French Consumer Group Sues Google for Data Breach in France - Sakshi
Sakshi News home page

గూగుల్‌పై ఫ్రాన్స్‌లో దావా

Published Thu, Jun 27 2019 11:24 AM | Last Updated on Thu, Jun 27 2019 11:59 AM

Suit on Google in France - Sakshi

ప్యారిస్‌: అమెరికన్‌ టెక్‌ దిగ్గజం గూగుల్‌కు ఫ్రాన్స్‌లో షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా క్లాస్‌ యాక్షన్‌ దావా నమోదైంది. కఠినతరమైన యూరోపియన్‌ యూనియన్‌ డేటా భద్రత చట్టాలను ఉల్లంఘిస్తోందన్న ఆరోపణలపై వినియోగదారుల హక్కుల సంస్థ యూఎఫ్‌సీ–క్యూ కొయిసర్‌ గ్రూప్‌ ఈ దావా వేసింది. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ఆధారిత ఫోన్లు, ట్యాబ్‌లు మొదలైన డివైజ్‌లను ఉపయోగించే యూజర్ల వ్యక్తిగత డేటాను గూగుల్‌ మోసపూరితంగా దొంగిలిస్తోందని, దీన్ని అరికట్టే లక్ష్యంతోనే క్లాస్‌ యాక్షన్‌ సూట్‌ వేశామని యూఎఫ్‌సీ గ్రూప్‌ ప్రెసిడెంట్‌ అలెయిన్‌ బెజోట్‌ తెలిపారు. ఒకవేళ తమకు అనుకూలంగా తీర్పు వచ్చిన పక్షంలో ఫ్రాన్స్‌లో 2.8 కోట్ల మంది ఆండ్రాయిడ్‌ యూజర్లు ఒక్కొక్కరికీ 1,000 యూరోల దాకా పరిహారం లభించే అవకాశాలున్నట్లు వివరించారు. ఇప్పటిదాకా 200 మంది పైగా ఈ దావాలో చేరినట్లు బెజోట్‌ చెప్పారు. ఈ ఏడాది జనవరిలోనే ఫ్రాన్స్‌కి చెందిన డేటా నియంత్రణ సంస్థ సీఎన్‌ఐఎల్‌.. గూగుల్‌పై 50 మిలియన్‌ యూరోల జరిమానా విధించింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో వినియోగదారులకు విధించే అభ్యంతరకరమైన నిబంధనలు తొలగించాలంటూ ప్యారిస్‌ జిల్లా స్థాయి కోర్టు కూడా గూగుల్‌ను ఆదేశించింది. 

గూగుల్‌ మ్యాప్స్‌లో మరో భద్రతా ఫీచర్‌ ..
గూగుల్‌ మ్యాప్స్‌ తాజాగా భారత్‌లో ‘స్టే సేఫర్‌’  కొత్త ఫీచర్‌ ప్రవేశపెట్టింది. ట్యాక్సీలు, ఆటోల్లో ప్రయాణిస్తున్నప్పుడు.. వాహనం దారి తప్పితే వెంటనే యూజర్లను హెచ్చరించడం ఇందులో ప్రత్యేకత. ఈ ఫీచర్‌ ద్వారా.. ప్రయాణికులు తమ ట్రిప్‌ గురించిన వివరాలు ఎప్పటికప్పుడు కుటుంబసభ్యులు, మిత్రులకు లైవ్‌లో అందజేయొచ్చని గూగుల్‌ పేర్కొంది. గూగుల్‌ మ్యాప్స్‌ యాప్‌లో వెళ్లాల్సిన గమ్యస్థానం, మార్గం గురించి సెర్చి చేసిన తర్వాత ’గెట్‌ ఆఫ్‌–రూట్‌ అలర్ట్స్‌’ ఆప్షన్‌ను యాక్టివేట్‌ చేయడం ద్వారా ఈ సేవలు పొందవచ్చని వివరించింది. ఒకవేళ డ్రైవర్‌  గూగుల్‌ మ్యాప్‌ సూచించిన రూటుకు భిన్నంగా దాదాపు అర కిలోమీటరు మేర వాహనాన్ని దారి మళ్లించిన పక్షంలో వెంటనే ప్రయాణికుల ఫోన్‌కు నోటిఫికేషన్‌ వచ్చేస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement