వచ్చే ఏడాది వృద్ధి పరుగులు!
దేశీయ వినిమయమే దన్ను...మోర్గాన్ స్టాన్లీ అంచనా
ముంబై: వినిమయం దన్నుగా భారత్ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2016-17) పటిష్ట వృద్ధి సాధిస్తుందన్న అంచనాలను ప్రముఖ వాల్‌స్ట్రీట్ బ్రోకరేజ్ సంస్థ- మోర్గాన్ స్టాన్లీ అంచనావేసింది. సంస్థ రూపొందించిన నివేదికలో ముఖ్యాంశాలు...
♦ ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడం, వాస్తవ వడ్డీరేటు సానుకూలంగా మారడం వంటి అంశాల నేపథ్యంలో వినియోగం బలపడనుంది. 1998 నుంచి 2002 వరకూ సాగిన రికవరీ సైకిల్‌కన్నా మంచి వృద్ధి తీరు ఉంటుంది.
♦ ముఖ్యంగా ప్రైవేటు వినియోగం భారీగా పెరగడానికి 7వ వేతన కమిషన్ అమలు ప్రధాన కారణం. కొత్త ఉపాధి సృష్టి అవకాశాలూ మెరుగుపడ్డం మరొక కారణం.
♦ వచ్చే ఆర్థిక సంవత్సరం కేంద్ర, రాష్ట్రాల ద్రవ్యలోటు 5.8% ఉంటుంది. (కేంద్రానికి సంబంధించి 3.5%, రాష్ట్రాలకు సంబంధించి 2.3%). ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) ఈ పరిమాణం 5.9 శాతం. గడచిన మూడేళ్లుగా ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య వ్యత్యాసానికి సంబంధించిన ద్రవ్యలోటు తగ్గుతూ రావడం ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు దోహదపడుతోంది.
♦ కార్పొరేట్ల అధిక రుణభారం, బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిలు.. ఆర్థిక వ్యవస్థకు సవాళ్లను విసురుతున్న అంశాల్లో కీలకమైనవి.