
రెండేళ్లలో రెట్టింపునకు ‘సిప్’ పెట్టుబడులు
⇔ ప్రస్తుతం నెలవారీ పెట్టుబడులు రూ.4,580 కోట్లు
⇔ గత మూడేళ్లలో మూడు రెట్ల వృద్ధి
ముంబై: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్)ను ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతూ ఉండడంతో వచ్చే రెండళ్లలో ఈ పెట్టుబడులు ప్రస్తుత స్థాయి నుంచి రెట్టింపు అవుతాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేర్కొంది. వాస్తవానికి గత మూడేళ్ల కాలంలో సిప్‌ల్లో నెలవారీ ఇన్వెస్ట్‌మెంట్స్ మూడు రెట్లు వృద్ధి చెంది ఈ ఏడాది మే నెలలో రూ.4,580 కోట్లకు చేరుకోవడం గమనార్హం. ఈ సంస్థ నివేదిక ప్రకారం ఇది ఈ స్థాయి నుంచి రెట్టింపు కానుంది. 42 మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు కలసి 1.4 కోట్లకుపైగా సిప్ ఖాతాలను నిర్వహిస్తుండగా... ఈ ఏడాది ఒక్క మే నెలలోనే కొత్తగా 5 లక్షల సిప్ ఫోలియోలు పెరిగాయి.
‘‘2014 మార్చిలో సిప్ ద్వారా వచ్చిన పెట్టుబడుల విలువ రూ.1,206 కోట్లు. ఇది 2017 మార్చి నెలలో రూ.3,989 కోట్లుగా నమోదైంది. ఈ కాలంలో యాక్టివ్ సిప్ ఖాతాల సంఖ్య 51.96 లక్షల నుంచి 1.4 కోట్లకు పెరిగింది’’ అని జియోజిత్ నివేదిక వెల్లడించింది. వచ్చే రెండేళ్లలో నెలవారీగా సిప్ రూపంలో వచ్చే పెట్టుబడులు రూ.10,000 కోట్ల స్థాయిని చేరుతుందనేది ఈ సంస్థ అంచనా. ‘‘సిప్ ద్వారా ఈక్విటీ మార్కెట్లోకి వచ్చే ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతోంది. గడిచిన ఏడాదిలో సిప్ ఫోలియోల్లో అనూహ్య పెరుగుదల ఉంది. వచ్చే కొన్నేళ్లలో ఇది ఇంకా జోరందుకుంటుంది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ అసిసోయేట్ డైరెక్టర్ రంజిత్ ఆర్జీ పేర్కొన్నారు.