సాక్షి, అమరావతి: పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “జగనన్న ఇళ్లు’ పథకంలో ప్రతి ఇంటిలో హరిత వెలుగులు ప్రసరించనున్నాయి. ఈ ఇళ్లకు విద్యుత్ ఆదా ఉపకరణాలను మార్కెట్ ధరకంటే తక్కువకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విద్యుత్తు శాఖకు చెందిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్)తో ఒప్పందం చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ఇంధన సామర్థ్య అభివృద్ధి సంస్థ (ఏపీసీడ్‌కో)తో కలిసి ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ (ఏపీఎస్‌హెచ్‌సీఎల్) ఈఈఎస్‌ఎల్‌తో ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. గోవాలో శనివారం జరిగిన జీ20 వర్కింగ్ గ్రూప్ సదస్సులో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఈఈఎస్‌ఎల్ సీఈవో విశాల్ కపూర్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. గృహ నిర్మాణ పథకం లబ్దిదారులకు కరెంటు బిల్లులను తగ్గించడమే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించడం కూడా ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం.
ప్రతి ఇంటికీ కరెంటు బిల్లులో ఏటా రూ.2,259 మిగులు
రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న జగనన్న ఇళ్లకు ఈఈఎస్‌ఎల్ దశలవారీగా 6 లక్షల ఎల్‌ఈడీ బల్బులు, 3 లక్షల ఎల్‌ఈడీ ట్యూబ్ లైట్లు, 3 లక్షల డీఎల్‌డీసీ సీలింగ్ ఫ్యాన్లు సరఫరా చేస్తుంది. ప్రతి ఇంటికీ 4 ఎల్‌ఈడీ బల్బులు, 2 ట్యూబ్ లైట్లు, 2 ఎనర్జీ ఎఫిషియెన్సీ ఫ్యాన్లను రాయితీ ధరలకు ప్రభుత్వం అందించనుంది. ఈ ఉపకరణాల వల్ల ప్రతి ఇంటికీ ఏడాదికి 734 యూనిట్ల విద్యుత్ మిగులుతుంది.
తద్వారా కరెంటు బిల్లులో ఏడాదికి రూ.2,259 ఆదా అవుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 5 లక్షల జగనన్న ఇళ్లు నిర్మాణంలో ఉండగా.. తొలి దశలో నిరి్మస్తున్న 1.56 లక్షల ఇళ్లలో ఈ ఉపకరణాలను వినియోగిస్తారు. దీనివల్ల ఏడాదికి 1,145 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు విలువ దాదాపు రూ.400 కోట్లు కాగా తొలి దశలో రూ.100 కోట్లతో ఈ ఉపకరణాలను అందించేందుకు శనివారం ఒప్పందం జరిగింది.
ఏపీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం: విశాల్ కపూర్
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకం ఇళ్లను ప్రపంచంలోనే ఇంధన సామర్ధ్య గృహాలుగా తీర్చిదిద్దడం రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఈఈఎస్‌ఎల్ సీఈవో విశాల్ కపూర్ ప్రశంసించారు. సుస్థిర ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజన్‌తో చేపడుతున్న ఈ కార్యక్రమం దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని కొనియాడారు. ఏపీతో ఒప్పందం సందర్భంగా జరిగిన జి 20 సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హరిత ఇంధన లక్ష్యాల సాధనలో ఇదో కీలక ముందడుగని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. ఎనర్జీ ఎఫిషియన్సీ హౌసింగ్ ప్రోగ్రామ్ దేశంలోనే అతిపెద్దదని, ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని అన్నారు. ఈ ఒప్పందం ద్వారా పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని వెల్లడించారు. ఈ సదస్సులో ఈఈఎస్‌ఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అనిమేశ్ మిశ్రా, జాతీయ సీనియర్ సలహాదారు ఎ.చంద్రశేఖరరెడ్డి, ఏపీసీడ్కో ఎండీ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment