ఆధార్-పాన్ లింక్ పై తీర్పు రిజర్వు
పాన్ కార్డుకు, ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఆధార్ లింక్ తప్పనిసరి చేసే అంశంపై తీర్పును ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును రిజర్వులో పెట్టింది. దీనిపై అన్ని పార్టీలు తమ స్పందనలు మంగళవారం వరకు తెలుపాలని జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన అపెక్స్ కోర్టు బెంచ్ ఆదేశించింది.
ఆధార్ అత్యంత సురక్షితమైనదని, దీనిలో ఎలాంటి నకిలీకి అవకాశముండదని అటార్ని జనరల్ ముఖుల్ రోహత్గి సుప్రీంకోర్టు బెంచ్ కు తెలిపారు. దాదాపు పది లక్షల పాన్ కార్డులను రద్దు చేయడాన్ని ప్రస్తావిస్తూ.. దేశవ్యాప్తంగా 113.7 కోట్ల ఆధార్ కార్డులు జారీ చేస్తే ఒక్క నకిలీ కూడా బయటపడలేదని ఆయన మంగళవారం సుప్రీం ముందు చెప్పారు.
అయితే ఆధార్ సిస్టమ్ పూర్తిగా రుజువు లేనిదని, దీన్ని కూడా నకిలీ చేయొచ్చని పిటిషన్ దారుల తరుఫున లాయర్లు తమ వాదనలు వినిపించారు. ఇటీవలే సుమారు 14కోట్లు (13కోట్ల 5లక్షల) ఆధార్‌కార్డులు, పదికోట్లకు పైగా బ్యాంకు ఖాతాల సమాచారం లీక్ అయిందని తాజా రిపోర్ట్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపింది.