
న్యూఢిల్లీ: భారత అథ్లెట్, ఆసియా క్రీడల హెప్టాథ్లాన్ చాంపియన్ స్వప్న బర్మన్ ఎట్టకేలకు ప్రత్యేక బూట్లు అందుకుంది. ఆమె రెండు పాదాలకు ఆరేసి వేళ్లున్నాయి. డజను వేళ్లతో ఉన్న ఆమెకు సాధారణ స్పోర్ట్స్ షూస్ ఇరుకుగా, అసౌకర్యంగా ఉండటంతో పరుగు పెట్టడంలో ఇబ్బంది పడుతోంది. మొత్తానికి ఎన్ని ఇబ్బందులెదురైనా... ఇండోనేసియాలో గతేడాది జరిగిన ఏషియాడ్‌లో ఆమె దేశానికి బంగారు పతకం తెచ్చిపెట్టింది.
చివరకు జర్మనీకి చెందిన ప్రముఖ క్రీడా ఉత్పత్తుల సంస్థ అడిడాస్ ప్రత్యేకించి స్వప్న పాదాల కోసమే బూట్లను తయారు చేసింది. ఇందుకోసం ఆమెను హెర్జోజెనరచ్‌లో ఉన్న తమ అథ్లెట్ సర్వీసెస్ ల్యాబ్‌కు తీసుకెళ్లింది. అక్కడ ఆమె పాదాలకు అనుగుణమైన కొలతల్ని తీసుకొని సౌకర్యవంతమైన ఆకృతిలో బూట్లను తయారు చేసింది. తనకు ఏ ఇబ్బంది లేకుండా పూర్తి సౌకర్యవంతమైన బూట్లు రావడంతో స్వప్న తెగ సంబరపడిపోతోంది. అడిడాస్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపిన ఆమె దేశానికి మరిన్ని పతకాలు తెచ్చేందుకు కష్టపడతానని ఈ సందర్భంగా చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment