అజంతా ఫార్మా కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్
ప్రస్తుత ధర: రూ.1,524
టార్గెట్ ధర: రూ.1,792
ఎందుకంటే: వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పరిస్థితులు మెరుగుపడతాయని కంపెనీ భావిస్తోంది. దేశీయ ఫార్ములేషన్ వ్యాపారంలో జీఎస్‌టీ సంబంధిత సమస్యలు ఇప్పుడిప్పుడే సమసిపోతున్నాయి. గువాహటిలో ఈ కంపెనీ ఒక ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఫలితంగా అవుట్ సోర్సింగ్ తగ్గి, నిర్వహణ సామర్థ్యం పెరగడమే కాకుండా, పన్ను ప్రయోజనాలు కూడా లభించనున్నాయి. దేశీయ ఫార్ములేషన్స్ విభాగంలో 13 ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలానికి ఐదు అండా(అబ్రివియేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్)లనే అమెరికా ఎఫ్‌డీఏకు సమర్పించినప్పటికీ, మిగిలిన ఆరు నెలల్లో 10–15 అండాలు దాఖలు చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఈ క్యూ2లో అమెరికా మార్కెట్లో అమ్మకాలు ఒకింత తగ్గాయి. ఇటీవలే 22 ఔషధాలకు అమెరికా ఎఫ్‌డీఏ నుంచి తుది ఆమెదాలు పొందింది. దీంతో రానున్న క్వార్టర్లలో అమ్మకాలు పుంజుకోగలవని కంపెనీ అంచనా వేస్తోంది.
మలేరియా చికిత్సలో ఉపయోగపడే ఔషధాలను సరఫరా చేయడానికి గ్లోబల్ ఫండ్ ఎంపిక చేసిన కంపెనీల్లో ఇది కూడా ఒకటి. ఈ ఔషధాల తయారీకి అవసరమైన ముడి పదార్థాల ధరలు గత 10 నెలల కాలంలో నిలకడగా ఉండటంతో ఈ కేటగిరీ లాభదాయకతపై పెద్దగా రిస్క్ ఉండదు. ఇటీవలే ఆసియా, ఆఫ్రికా మార్కెట్లలో కొన్ని బ్రాండెడ్ జనరిక్స్ ఔషధాలను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుతం రూ.175 కోట్ల మూలధన పెట్టుబడులు పెట్టింది. ఇంకా రూ.125 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నది.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే రేంజ్‌లో (రూ.300 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నది. 2016–18 మధ్య కాలానికి అమ్మకాలు 9 శాతం, నికర లాభం 6 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగా, రానున్న రెండేళ్లలో అమ్మకాలు 14 శాతం, నికర లాభం 11 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించగలవని అంచనా. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో వ్యాపార పరిస్థితులు మెరుగుపడడమే దీనికి ప్రధాన కారణం.
ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్
ప్రస్తుత ధర: రూ.1,274
టార్గెట్ ధర: రూ.1,700
ఎందుకంటే: ఆర్‌పీ–సంజీవ్ గోయెంకా గ్రూప్(సీఈఎస్‌సీ ప్రమోటర్ గ్రూప్ ఇదే)కు చెందిన ఈ కంపెనీ టైర్ల తయారీలో ఉపయోగపడే కార్బన్ బ్లాక్‌ను తయారు చేస్తోంది. ఈ సెగ్మెంట్లో 40 శాతం మార్కెట్ వాటాతో ఉన్న అతి పెద్ద కంపెనీ ఇదే. విజయవంతంగా టర్న్ అరౌండ్ బాట పట్టిన ఈ కంపెనీ 16 శాతం ఇబిటా మార్జిన్‌ను సాధిస్తోంది. వాహన రంగం నుంచి డిమాండ్ పెరుగుతుండడం, చైనాలో ఉత్పత్తి తగ్గి సరఫరాలు తగ్గుతుండడం.. కార్బన్ బ్లాక్ తయారు చేసే ఈ కంపెనీకి ప్రయోజనం కలిగించనున్నది.
ముడి పదార్ధాలైన కమోడిటీ, ముడి చమురు ధరల్లో తీవ్రమైన ఒడిదుడుకుల కారణంగా గతంలో ఈ కంపెనీ లాభాలపై ఒత్తిడి తీవ్రంగానే వుండేది. ఈ చర వ్యయాలను బట్టే ధరల్లో మార్పులు, చేర్పులు చేసేందుకు కీలకమైన కస్టమర్లతో ఈ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. అందుకని ముడి చమురు ధరల ఒడిదుడుకుల ప్రభావం గతంలో లాగా కంపెనీ లాభదాయకతపై ప్రభావం చూపించే అవకాశాల్లేవు. డిమాండ్ పుంజుకోవడం, నిర్వహణ సామర్థ్యం మెరుగుదల కారణంగా లాభదాయకత పెరిగి కంపెనీ నికర రుణ భారం తగ్గింది.
మొత్తం మీద రెండేళ్లలో అమ్మకాలు 6 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతాయని భావిస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో రూ.73 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ..210 కోట్లకు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.241 కోట్లకు, 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.335 కోట్లకు పెరగవచ్చని అంచనా. కార్బన్ బ్లాక్ తయారు చేసే రెండు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు–ఓరియన్ కార్బన్, కార్బొట్ కార్ప్‌లు.. కార్బన్ బ్లాక్ పరిశ్రమకు మంచి రోజుల చాలా కాలం కొనసాగనున్నాయని వెల్లడించడం సానుకూలాంశం.
గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment