జీహెచ్‌ఎంసీ అధికారులు వినియోగించనున్న విద్యుత్ కారు ఇదే..
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ మరో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. రాష్ట్రంలో తొలి సారిగా ‘ఎలక్ట్రిక్ కార్ల’ను అందుబాటులోకి తెస్తోంది. తొలి విడతగా 20 కార్లను ఈఈఎస్‌ఎల్ (ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్) నుంచి అద్దె ప్రాతిపదికన తీసుకుంది. వీటిని జీహెచ్‌ఎంసీలోని అధికారుల కోసం వినియోగించనున్నారు. తొలిదశలో క్షేత్రస్థాయి పర్యటనలు లేని, కార్యాలయ విధులకు మాత్రమే పరిమితమయ్యే అధికారులు వీటిని వినియోగించనున్నారు. కార్లపనితీరును బట్టి దశలవారీగా వీటి సంఖ్యను పెంచనున్నారు. భవిష్యత్‌లో చెత్త తరలింపు స్వచ్ఛ ఆటోలను కూడా ఎలక్ట్రిక్‌వే తీసుకునే యోచనలో ఉన్నారు. ఈ కార్లను శుక్రవారం మంత్రి కేటీఆర్, ఐక్యరాజ్య సమితి పర్యావరణ ప్రోగ్రాం(యూఎన్‌ఈపీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోలేమ్‌తో కలిసి ప్రారంభించనున్నారు.
జీహెచ్‌ఎంసీలో అద్దె కార్ల హవా..
ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో అధికారుల కోసం 349 అద్దె కార్లు వినియోగిస్తున్నారు. ఇందుకు ఒక్కోకారుకు నెలకు రూ.34 వేలు చెల్లిస్తున్నారు. ఈఈఎస్‌ఎస్ డ్రైవర్‌తో సహా ఎలక్ట్రిక్ కార్లకు నెలకు రూ.40 వేల అద్దె తీసుకుంటుండగా, జీహెచ్‌ఎంసీలో విధుల్లేక ఖాళీగా ఉన్న డ్రైవర్లను వినియోగించి నెలకు రూ.22,500 అద్దెపై ఒప్పందం కుదుర్చుకున్నారు. డ్రైవర్ వేతనాన్ని కలుపుకుంటే ప్రస్తుతం సంప్రదాయ అద్దెకార్లకు చెల్లిస్తున్న వ్యయమే అవుతుండడంతో జీహెచ్‌ఎంసీ ఇందుకు సిద్ధమైంది. కార్ల అద్దెను సంవత్సరానికి పదిశాతం పెంచనున్నారు. ఆరు సంవత్సరాల పాటు ఒప్పందం అమల్లో ఉంటుంది.
కరెంట్ కార్ల పనితీరు ఇదీ..
♦ ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ ఒకసారి పూర్తి చార్జి చేస్తే 100–130 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. పూర్తి చార్జ్‌ంగ్‌కు 4 గంటల సమయం పడుతుంది. అరగంటలో చార్జ్ అయ్యే ఫాస్ట్ చార్జర్లు కూడా వాడవచ్చు.
♦ ఇవి పూర్తిగా పర్యావరణహితం.
♦ వాయు, ధ్వని కాలుష్యం లేక పోవడమే కాక కార్బన్ డై యాక్సైడ్ వెలువడదు.
♦ గరిష్టంగా గంటకు 80 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి.
♦ చార్జింగ్ వల్ల కిలోమీటరు ప్రయాణానికి దాదాపు రూ.0.89 విద్యుత్ ఖర్చవుతుంది.
♦ బ్యాటరీ జీవితకాలం లక్ష కిలోమీటర్ల ప్రయాణం.
Comments
Please login to add a commentAdd a comment