EESL
-
జగనన్న ఇళ్లలో ‘హరిత’ వెలుగులు
సాక్షి, అమరావతి: పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “జగనన్న ఇళ్లు’ పథకంలో ప్రతి ఇంటిలో హరిత వెలుగులు ప్రసరించనున్నాయి. ఈ ఇళ్లకు విద్యుత్ ఆదా ఉపకరణాలను మార్కెట్ ధరకంటే తక్కువకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విద్యుత్తు శాఖకు చెందిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)తో ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఇంధన సామర్థ్య అభివృద్ధి సంస్థ (ఏపీసీడ్కో)తో కలిసి ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ (ఏపీఎస్‌హెచ్‌సీఎల్) ఈఈఎస్ఎల్తో ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. గోవాలో శనివారం జరిగిన జీ20 వర్కింగ్ గ్రూప్ సదస్సులో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఈఈఎస్ఎల్ సీఈవో విశాల్ కపూర్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. గృహ నిర్మాణ పథకం లబ్దిదారులకు కరెంటు బిల్లులను తగ్గించడమే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించడం కూడా ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. ప్రతి ఇంటికీ కరెంటు బిల్లులో ఏటా రూ.2,259 మిగులు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న జగనన్న ఇళ్లకు ఈఈఎస్ఎల్ దశలవారీగా 6 లక్షల ఎల్ఈడీ బల్బులు, 3 లక్షల ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు, 3 లక్షల డీఎల్డీసీ సీలింగ్ ఫ్యాన్లు సరఫరా చేస్తుంది. ప్రతి ఇంటికీ 4 ఎల్ఈడీ బల్బులు, 2 ట్యూబ్ లైట్లు, 2 ఎనర్జీ ఎఫిషియెన్సీ ఫ్యాన్లను రాయితీ ధరలకు ప్రభుత్వం అందించనుంది. ఈ ఉపకరణాల వల్ల ప్రతి ఇంటికీ ఏడాదికి 734 యూనిట్ల విద్యుత్ మిగులుతుంది. తద్వారా కరెంటు బిల్లులో ఏడాదికి రూ.2,259 ఆదా అవుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 5 లక్షల జగనన్న ఇళ్లు నిర్మాణంలో ఉండగా.. తొలి దశలో నిరి్మస్తున్న 1.56 లక్షల ఇళ్లలో ఈ ఉపకరణాలను వినియోగిస్తారు. దీనివల్ల ఏడాదికి 1,145 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు విలువ దాదాపు రూ.400 కోట్లు కాగా తొలి దశలో రూ.100 కోట్లతో ఈ ఉపకరణాలను అందించేందుకు శనివారం ఒప్పందం జరిగింది. ఏపీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం: విశాల్ కపూర్ ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకం ఇళ్లను ప్రపంచంలోనే ఇంధన సామర్ధ్య గృహాలుగా తీర్చిదిద్దడం రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఈఈఎస్ఎల్ సీఈవో విశాల్ కపూర్ ప్రశంసించారు. సుస్థిర ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజన్‌తో చేపడుతున్న ఈ కార్యక్రమం దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని కొనియాడారు. ఏపీతో ఒప్పందం సందర్భంగా జరిగిన జి 20 సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హరిత ఇంధన లక్ష్యాల సాధనలో ఇదో కీలక ముందడుగని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. ఎనర్జీ ఎఫిషియన్సీ హౌసింగ్ ప్రోగ్రామ్ దేశంలోనే అతిపెద్దదని, ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని అన్నారు. ఈ ఒప్పందం ద్వారా పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని వెల్లడించారు. ఈ సదస్సులో ఈఈఎస్ఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అనిమేశ్ మిశ్రా, జాతీయ సీనియర్ సలహాదారు ఎ.చంద్రశేఖరరెడ్డి, ఏపీసీడ్కో ఎండీ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. -
జగనన్న ఇళ్లల్లో విద్యుత్ పొదుపు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగమయ్యేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈసీఎల్) ముందుకొచ్చింది. గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్‌తో ఈఈఎస్ఎల్ సీనియర్ అధికారులు అనిమేష్మిశ్రా, నితిన్ భుట్ ఢిల్లీ నుంచి ఆదివారం వర్చువల్‌గా సమావేశమయ్యారు. పేదల ఇళ్లలో ఇంధన సామర్థ్య చర్యల అమలుకు ఈఈఎస్ఎల్ సూత్రప్రాయంగా అంగీకరించింది. అజయ్‌జైన్ మాట్లాడుతూ.. విద్యుత్ బిల్లుల తగ్గింపునకు ఇలాంటి వినూత్న చర్యలు తీసుకున్న ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ మంజూరు చేసిన 21.3 లక్షల ఇళ్లలో 20.45 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందని, నెలాఖరు నాటికి దాదాపు 5 లక్షల ఇళ్లను పూర్తి చేసేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందన్నారు. ఈఈఎస్ఎల్ ద్వారా విద్యుత్ ఆదా చేసే ఎలక్ట్రికల్ ఉపకరణాలను తక్కువ ఖర్చుతో అందజేస్తామని చెప్పారు. -
ఈఈఎస్ఎల్తో జియోథింగ్స్ ఒప్పందం
న్యూఢిల్లీ: స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటు కోసం ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ (ఈఈఎస్ఎల్)తో జియోథింగ్స్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఫ్రెంచ్ సంస్థ ఈడీఎఫ్‌తో కలిసి బిహార్‌లో తమ స్మార్ట్ యుటిలిటీ ప్లాట్‌ఫాం సొల్యూషన్ ఆధారిత 10 లక్షల స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేయనుంది. తాజా స్మార్ట్ సాంకేతికల వినియోగం ద్వారా విద్యుత్ రంగం లబ్ధి పొందేందుకు తమ స్మార్ట్ యుటిలిటీ ప్లాట్‌ఫాం ఉపయోగపడగలదని జియో ప్లాట్‌ఫామ్స్ సీఈవో కిరణ్ థా మస్ తెలిపారు. కేంద్ర విద్యుత్ శాఖ నిర్దేశించుకున్న 25 కోట్ల స్మార్ట్ మీటర్ల లక్ష్య సాకారం దిశగా ఈ ప్రయత్నాలు తోడ్పడగలవని పేర్కొన్నారు. విశ్వసనీయమైన విధంగా శక్తిపరమైన భద్రతను సాధించుకోవడంలో స్మార్ట్ మీటరింగ్ కీలకంగా ఉండగలదని ఈఈఎస్ఎల్ తెలిపింది. -
బీఎస్ఎన్ఎల్ ఆఫీసుల్లో వాహనాల చార్జింగ్ స్టేషన్లు
న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రభుత్వ రంగ సంస్థలైన ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ (ఈఈఎస్ఎల్), బీఎస్ఎన్ఎల్ చేతులు కలిపాయి. దశల వారీగా దేశవ్యాప్తంగా 1,000 బీఎస్ఎన్ఎల్ సైట్లలో చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పేందుకు అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం చార్జింగ్ సర్వీసులకు అవసరమైన ఇన్ఫ్రా ఏర్పాటు, నిర్వహణ మొదలైన వాటికి కావాల్సిన నిధులను ఈఈఎస్ఎల్ ఇన్వెస్ట్ చేయనుంది. స్థలం, విద్యుత్ కనెక్షన్లను.. బీఎస్ఎన్ఎల్ సమకూరుస్తుంది. జాతీయ విద్యుత్ వాహన పథకంలో భాగంగా ఈఈఎస్ఎల్ ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 300 ఏసీ, 170 డీసీ చార్జర్లను ఏర్పాటు చేసింది. -
పల్లెల్లో ఎల్ఈడీ వెలుగులు!
సాక్షి, హైదరాబాద్: కరెంటు బిల్లుల భారం తగ్గించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇప్పటికే పట్టణాల్లో ఎల్ఈడీ లైట్లను ప్రవేశపెట్టిన ప్రభుత్వం..పల్లెల్లోనూ ఈ దీపాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మామూలు వీధి దీపాలను వినియోగిస్తున్న గ్రామ పంచాయతీలు.. ఇకపై తక్కువ విద్యుత్, ఎక్కువ కాంతులు వెదజల్లే ఎల్ఈడీ లైట్లతో వెలిగిపోనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ ఆదాలో మంచి గుర్తింపు ఉన్న ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈ ఎస్ఎల్)తో ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 12,753 గ్రామ పంచాయతీల్లో ఏడేళ్లపాటు వీధి దీపాల సరఫరా, ఏర్పాటు, నిర్వహణ వ్యవహారాలను ఈ సంస్థ చూడనుంది. ఈఈఎస్ఎల్తో త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవాలని భావించిన పంచాయతీరాజ్‌శాఖ.. ఈ అగ్రిమెంట్లో జిల్లా పంచాయ తీ అధికారి, గ్రామ పంచాయతీ, ఈఈఎస్ఎల్లకు భాగస్వామ్యం కల్పిస్తోంది. నిధుల్లేకుంటే డీపీవోల ద్వారా సర్దుబాటు గ్రామాల్లో ఉపయోగిస్తున్న వీధి దీపాలతో కరెంట్ బిల్లులు భారీగా రావడమేగాకుండా.. నిర్వహణ కూడా కష్టసాధ్యమవుతోంది. ఈ నేపథ్యంలో విద్యుత్ పొదుపు, నిర్వహణ వ్యయం తగ్గేలా దీపాల వ్యవస్థను అమలు చేస్తామని ఈఈఎస్ఎల్ సంస్థ ముందుకు రావడంతో పంచాయతీరాజ్‌శాఖ అటువైపు మొగ్గు చూపింది. ఒప్పందకాలంలో ఎల్ఈడీ లైట్ల నిర్వహణ బాధ్యత పూర్తిగా సంస్థదే. దీపాల బిగింపు, నిర్వహణ, ఇంధన పొదుపు సాంకేతికతలో భాగంగా టైమర్ల ఏర్పాటు వ్యవస్థను కూడా సంస్థనే చూసుకోవాల్సి ఉంటోంది. నెలవారీ విద్యుత్ బిల్లులను స్థానిక పంచాయతీ చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ నిధుల కటకటతో చెల్లించలేని పరిస్థితుల్లో జీపీ ఉంటే జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) బిల్లులను సర్దుబాటు చేయాలని పీఆర్ శాఖ నిర్దేశించింది. టెండర్లతో సంబంధం లేకుండా.. సంస్థతో అగ్రి మెంటు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈఈ ఎస్ఎల్ సంస్థ పనితీరును మదింపు చేయాలని జీపీలను ఆదేశించింది. నేషనల్ లైట్స్ కోడ్ ప్రమాణాలకు అనుగుణంగా దీపాలను ఏర్పా టు చేశారా? లేదా పరిశీలించాలని నిర్దేశించింది. ఇదిలావుండగా, రాష్ట్రవ్యాప్తంగా అన్నిగ్రామాల్లో వీధి దీపాల నిర్వహణ పరిశీలనకు పంచాయతీరాజ్ కమిషనరేట్‌లో కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. త్రైపాక్షిక ఒప్పంద పత్రా ల నమూనాను జిల్లా కలెక్టర్లకు పంచాయతీరాజ్ కమిషనర్ ఎం.రఘునందన్‌రావు పంపారు. -
సూపర్ ఎఫీషియంట్ ఏసీ : ఇంధనం ఆదా, తక్కువ ధర
సాక్షి, న్యూఢిల్లీ : తక్కువ విద్యుత్, అందుబాటులో ధరల్లో ఎల్ఈడీ ఉత్పత్తులను (ట్యూబ్ లైట్స్, బల్బులు, ఫాన్స్) పరిచయం చేసి విజయవంతమైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) మరో కీలక ఆవిష్కరణకు నాంది పలికింది. పవర్ సేవ్, సూపర్ ఎఫిషియంట్ ఎయిర్ కండిషనర్(ఏసీ) లను ఢిల్లీలో నేడు (సోమవారం,జూలై 8) లాంచ్ చేసింది. మార్కెట్లో ప్రస్తుతం లభిస్తున్న ఏసీల ధరలతో పోలిస్తే…ఈ ఏసీలు 30 శాతం తక్కువ ధరకు లభ్యం. నాలుగు ప్రభుత్వ రంగ సంస్థల జాయింట్ వెంచర్ (రాజధాని పవర్ లిమిటెడ్, యమునా పవర్ లిమిటెడ్, టాటా పవర్ డీడీఎల్ ) అయితే ఈఈఎస్ఎల్ వీటిని ఆవిష్కరించింది. మొదటి దశలో 50వేల ఏసీలను ఢిల్లీలోని వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. వీటి ధరను రూ. 41,300 గా నిర్ణయించింది. తాము లాంచ్ చేసిన కొత్త ఏసీల ద్వారా 50 శాతం విద్యుత్తు ఆదా అవుతుందని కంపెనీ చెబుతోంది.1.5 టన్నుల ఇన్వర్టర్ స్ప్లిట్ ఎసిలు 5.4 శక్తి సామర్థ్య రేటింగ్ కలిగి ఉన్నాయని, ప్రస్తుతమున్న బీఇ 5 స్టార్ రేటెడ్ ఎసిల కంటే 20 శాతం ఎక్కువ సామర్థ్యం వీటి సొంతమని ప్రకటించింది. 4.5 సామర్థ్యం కలిగిన ఫైవ్ స్టార్ రేటెడ్ ఏసీ 1155 వాట్ల వద్ద పనిచేస్తుంది. కానీ తమ ఏసీలు కేవలం 960 వాట్ల వద్ద అదే పనితీరును కనబరుస్తాయని తెలిపింది. తద్వారా సగటున ఏడాదికి 300 యూనిట్లు లేదా 2400 రూపాయలు ఆదా అవుతుందని పేర్కొంది. అలాగే మార్కెట్లో ప్రస్తుతం లభిస్తున్న త్రీ స్టార్ ఏసీలతో పోలిస్తే ఏడాదికి 4వేల రూపాయలు పొదుపు చేయవచ్చని తెలిపింది. ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ ముప్పును ఎదుర్కొనే చర్యల్లో భాగంగా ఈ సూపర్ ఎఫెక్టివ్ ఏసీలను తీసుకొచ్చామని ఈఈఎస్ఎల్ ఎండీ సౌరభ్ కుమార్ తెలిపారు. భారతదేశానికి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎంపికల కంటే చాలా స్థిరమైన, సరసమైన శీతలీకరణ అవసరం. ఈ లక్ష్యాన్ని సూపర్ ఎఫిషియంట్ ఎయిర్ కండిషనర్లు తీర్చనున్నాయన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి మొత్తం స్టాక్ హాట్ సేల్ పూర్తి కానుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తరువాతి సీజన్ నాటికి దేశ వ్యాప్తంగా 2లక్షల యూనిట్లను అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కుమార్ చెప్పారు. త్వరలోనే ఇ-కామర్స్ మార్కెట్లో లభ్యం కానున్న ఈ ఏసీలు ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన ఈఈఎస్ఎల్మార్ట్.ఇన్ ద్వారా మాత్రమే లభ్యం కానున్నాయి. ఎంపిక చేసిన బ్యాంకుల ద్వారా ఆకర్షణీయమైన ఈఎంఐ ఆఫర్, ఉచిత రిపేర్ సర్వీసు, ఫిర్యాదుల పరిష్కార మద్దతుతదితర సేవలను ఆఫర్ చేస్తోంది. అంతేకాదు అప్‌గ్రేడ్ కావాలనుకున్న కస్టమర్లకు బై బ్యాక్ఆఫర్ను కూడా అందిచనుంది. In the first phase, 50,000 of these #SuperEfficient ACs will be available for consumers of BRPL, BSES, BYPL & Tata Power-DDL in Delhi. Consumers can buy these ACs on our dedicated online portal - https://t.co/oqRGg4Z1sy, at just a click of the button. — EESL India (@EESL_India) July 8, 2019 -
20 రోజుల్లో ఈ–కార్ల పరుగులు!
సాక్షి, విశాఖపట్నం: నగరంలో ఈ–కార్లు పరుగులు తీయనున్నాయి. మరో 20 రోజుల్లో ఇవి రోడ్డెక్కనున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ అధికారులు పెద్ద ఎత్తున అద్దె కార్లను వినియోగిస్తున్నారు. వాటి స్థానంలో దశల వారీగా ఎలక్ట్రిక్ కార్ల (ఈ– కార్ల)ను ప్రవేశపెట్టాలన్నది ప్రభుత్వ యోచన. ఈ ఎలక్ట్రిక్ కార్లను ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) సంస్థ సమకూర్చనుంది. విశాఖకు దాదాపు 400 ఎలక్ట్రిక్ కార్లు అవసరమవుతాయని అధికారులు ఇదివరకే అంచనా వేశారు. తొలిదశలో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్)కు 67, జీవీఎంసీకి 30 వెరసి 97 ఈ–కార్ల కోసం ఈఈఎస్ఎల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రస్తుతం నగరంలోని డీలర్ల వద్ద 30 ఈ–కార్లు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ఈపీడీసీఎల్‌కు 20, జీవీఎంసీకి 10 కార్లను మరో 20 రోజుల్లోగా డెలివరీ చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇవి కాకుండా మరికొన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు మరో వంద కార్లకు డిమాండ్ ఉంది. మలిదశలో వీటిని అందజేస్తారు. ఆ తర్వాత దశల వారీ గా ఇతర ప్రభుత్వ శాఖలకు ఈ–కార్లను సమకూరుస్తారు. టాటా, మహిం ద్రా కంపెనీలు తయారు చేస్తున్న టాటా టిగార్, మహింద్రా ఈ–వెరిటో మోడల్ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ.12–13 లక్షల విలువ చేసే ఈ–కారును ఈఈ ఎస్ఎల్ కొనుగోలు చేస్తుంది. వీటిని వినియోగిస్తున్న శాఖలు డ్రైవర్‌ను సొంతంగా సమకూర్చుకుని నెలకు ఒక్కో కారుకు రూ.20 వేల చొప్పున ఈఈఎస్ఎల్కు అద్దె చెల్లించాల్సి ఉంటుందని ఈఈఎస్‌ల్ వర్గాలు ‘సాక్షి’కి చెప్పాయి. ఈ–కార్ల ప్రత్యేకతలివీ.. ప్రస్తుత మార్కెట్లో ఉన్న టిగార్, వెరిటో మోడళ్లతోనే ఈ–కార్లను రూపొందించారు. ఈ కార్లకు క్లచ్, గేర్లు ఉండవు. న్యూట్రల్, రివర్స్, స్పీడ్ (స్పోక్) పాయింట్లను మార్చుకుంటే సరిపోతుంది. నడుస్తున్నపుడు బ్యాటరీ కార్ల మాదిరిగా ఏ మాత్రం శబ్దం రాదు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లే వీలుంటుంది. చార్జింగ్ స్టేషన్లు.. ఈ–కార్లు నడవడానికి చార్జింగ్ స్టేషన్లు అవసరం. ఇందుకోసం ఈపీడీసీఎల్ 12 ఫాస్ట్ చార్జింగ్ (డీసీ) స్టేషన్లు, 13 ఏసీ చార్జింగ్ పాయింట్లను సిద్ధం చేస్తోంది. ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లను ఈపీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీసులో 6, మధురవాడ, సర్కిల్, డివిజన్ కార్యాలయాల్లోను, కార్పొరేట్ కార్యాలయంలో 3, జీవీఎంసీలో 7, కలెక్టరాఫీసులో 2 చోట్ల వీటిని ఏర్పాటు చేయనున్నారు. సెప్టెంబర్ మూడో వారం నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయని ఈపీడీసీఎల్ అధికారులు ‘సాక్షి’కి చెప్పారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే కారు 145 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఫాస్ట్ చార్జింగ్ 90 నిమిషాలు, ఏసీ చార్జింగ్ 6 గంటల సమయం తీసుకుంటుంది. దీంతో ఈ ఎలక్ట్రిక్ కార్లు నగర పరిధిలో తిరగడానికే ఎక్కువగా ఉపయోగపడనున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని సమీప పట్టణాల్లో ప్రతి 30, 50 కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని డిస్కంలు యోచిస్తున్నాయి. -
కరెంట్ కార్లొచ్చాయ్!
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ మరో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. రాష్ట్రంలో తొలి సారిగా ‘ఎలక్ట్రిక్ కార్ల’ను అందుబాటులోకి తెస్తోంది. తొలి విడతగా 20 కార్లను ఈఈఎస్ఎల్ (ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్) నుంచి అద్దె ప్రాతిపదికన తీసుకుంది. వీటిని జీహెచ్ఎంసీలోని అధికారుల కోసం వినియోగించనున్నారు. తొలిదశలో క్షేత్రస్థాయి పర్యటనలు లేని, కార్యాలయ విధులకు మాత్రమే పరిమితమయ్యే అధికారులు వీటిని వినియోగించనున్నారు. కార్లపనితీరును బట్టి దశలవారీగా వీటి సంఖ్యను పెంచనున్నారు. భవిష్యత్‌లో చెత్త తరలింపు స్వచ్ఛ ఆటోలను కూడా ఎలక్ట్రిక్‌వే తీసుకునే యోచనలో ఉన్నారు. ఈ కార్లను శుక్రవారం మంత్రి కేటీఆర్, ఐక్యరాజ్య సమితి పర్యావరణ ప్రోగ్రాం(యూఎన్ఈపీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోలేమ్తో కలిసి ప్రారంభించనున్నారు. జీహెచ్ఎంసీలో అద్దె కార్ల హవా.. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో అధికారుల కోసం 349 అద్దె కార్లు వినియోగిస్తున్నారు. ఇందుకు ఒక్కోకారుకు నెలకు రూ.34 వేలు చెల్లిస్తున్నారు. ఈఈఎస్‌ఎస్ డ్రైవర్‌తో సహా ఎలక్ట్రిక్ కార్లకు నెలకు రూ.40 వేల అద్దె తీసుకుంటుండగా, జీహెచ్ఎంసీలో విధుల్లేక ఖాళీగా ఉన్న డ్రైవర్లను వినియోగించి నెలకు రూ.22,500 అద్దెపై ఒప్పందం కుదుర్చుకున్నారు. డ్రైవర్ వేతనాన్ని కలుపుకుంటే ప్రస్తుతం సంప్రదాయ అద్దెకార్లకు చెల్లిస్తున్న వ్యయమే అవుతుండడంతో జీహెచ్ఎంసీ ఇందుకు సిద్ధమైంది. కార్ల అద్దెను సంవత్సరానికి పదిశాతం పెంచనున్నారు. ఆరు సంవత్సరాల పాటు ఒప్పందం అమల్లో ఉంటుంది. కరెంట్ కార్ల పనితీరు ఇదీ.. ♦ ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ ఒకసారి పూర్తి చార్జి చేస్తే 100–130 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. పూర్తి చార్జ్ంగ్కు 4 గంటల సమయం పడుతుంది. అరగంటలో చార్జ్ అయ్యే ఫాస్ట్ చార్జర్లు కూడా వాడవచ్చు. ♦ ఇవి పూర్తిగా పర్యావరణహితం. ♦ వాయు, ధ్వని కాలుష్యం లేక పోవడమే కాక కార్బన్ డై యాక్సైడ్ వెలువడదు. ♦ గరిష్టంగా గంటకు 80 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి. ♦ చార్జింగ్ వల్ల కిలోమీటరు ప్రయాణానికి దాదాపు రూ.0.89 విద్యుత్ ఖర్చవుతుంది. ♦ బ్యాటరీ జీవితకాలం లక్ష కిలోమీటర్ల ప్రయాణం. -
టాటా మోటార్స్‌కు ‘ఎలక్ట్రిక్’ జాక్‌పాట్!
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల సరఫరాకు సంబంధించి టాటా మోటార్స్ భారీ కాంట్రాక్టును దక్కించుకుంది. కేంద్ర ప్రభుత్వ విభాగమైన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) 10,000 ఎలక్ట్రిక్ కార్ల సరఫరాకు సంబంధించి బిడ్లను ఆహ్వానించగా, అందులో విజేతగా టాటా మోటార్స్ నిలిచింది. టాటా మోటార్స్ రెండు దశల్లో కార్లను సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇందులో బాగంగా 500 ఎలక్ట్రిక్ కార్లను ఈ ఏడాది నవంబర్లోనే ఈఈఎస్ఎల్కు సరఫరా చేయాలి. మరో 9,500 వాహనాలను రెండో దశలో సరఫరా చేయాల్సి ఉంటుందని ఈఈఎస్ఎల్ ఓ ప్రకటనలో వెల్లడించింది. టాటా మోటార్స్ ఒక్కో కారును జీఎస్టీ కాకుండా అతి తక్కువగా రూ.10.16లక్షలను కోట్ చేసినట్టు తెలిపింది. జీఎస్టీతో కలిపితే ఒక్కో కారు ధర రూ.11.2 లక్షలు చేరుతుందని, ప్రస్తుత మార్కెట్ ధరతో పోలిస్తే 25 శాతం తక్కువని వివరించింది. ఈ బిడ్డింగ్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా, నిస్సాన్ కూడా పాల్గొన్నాయి. ఎలక్ట్రిక్ కార్లకు సేవలు అందించేందుకు ఓ సర్వీస్ ఏజెన్సీని కూడా బిడ్డింగ్ ద్వారా ఎంపిక చేయనున్నట్టు ఈఈఎస్ఎల్ తెలిపింది. -
రూ.200 కోట్లకు ఈఈఎస్ఎల్ ఐపీఓ
♦ వచ్చే నెల్లో మర్చంట్ బ్యాంకర్ల నియామకం ♦ దీనికోసం 20 శాతం వాటాను డైల్యూట్ చేస్తాం ♦ ఈ ఏడాది రూ.6 వేల కోట్లతో విస్తరణ ప్రణాళిక ♦ రూ.4,800 కోట్లు రుణాల రూపంలో సేకరణ ♦ ఈఈఎస్ఎల్ ఎండీ సౌరభ్ కుమార్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ (ఈఈఎస్ఎల్) ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూకు రానుంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.200 కోట్లు సమీకరించే యోచన చేస్తున్నట్లు సంస్థ ఎండీ సౌరభ్ కుమార్ బుధవారమిక్కడ విలేకరులతో చెప్పారు. 20 శాతం వాటాను డైల్యూట్ చేయటం ద్వారా ఈ నిధులను సమీకరించనున్నట్లు తెలిపారాయన. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈ ఏడాది రూ.6 వేల కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారాయన. ‘‘ఈ రూ.6వేల కోట్లలో రూ.1,200 కోట్లు మా వాటాగా పెడతాం. మిగిలిన రూ.4,800 కోట్లనూ రుణాల ద్వారా సమీకరిస్తాం. దీనికోసం వివిధ మార్గాలను అన్వేషిస్తున్నాం. దీన్లో భాగంగా యూకే మార్కెట్లో 10 కోట్ల డాలర్ల విలువైన రూపీ బాండ్లను (మసాలా) కూడా జారీ చేస్తాం’’ అని సౌరభ్ కుమార్ వివరించారు. ప్రస్తుతం తమ సంస్థ చెల్లించిన మూలధనం రూ.460 కోట్లుగా ఉందని, మరో రూ.540 కోట్లను ప్రమోటర్ల ద్వారా సమీకరిస్తామని చెప్పారాయన. ‘‘మిగిలిన రూ.200 కోట్లనూ ఐపీఓ ద్వారా సమీకరిస్తాం. దీనికోసం 20 శాతం వాటాను డైల్యూట్ చేస్తాం. ఐపీఓకు సంబంధించి మర్చంట్ బ్యాంకర్లను నెల రోజుల్లోగా ఎంపిక చేస్తాం’’ అని చెప్పారు. విద్యుత్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో... కేంద్ర విద్యుత్ శాఖ సారథ్యంలో ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కలిసి ఈఈఎస్ఎల్ను జాయింట్ వెంచర్ కంపెనీగా ఏర్పాటు చేశాయి. దేశవ్యాప్తంగా ఇంధనాన్ని సమర్థంగా వినియోగించుకునే ప్రాజెక్టుల్ని ఇది అమలు చేస్తుంది. దీన్లో భాగంగా రెండేళ్ల కిందట ‘ఉజాలా’ పథకాన్ని కూడా ఆరంభించింది. ఈ పథకం కింద ఇప్పటికే సాధారణ బల్బుల స్థానంలో విద్యుత్‌ను ఆదా చేసే 24 కోట్ల పైచిలుకు ఎల్ఈడీ బల్బులు ఏర్పాటయ్యాయి. 24 లక్షల ఎల్ఈడీ ట్యూబ్‌లైట్లు, 8.5 లక్షల ఫ్యాన్లను విక్రయించారు. ఈ ఏడాది మరో 15 కోట్ల ఎల్ఈడీ బల్బులను జోడిస్తామని సౌరభ్ కుమార్ ఈ సందర్భంగా చెప్పారు. 2019 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 77 కోట్ల ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేయడం సంస్థ లక్ష్యమన్నారు. కంపెనీ ఒక్కో బల్బును రూ.70కే విక్రయిస్తోంది. మూడేళ్లలో పాడైతే కొత్తది ఇస్తారు. అలాగే ఎల్ఈడీ ట్యూబ్‌లైట్ రూ.230, విద్యుత్‌ను ఆదాచేసే ఫ్యాన్ రూ.1,150లకు అందుబాటులోకి తెచ్చింది. మీసేవా, రెవెన్యూ కేంద్రాలు, పోస్టాఫీసులు, స్వయం సహాయక సంఘాల ద్వారా, విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద వీటిని విక్రయిస్తున్నారు. జీహెచ్ఎంసీతో భారీ ప్రాజెక్టు.. గ్రేటర్ హైదరాబాద్‌లో 4.5 లక్షల వీధి దీపాల స్థానంలో ఎల్ఈడీ లైట్లను ఆరు నెలల్లో ఏర్పాటు చేయనున్నట్టు సౌరభ్ కుమార్ తెలిపారు. జీహెచ్ఎంసీకి వీధి దీపాల విద్యుత్ బిల్లు ఏటా రూ.200 కోట్లు వస్తోంది. ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుతో ఈ బిల్లు సగానికి పడిపోతుంది. ఈ ప్రాజెక్టు కోసం ఈఈఎస్ఎల్ రూ.270 కోట్లు వెచ్చిస్తోంది. నిర్వహణ కూడా మాదే. జీహెచ్ఎంసీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టడం లేదు. ఆదా అవుతున్న విద్యుత్ బిల్లు నుంచి మాత్రమే లైట్ల ఏర్పాటు, నిర్వహణకుగాను ఏటా సుమారు రూ.70 కోట్లు జీహెచ్ఎంసీ ఏడేళ్లపాటు ఈఈఎస్ఎల్కు చెల్లిస్తుంది’ అని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇటువంటి ప్రాజెక్టులు మరిన్ని చేయబోతున్నాం అని వివరించారు.