పెంచుకోవాలని బ్యాంక్‌ లక్ష్యంగా నిర్దేశించుకుంది. గత ఆర్థిక సంవత్సరం చివరికి స్థూల మొండి బకాయిలు 9.6 శాతం, నికర మొండి బకా>యిలు 6.3 శాతంగా ఉన్నాయి.  రెండేళ్లలో రుణాలు 10.5 శాతం చొప్పున చక్రగతి వృద్ధితో రూ.4.2 లక్షల కోట్లకు పెరుగుతాయని అంచనా. రుణ నాణ్యత మెరుగుపడుతుండడం, నికర వడ్డీ మార్జిన్‌లు పెరిగే అవకాశాలు, వడ్డీయేతర ఆదాయం పెరుగుతుండడంతో బ్యాంక్‌ లాభదాయకత మెరుగుపడగలదని భావిస్తున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement