ఓటరుకు అన్నీ తెలుసు.. ఈ ఎన్నికల్లో జగన్‌దే గెలుపు
కూటమి కట్టడం కాదు.. గతంలో ఏం చేశారో చెప్పాలి
జగన్ పాలనలో విద్యా రంగం అద్భుతం
ప్రముఖ సినీ హీరో విశాల్
♦ ‘నేను ఎవరికీ వ్యతిరేకం కాదు.. మనసు లోతుల్లో అనిపించిందే చెబుతున్నా..
♦ జగన్ ప్రభుత్వంలో పల్లెల్లో విద్యా రంగంలో మార్పులు బాగా అనిపించాయి.
♦ ఏ నాయకుడైనా సరే... ప్రజలకు ఏం చేస్తున్నారనేది ముఖ్యం.
♦ పొత్తు పెట్టుకోండి.. అయితే గతంలో ఇంత మంచి చేశామని ప్రజలకు చెప్పగలరా?
♦ ఈ ఐదేళ్లూ ఇప్పుడున్న ఆయన ఏం చేయలేకపోయారని ధైర్యంగా మాట్లాడగలరా?
♦ ప్రజల్ని ఏమార్చాలంటే కుదరదు. ప్రజలకు అన్నీ తెలుసు.
♦ ఎవరెన్ని కూటములు కట్టినా... ఈ ఎన్నికల్లో జగన్‌దే గెలుపు అని నా భావన
♦ వీడెందుకు ఇంత మంచి చేస్తున్నాడనే మంటతో కొందరు కాళ్లు పట్టుకుని లాగాలని చూస్తారు.
♦ అలాంటి వాటికి వెరవని నేత జగన్ అనేది నా నమ్మకం..’ అని హీరో విశాల్ తన మనసులో మాటను బయటపెట్టారు. రత్నం సినిమా విడుదల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
మళ్లీ ఆయనే సీఎం..
నేనెప్పుడూ మనసులో ఉన్నదే మాట్లాడతా. పాదయాత్ర రోజుల నుంచి జగన్‌ను గమనిస్తున్నాను. ట్రెడ్ మిల్‌పై రెండు కి.మీ వాకింగ్ చేస్తే అలసి పోతాం. అలాంటిది ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వేల కిలోమీటర్లు నడవడం ప్రజా సమస్యల పట్ల ఆయన నిబద్ధతను చాటిచెబుతోంది. ఒక కొడుకుగా తండ్రి ప్రజాసేవను కొనసాగించడం మామూలు విషయం కాదు. జగన్ నాకు నచ్చిన నాయకుడు. మళ్లీ ఆయనే సీఎం.
విద్యలో సంస్కరణలు భేష్
ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో విద్యారంగంలో మార్పులు నన్ను ఆకట్టుకున్నాయి. ఎంత ఖర్చయినా సరే ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్న జగన్ సంకల్పం నచ్చింది. ఆడపిల్లలకు మంచి విద్య నేర్పించి మంచి భవిష్యత్‌ను ఇవ్వాలి. ఆడపిల్ల చదువు సమాజానికి మలుపు. జగన్ పాలనలో అది సాకారమవుతోంది. అందరికీ నాణ్యమైన విద్య అందాలనేది నా కోరిక. అందుకే మా అమ్మ పేరుతో ట్రస్ట్ నిర్వహిస్తున్నాను. చాలామంది ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేస్తున్నారు. మా వలంటీర్లు అలాంటి వారిని వెదికి చదివించడం చేస్తున్నారు.
మంచి నేతను ఎవరూ ఆపలేరు
ఏ నాయకుడైనా ప్రజలకు ఏం చేస్తున్నారనేది ముఖ్యం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి చేయాలంటే చాలా కష్టం.. మంచి చేసేవాళ్లని చూసి ఎన్నో కుట్రలు చేస్తారు. వైఎస్ జగన్‌పై దాడులు జరుగుతున్నాయి. అయితే మంచి చేయాలనుకునే నాయకుడిని ఆపడం ఎవరితరం కాదు. సినిమాలు, రాజకీయాలు రెండింటినీ సమన్వయం చేయడం కష్టం. రాజకీయాలంటే చాలా కష్టమైన విషయం. ఏసీ రూముల్లో కూచుని రాజకీయాలు చేయాలంటే కుదరదు. రాజకీయాల్లోకి రావాలంటే కొన్ని విషయాలు పూర్తిగా మర్చిపోవాలి. –సాక్షి, అమరావతి
మనసులో ఉన్నదే చెబుతున్నా
నాకు ఆంధ్రలో ఓటు లేకున్నా.. కొంతకాలంగా ఇక్కడి రాజకీయాలు గమనిస్తున్నా. జగన్ ఇంటర్వ్యూలు తరచుగా చూస్తాను. నేను వైఎస్సార్‌సీపీ ని సపోర్ట్ చేయడం లేదు. చంద్రబాబుకు వ్యతిరేకం కాదు. మనసులో ఏమనిపిస్తుందో అదే చెబుతున్నాను. పార్టీ లు జత కట్టడం మంచిదే. అయితే ఆ పార్టీలన్నీ ఒకే మేనిఫెస్టో పెట్టాలి. గతంలో మీరు ఏం మంచి చేశారో ప్రజల ముందుకు వచ్చి చెప్పాలి.
ఈ ఐదేళ్లలో ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయలేదో చెప్పగలగాలి. అలా కాకుండా ఇప్పుడు వచ్చి ఐదేళ్ల నాటి మేనిఫెస్టోను తుడిచి దానికే రెండు, మూడు తాయిలాలు చేర్చి ప్రజల్ని ఏమార్చాలంటే కుదరదు. ప్రజలకు అన్నీ తెలుసు. పొత్తులు పెట్టుకోండి.. అయితే మీరెందుకు పొత్తులు పెట్టుకుంటున్నారో ఓటరుకు తెలుసు. ఎవరికి ఓటేయాలో కూడా తెలుసు. ఎవరెన్ని కూటములు కట్టినా ఈ ఎన్నికల్లో జగన్‌దే గెలుపు.
Comments
Please login to add a commentAdd a comment