న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల సరఫరాకు సంబంధించి టాటా మోటార్స్ భారీ కాంట్రాక్టును దక్కించుకుంది. కేంద్ర ప్రభుత్వ విభాగమైన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్) 10,000 ఎలక్ట్రిక్ కార్ల సరఫరాకు సంబంధించి బిడ్లను ఆహ్వానించగా, అందులో విజేతగా టాటా మోటార్స్ నిలిచింది. టాటా మోటార్స్ రెండు దశల్లో కార్లను సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇందులో బాగంగా 500 ఎలక్ట్రిక్ కార్లను ఈ ఏడాది నవంబర్‌లోనే ఈఈఎస్‌ఎల్‌కు సరఫరా చేయాలి.
మరో 9,500 వాహనాలను రెండో దశలో సరఫరా చేయాల్సి ఉంటుందని ఈఈఎస్‌ఎల్ ఓ ప్రకటనలో వెల్లడించింది. టాటా మోటార్స్ ఒక్కో కారును జీఎస్టీ కాకుండా అతి తక్కువగా రూ.10.16లక్షలను కోట్ చేసినట్టు తెలిపింది. జీఎస్టీతో కలిపితే ఒక్కో కారు ధర రూ.11.2 లక్షలు చేరుతుందని, ప్రస్తుత మార్కెట్ ధరతో పోలిస్తే 25 శాతం తక్కువని వివరించింది. ఈ బిడ్డింగ్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా, నిస్సాన్ కూడా పాల్గొన్నాయి. ఎలక్ట్రిక్ కార్లకు సేవలు అందించేందుకు ఓ సర్వీస్ ఏజెన్సీని కూడా బిడ్డింగ్ ద్వారా ఎంపిక చేయనున్నట్టు ఈఈఎస్‌ఎల్ తెలిపింది.