Home Construction Company
-
జగనన్న ఇళ్లలో ‘హరిత’ వెలుగులు
సాక్షి, అమరావతి: పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “జగనన్న ఇళ్లు’ పథకంలో ప్రతి ఇంటిలో హరిత వెలుగులు ప్రసరించనున్నాయి. ఈ ఇళ్లకు విద్యుత్ ఆదా ఉపకరణాలను మార్కెట్ ధరకంటే తక్కువకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విద్యుత్తు శాఖకు చెందిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)తో ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఇంధన సామర్థ్య అభివృద్ధి సంస్థ (ఏపీసీడ్కో)తో కలిసి ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ (ఏపీఎస్‌హెచ్‌సీఎల్) ఈఈఎస్ఎల్తో ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. గోవాలో శనివారం జరిగిన జీ20 వర్కింగ్ గ్రూప్ సదస్సులో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఈఈఎస్ఎల్ సీఈవో విశాల్ కపూర్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. గృహ నిర్మాణ పథకం లబ్దిదారులకు కరెంటు బిల్లులను తగ్గించడమే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించడం కూడా ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. ప్రతి ఇంటికీ కరెంటు బిల్లులో ఏటా రూ.2,259 మిగులు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న జగనన్న ఇళ్లకు ఈఈఎస్ఎల్ దశలవారీగా 6 లక్షల ఎల్ఈడీ బల్బులు, 3 లక్షల ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు, 3 లక్షల డీఎల్డీసీ సీలింగ్ ఫ్యాన్లు సరఫరా చేస్తుంది. ప్రతి ఇంటికీ 4 ఎల్ఈడీ బల్బులు, 2 ట్యూబ్ లైట్లు, 2 ఎనర్జీ ఎఫిషియెన్సీ ఫ్యాన్లను రాయితీ ధరలకు ప్రభుత్వం అందించనుంది. ఈ ఉపకరణాల వల్ల ప్రతి ఇంటికీ ఏడాదికి 734 యూనిట్ల విద్యుత్ మిగులుతుంది. తద్వారా కరెంటు బిల్లులో ఏడాదికి రూ.2,259 ఆదా అవుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 5 లక్షల జగనన్న ఇళ్లు నిర్మాణంలో ఉండగా.. తొలి దశలో నిరి్మస్తున్న 1.56 లక్షల ఇళ్లలో ఈ ఉపకరణాలను వినియోగిస్తారు. దీనివల్ల ఏడాదికి 1,145 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు విలువ దాదాపు రూ.400 కోట్లు కాగా తొలి దశలో రూ.100 కోట్లతో ఈ ఉపకరణాలను అందించేందుకు శనివారం ఒప్పందం జరిగింది. ఏపీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం: విశాల్ కపూర్ ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకం ఇళ్లను ప్రపంచంలోనే ఇంధన సామర్ధ్య గృహాలుగా తీర్చిదిద్దడం రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఈఈఎస్ఎల్ సీఈవో విశాల్ కపూర్ ప్రశంసించారు. సుస్థిర ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజన్‌తో చేపడుతున్న ఈ కార్యక్రమం దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని కొనియాడారు. ఏపీతో ఒప్పందం సందర్భంగా జరిగిన జి 20 సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హరిత ఇంధన లక్ష్యాల సాధనలో ఇదో కీలక ముందడుగని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. ఎనర్జీ ఎఫిషియన్సీ హౌసింగ్ ప్రోగ్రామ్ దేశంలోనే అతిపెద్దదని, ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని అన్నారు. ఈ ఒప్పందం ద్వారా పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని వెల్లడించారు. ఈ సదస్సులో ఈఈఎస్ఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అనిమేశ్ మిశ్రా, జాతీయ సీనియర్ సలహాదారు ఎ.చంద్రశేఖరరెడ్డి, ఏపీసీడ్కో ఎండీ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. -
సిబ్బంది లేక ఇబ్బందులు
కర్నూలు(అర్బన్): జిల్లా గృహ నిర్మాణ సంస్థను సిబ్బంది కొరత వేధిస్తోంది. జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం, డివిజన్ల పరిధిలోని ఈఈ కార్యాలయాలతో పాటు క్షేత్ర స్థాయిలోనూ తగినంత సిబ్బంది లేరు. దీనివల్ల పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 43 వేల గృహ నిర్మాణాలు పూర్తి కాగా, 48,920 నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. కొనసాగుతున్న గృహ నిర్మాణాలకు సంబంధించి జియో ట్యాగింగ్ చేసి బిల్లులను చెల్లించేందుకు సిబ్బంది కొరత ప్రతిబంధకంగా మారింది. దీనివల్ల బిల్లులు చేయడంలో నెలల తరబడి జాప్యం జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏయే పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే ... జిల్లా కేంద్రంలోని ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయంలో రెండేళ్లుగా మేనేజర్ పోస్టు ఖాళీగా ఉండడంతో ఒక డీఈ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఐటీ మేనేజర్ పోస్టు కూడా ఏడాదిన్నరగా ఖాళీగా ఉంది. ప్రస్తుతం కోడుమూరు డీఈ ఇన్చార్జ్ ఐటీ మేనేజర్‌గా అదనపు విధులను నిర్వహిస్తున్నారు. డోన్, పత్తికొండ, ఎమ్మిగనూరులో డీఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డోన్‌లో ఏడాది నుంచి ఖాళీ ఉంది. పత్తికొండ డీఈ ఆరు నెలల క్రితం సస్పెండ్ అయ్యారు. అప్పటి నుంచి ఎవరినీ నియమించలేదు. ఎమ్మిగనూరు డీఈ మూడు నెలల క్రితం పదవీ విరమణ చేశారు. ఈ మూడు చోట్ల ఇన్‌చార్జ్‌లతోనే నెట్టుకొస్తున్నారు. సగం ఏఈ పోస్టులు ఖాళీ క్షేత్ర స్థాయిలో లబ్ధిదారుల సమస్యలను పరిష్కరించడంలో, బిల్లులను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయించడంలోఏఈల పాత్ర కీలకం. జిల్లాకు మొత్తం 69 మంది ఏఈలు ఉండాలి. ప్రస్తుతం 34 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. సగానికి సగం పోస్టులు ఖాళీగా ఉండడంతో రెండు, మూడు మండలాలకు ఒక ఏఈ ఇన్చార్జ్గా వ్యవహరించాల్సి వస్తోంది. దీంతో బిల్లులు సకాలంలో చేయలేకపోతున్నారు. కర్నూలు, నంద్యాల, ఆదోని ఈఈ కార్యాలయాల్లోనూ కనీసం రెండు, మూడు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. దీంతో ఈఈలు మండలాల్లో పనిచేస్తున్న సిబ్బందిపైనే ఆధారపడుతున్నారు. జాప్యం లేకుండా చూస్తున్నాం గృహ నిర్మాణ సంస్థలో ఇంజినీర్లు, సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ఎక్కడా పనిలో జాప్యం జరగకుండా చర్యలు చేపట్టాం. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో వేర్వేరు దశల్లో కొనసాగుతున్న గృహ నిర్మాణాలకు సంబంధించి జియో ట్యాంగింగ్ చేయడం, బిల్లులను ఆన్లైన్లో పంపడం వంటి కార్యక్రమాల్లో ఇప్పటి వరకు ఎలాంటి జాప్యమూ జరగడం లేదు. ప్రతి రోజు పర్యవేక్షణ ఉన్న కారణంగా ఏ రోజు చేసిన బిల్లులను ఆదే రోజు ఆన్లైన్లో నమోదు చేసి పంపుతున్నాం. సిబ్బంది కొరత ఉన్న విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. – కేబీ వెంకటేశ్వరరెడ్డి, హౌసింగ్ పీడీ -
ఇక ఇళ్ల రాజకీయం!
* పదేళ్ల ఇళ్ల నిర్మాణాలపై సర్వే * నేటి నుంచి జియో టాగింగ్ ప్రారంభం.. * జిల్లాలో 59 బృందాలతో సర్వే శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో గృహనిర్మాణ సంస్థ ద్వారా వివిధ పథకాల కింద నిర్మించిన ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వం సర్వే ప్రారంభించింది. 2014-15 సంవత్సరానికి కొత్తగా ఒక్క ఇల్లు మంజూరు చేయకపోయినా గతంలో నిర్మించిన ఇళ్లపై మాత్రం సర్వేలు నిర్వహిస్తోంది. దీనికి రాజకీయ కారణాలే కారణమనే విమర్శలు వస్తున్నాయి. పదేళ్లుగా టీడీపీయేతర ప్రభుత్వాలు రాష్ట్రం లో ఉండడంతో నాడు నిర్మించిన ఇళ్లపై ప్రస్తుతం సర్వేలు చేస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా ఇళ్లు మంజూరు లేకుండా జాప్యం చేసేందుకు కూడా జియోటాగింగ్ విధానం పేరిట జాప్యం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విధానం వలన కొత్తగా ప్రభుత్వానికి గానీ, లబ్ధిదారులకుగానీ ఏ ప్రయోజనం లేకపోయినా సిబ్బందిని ఇబ్బంది పెట్టేందుకు, గత ప్రభుత్వం పొరపాట్లు చేసిందని ఆరోపించేందుకే జియోటాగింగ్ సర్వేను చేపడుతోందని భావిస్తున్నారు. జియోటాగింగ్ విధా నం జిల్లాలో గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకుగానూ వర్క్ ఇన్స్పెక్టర్లు, ఏఈలతో కూడిన 59 బృందాలను సిద్ధం చేశారు. ఈ బృందాలు ఆయా మండలాల్లో వారికి ప్రభుత్వం అందజేసే సెల్‌ఫోన్‌తో ఫోటోగ్రఫీ, ఇతర వివరాలు అప్లోడ్ చేసి జియోటాగింగ్ వెబ్సైట్లో పొందుపరుస్తారు. ఈ కార్యక్రమం డిసెంబరు 31 వరకు జిల్లాలో జరుగుతుంది. ఒక మం డలంలో రెండు బృందాలు పర్యటించేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ బృందాలకు మైక్రోమాక్స్ సెల్‌ఫోన్, ఎయిర్టెల్ సిమ్‌కార్డు, ప్రత్యేక రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులో ఉంచారు. వీరు ఆయా గ్రామాల్లో లబ్ధిదారుల జాబితాలను తీసుకొని జియోటాగింగ్ నిర్వహిస్తారు. ఈ సర్వేలకు 2004 నుంచి ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్ల వరకు అన్ని ఇళ్లను సర్వే చేయాలి. జిల్లా వ్యాప్తంగా ఇటువంటి గృహాలు సుమారుగా 4 లక్షల వరకు ఉంటాయని అధికారులు అంచనా వేశారు. దీనికి సంబంధించిన జాబితాలు ఆయా మండలాల వారీగా, స్కీమ్‌ల వారీగా సిద్ధం చేశారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లకు ప్రస్తుతం వాటి స్థాయిలతో కూడిన జాబితాలను తయారు చేశారు. వీటన్నింటినీ జీవో టాగింగ్ చేయాల్సి ఉంది. ఈ విధానంలో ఇందిరా ఆవాసయోజన పథకంలో మంజూరైన వాటికి తొలి ప్రాధాన్యమివ్వాలి. రెండవ ప్రాధాన్యతగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లను తీసుకోవాలి. మూడో ప్రాధాన్యత అంశంగా పూర్తిగా నిర్మాణాలు పూర్తయిన ఇతర స్కీమ్‌ల ఇళ్లను జియోటాగింగ్ చేయాలి. ఈ విధానంలో ఒక్కో బృందం రోజుకు 50 గృహాలకు తక్కువ లేకుండా నిర్వహించాలి. ఈ విధానంలో గృహం ఐడీ నెంబరు, గృహయజమాని పేరు, ఆ గృహనిర్మాణాన్ని కనీసం రెండుకు తగ్గకుండా ఫోటోలు ఈ విధానంలో అప్లోడ్ చేయాల్సి ఉంది. నెట్‌వర్క్‌లేని ప్రాంతాల్లో డేటాను తీసుకొని కార్యాలయానికి వచ్చిన అప్లోడ్ చేయాలి. ఇందుకు ఉపయోగించే సెల్‌లకు ప్రత్యేకంగా పవర్‌బ్యాంకు పేరిట ఒక ప్రత్యేక బ్యాటరీ రీచార్జర్ను అందిస్తున్నారు. దీని ద్వారా సెల్‌ఫోన్‌కు రెండు మూడు పర్యాయాలు చార్జింగ్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. ఇంతవరకు గృహనిర్మాణాల అంచనాలు వేయడం, బిల్లులు చేయడం వంటి పనుల్లో ఉన్న ఇంజినీర్లు ఒక్కసారిగా ఈ టాగింగ్ విధానం రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. పదేళ్ల నుంచి నిర్మాణాలపై ఈ విధానం నిర్వహించడం వలన కొన్ని గృహాల వివరాలు దొరికే పరిస్థితి కన్పించడం లేదు. సమాచారం తిరిగి అందుబాటులో లేకపోవడం, లబ్ధిదారుల వివరాలు అందుబాటులో ఉండక పోవడం వంటి సమస్యలు ఎదురవుతాయని సర్వే బృందాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జియోటాగింగ్‌పై ఒక్కరోజు శిక్షణ గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న జియోటాగింగ్ విధానంపై ఒక్కరోజు శిక్షణను బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ శిక్షణలో ప్రధానంగా జియోటాగింగ్ విధానం నిర్వహించడంపైన శిక్ష ణ ఇచ్చారు. ఈ శిక్షణలో ఫొటో తీసే విధానాన్ని, ఐడీ నెంబరు నమోదు అంశాలపై సెల్‌ఫోన్ ఆధారంగా శిక్షణ ఇచ్చారు. ఈ బృందాలకు సెల్‌ఫోన్, సిమ్‌కార్డు, పవర్‌బ్యాంకు ఛార్జర్ తదితర పనిముట్లను అందజేశారు. కార్యక్రమలో గృహనిర్మాణ సంస్థ రీజనల్ మేనేజర్ పి. శ్రీరాములు, ఎంజీఎస్ ప్రసాద్, జోనల్ మానిటరింగ్ ఆఫీసర్ బి. జయచందర్, జి. నారాయణ, ఈఈలు కూర్మారావు, గణపతి, డీఈలు అప్పారావు, నాగేశ్వరరావు, శ్రీనివాస్, రామకృష్ణ, సత్యనారాయణ, పాల్గొన్నారు.