అధికాదాయ వర్గాలు.. సంపదను వెల్లడించాలి
♦ రిటర్న్స్‌లో భూమి, భవనం, ఆభరణాల వివరాలు ఇవ్వాల్సిందే
♦ సీబీడీటీ తాజా ఆదేశాలు...
న్యూఢిల్లీ: అధిక ఆదాయ వ్యక్తులు అంటే వార్షిక ఆదాయం రూ.50 లక్షలపైబడినవారు 2016-17 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో భూమి, భవనం, ఆభరణాలు, దుస్తులు, గృహోపకరణాల వంటి తమ విలువైన కొనుగోళ్ల వివరాలు అన్నింటినీ తెలియజేయాలని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కొత్త ఐటీఆర్ ఫామ్‌కు సంబంధించి సూచనలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం విలువైన బహుమతులు ఎవరినుంచైనా పొందినా... ఆ వివరాలు సైతం తెలియజేయాల్సి ఉంటుంది.
ఇంతక్రితం దాఖలు చేసిన సంపద పన్ను రిటర్న్స్‌లో ప్రస్తుతం పేర్కొంటున్న ఆస్తులు లేదా ఆభరణాల వివరాలు తెలియజేయడం జరిగిందా? లేదా అన్న అంశాన్ని కూడా అసెస్సీ స్పష్టం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ ఏప్రిల్‌లో కొత్త ఐటీఆర్ ఫామ్స్‌ను నోటిఫై చేసింది. వార్షిక ఆదాయం రూ.50 లక్షలు దాటిన వారికి వర్తించే విధంగా ‘అసెట్ అండ్ లయబిలిటీ యట్ ది యండ్ ఆఫ్ ది ఇయర్’ పేరుతో ఐటీఆర్-1, ఐటీఆర్-2, 2ఏల్లో తాజా రిపోర్టింగ్ కాలమ్స్‌ను చేర్చింది. భారత్‌లో రూ.50 లక్షలు పైబడిన వార్షిక ఆదాయం కలిగిన వారు కేవలం 1.5 లక్షల మంది ఉన్నట్లు అంచనా.