సాక్షి, హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణ.. వాహన కాలుష్యం తగ్గింపు.. ఇంధన వ్యయం ఆదా తదితర చర్యల్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జీహెచ్‌ఎంసీలో అధికారులకు వినియోగిస్తున్న అద్దె వాహనాల్లో ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తెచ్చింది.
తొలిదశలో ఇరవై మంది అధికారులకు వీటిని అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్‌ఎల్)తో ఒప్పందం కుదుర్చుకుంది. పర్యావరణ వారోత్సవాల్లో భాగంగా మున్సిపల్ మంత్రి కేటీఆర్, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం(యూఎన్‌ఈపీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్హీమ్ ఎలక్ట్రిక్ కార్లను ప్రారంభించారు.
ఒక్కో కారుకు రూ.22,500 అద్దె..
జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతం 349 అద్దె కార్లను అధికారుల కోసం వినియోగిస్తున్నారు. ఒక్కోదానికీ నెలకు రూ.34 వేల అద్దె చెల్లిస్తున్నారు. దాదాపు ఇదే ధరతో ఎలక్ట్రిక్ కార్లను వినియోగంలోకి తీసుకురానున్నారు. ఈ కార్లను అద్దెకిచ్చే ఈఈఎస్‌ఎల్ డ్రైవర్‌తో పాటు నెలకు రూ.40 వేలు అద్దె తీసుకుంటుండగా, జీహెచ్‌ఎంసీలో వాహనాలు కండెమ్ కావడంతో పనిలేక ఖాళీగా ఉన్న డ్రైవర్లను వీటికి వినియోగించనున్నారు.
డ్రైవర్ వేతనం కాకుండా నెలకు రూ.22,500 అద్దెపై వీటిని ఇచ్చేందుకు ఈఈఎస్‌ఎల్ అంగీకరించింది. డ్రైవర్ వేతనాన్ని కలిపితే రూ.34,500 అవుతుండటంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ఇందుకు సిద్ధమయ్యారు. అద్దెను ఏటా పది శాతం వంతున పెంచనున్నారు. ఆరేళ్లపాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది.
కార్ల మార్కెట్ విలువ రూ. 12 లక్షలు
మార్కెట్‌లో ఈ కార్ల షోరూమ్ ధర రూ.12 లక్షలని సంబంధిత అధికారి తెలిపారు. టాటా, మహీంద్ర సంస్థలకు చెందిన ఈ కార్ల వేగం గంటకు 80 కిలోమీటర్లు. తొలిదశలో కార్యాలయాల్లో విధులు నిర్వహించేవారికే వీటిని కేటాయించాలని భావించినా.. క్షేత్రస్థాయి అధికారులు వీటిని కోరుతున్నారు.
తొలిదశలో రానున్న 20 వాహనాలను అడిషనల్ కమిషనర్(ఐటీ) ముషార్రఫ్ ఫారూఖి, ఈ కార్ల ప్రతిపాదనలు సిద్ధం చేసిన విద్యుత్ విభాగం ఈఈ శ్రీనివాసాచారితోపాటు కార్యాలయ విధులు మాత్రమే నిర్వహించే ఫైనాన్షియల్ అడ్వైజర్లు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ తదితరులకు ఇవ్వనున్నారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంతోపాటు జోనల్ కార్యాలయాల్లో, ఖైరతాబాద్ లేదా మలక్‌పేటలోని జీహెచ్‌ఎంసీ పార్కింగ్ యార్డులో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. రిజిస్ట్రేషన్ తదితర కార్యక్రమాలు త్వరలో పూర్తిచేయనున్నారు.
గ్రీన్ నంబర్ ప్లేట్..
పర్యావరణహితమైన ఈ ఎలక్ట్రిక్ కార్లకు గ్రీన్ బోర్డుపై తెలుపు రంగు అక్షరాలు బాగుంటాయని అధికారులు యోచిస్తున్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన విధానం తేవాల్సి ఉంది. ఇదే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం వద్ద కూడా ఉంది.
ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వం ఎనిమిది వేల కార్లకు, ఏపీ ప్రభుత్వం పదివేల కార్లకు ఈఈఎస్‌ఎల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రస్తుతం ఇంటింటి నుంచి చెత్తను సేకరించేందుకు ఆటో టిప్పర్ల(స్వచ్ఛ ఆటోలు)ను వాడుతున్నారు. ఇకపై ఇందుకు ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకునే యోచనలో ఉన్నారు.
ఇవీ ప్రత్యేకతలు..
♦ ఏసీ చార్జర్‌తో ఒకసారి బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేసేందుకు 6–8 గంటల సమయం పడుతుంది. ఒకసారి పూర్తిగా చార్జి చేస్తే 100–130 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అత్యవసరంగా చార్జింగ్ కావాలనుకుంటే డీసీ చార్జర్ వినియోగిస్తే గంటన్నరలోనే జీరో నుంచి పూర్తి చార్జింగ్ అవుతుంది.
♦ ఎలక్ట్రిక్ కార్లతో వాయు, ధ్వని కాలుష్యం ఉండదు. కార్బన్ డయాక్సైడ్ వెలువడదు.
♦ చార్జింగ్ వల్ల కిలోమీటర్ ప్రయాణానికి రూ.0.89 పైసలు విద్యుత్ బిల్లుగా ఖర్చవుతుంది.
♦ బ్యాటరీ జీవితకాలం లక్ష కిలోమీటర్ల ప్రయాణం
2030 నాటికి అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే..
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల్ని వినియోగించే వాహనాలను భవిష్యత్తులో రద్దు చేయనుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం, ఇంధన, పరిశ్రమల శాఖలు కలసి ‘నేషనల్ మిషన్ ఆన్ ఎలక్ట్రిక్ మొబిలిటీ’కార్యక్రమాన్ని చేపట్టాయి. 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలే రోడ్లపై తిరగాలనేది దీని లక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment