ఇక ఇళ్ల రాజకీయం! | survey on homes strat the geo-tagging | Sakshi
Sakshi News home page

ఇక ఇళ్ల రాజకీయం!

Published Thu, Nov 13 2014 4:59 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

survey on homes strat the geo-tagging

* పదేళ్ల ఇళ్ల నిర్మాణాలపై సర్వే
* నేటి నుంచి జియో టాగింగ్ ప్రారంభం..
* జిల్లాలో 59 బృందాలతో సర్వే

శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో గృహనిర్మాణ సంస్థ ద్వారా వివిధ పథకాల కింద నిర్మించిన ఇళ్లపై  రాష్ట్ర ప్రభుత్వం సర్వే ప్రారంభించింది. 2014-15 సంవత్సరానికి కొత్తగా ఒక్క ఇల్లు మంజూరు చేయకపోయినా గతంలో నిర్మించిన ఇళ్లపై మాత్రం సర్వేలు నిర్వహిస్తోంది. దీనికి రాజకీయ కారణాలే కారణమనే విమర్శలు వస్తున్నాయి. పదేళ్లుగా టీడీపీయేతర ప్రభుత్వాలు రాష్ట్రం లో ఉండడంతో నాడు నిర్మించిన ఇళ్లపై ప్రస్తుతం సర్వేలు చేస్తున్నారు.  

ఈ ఏడాది కొత్తగా ఇళ్లు మంజూరు లేకుండా జాప్యం చేసేందుకు కూడా జియోటాగింగ్ విధానం పేరిట జాప్యం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విధానం వలన కొత్తగా ప్రభుత్వానికి గానీ, లబ్ధిదారులకుగానీ ఏ ప్రయోజనం లేకపోయినా సిబ్బందిని ఇబ్బంది పెట్టేందుకు, గత ప్రభుత్వం పొరపాట్లు చేసిందని ఆరోపించేందుకే  జియోటాగింగ్ సర్వేను చేపడుతోందని భావిస్తున్నారు. జియోటాగింగ్ విధా నం జిల్లాలో గురువారం నుంచి ప్రారంభం కానుంది.

ఇందుకుగానూ వర్క్ ఇన్‌స్పెక్టర్లు, ఏఈలతో కూడిన 59 బృందాలను సిద్ధం చేశారు. ఈ బృందాలు ఆయా మండలాల్లో వారికి ప్రభుత్వం అందజేసే సెల్‌ఫోన్‌తో ఫోటోగ్రఫీ, ఇతర వివరాలు అప్‌లోడ్ చేసి జియోటాగింగ్ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. ఈ కార్యక్రమం డిసెంబరు 31 వరకు జిల్లాలో జరుగుతుంది. ఒక మం డలంలో రెండు బృందాలు పర్యటించేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ బృందాలకు మైక్రోమాక్స్ సెల్‌ఫోన్, ఎయిర్‌టెల్ సిమ్‌కార్డు, ప్రత్యేక రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులో ఉంచారు.

వీరు ఆయా గ్రామాల్లో లబ్ధిదారుల జాబితాలను తీసుకొని జియోటాగింగ్ నిర్వహిస్తారు. ఈ సర్వేలకు 2004 నుంచి ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్ల వరకు అన్ని ఇళ్లను సర్వే చేయాలి. జిల్లా వ్యాప్తంగా ఇటువంటి గృహాలు సుమారుగా 4 లక్షల వరకు ఉంటాయని అధికారులు అంచనా వేశారు. దీనికి సంబంధించిన జాబితాలు ఆయా మండలాల వారీగా, స్కీమ్‌ల వారీగా సిద్ధం చేశారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లకు ప్రస్తుతం వాటి స్థాయిలతో కూడిన జాబితాలను తయారు చేశారు. వీటన్నింటినీ జీవో టాగింగ్ చేయాల్సి ఉంది. ఈ విధానంలో  ఇందిరా ఆవాసయోజన పథకంలో మంజూరైన వాటికి తొలి ప్రాధాన్యమివ్వాలి. రెండవ ప్రాధాన్యతగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లను తీసుకోవాలి.

మూడో ప్రాధాన్యత అంశంగా పూర్తిగా నిర్మాణాలు పూర్తయిన ఇతర స్కీమ్‌ల ఇళ్లను జియోటాగింగ్ చేయాలి. ఈ  విధానంలో ఒక్కో బృందం రోజుకు 50 గృహాలకు తక్కువ లేకుండా నిర్వహించాలి. ఈ విధానంలో గృహం ఐడీ నెంబరు, గృహయజమాని పేరు, ఆ గృహనిర్మాణాన్ని కనీసం రెండుకు తగ్గకుండా ఫోటోలు ఈ విధానంలో అప్‌లోడ్ చేయాల్సి ఉంది. నెట్‌వర్క్‌లేని ప్రాంతాల్లో డేటాను తీసుకొని కార్యాలయానికి వచ్చిన  అప్‌లోడ్ చేయాలి.

ఇందుకు ఉపయోగించే సెల్‌లకు ప్రత్యేకంగా పవర్‌బ్యాంకు పేరిట ఒక ప్రత్యేక బ్యాటరీ రీచార్జర్‌ను అందిస్తున్నారు. దీని ద్వారా సెల్‌ఫోన్‌కు రెండు మూడు పర్యాయాలు చార్జింగ్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. ఇంతవరకు గృహనిర్మాణాల అంచనాలు వేయడం, బిల్లులు చేయడం వంటి పనుల్లో ఉన్న ఇంజినీర్లు ఒక్కసారిగా ఈ టాగింగ్ విధానం రావడంతో ఇబ్బందులు పడుతున్నారు.

పదేళ్ల నుంచి నిర్మాణాలపై ఈ విధానం నిర్వహించడం వలన కొన్ని గృహాల వివరాలు దొరికే పరిస్థితి కన్పించడం లేదు.  సమాచారం తిరిగి అందుబాటులో లేకపోవడం, లబ్ధిదారుల వివరాలు అందుబాటులో ఉండక పోవడం వంటి సమస్యలు ఎదురవుతాయని సర్వే బృందాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
జియోటాగింగ్‌పై ఒక్కరోజు శిక్షణ
గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న జియోటాగింగ్ విధానంపై ఒక్కరోజు శిక్షణను బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ శిక్షణలో ప్రధానంగా జియోటాగింగ్ విధానం నిర్వహించడంపైన శిక్ష ణ ఇచ్చారు. ఈ శిక్షణలో ఫొటో తీసే విధానాన్ని, ఐడీ నెంబరు నమోదు  అంశాలపై సెల్‌ఫోన్ ఆధారంగా శిక్షణ  ఇచ్చారు.

ఈ బృందాలకు సెల్‌ఫోన్, సిమ్‌కార్డు, పవర్‌బ్యాంకు ఛార్జర్ తదితర పనిముట్లను అందజేశారు. కార్యక్రమలో గృహనిర్మాణ సంస్థ రీజనల్ మేనేజర్ పి. శ్రీరాములు, ఎంజీఎస్ ప్రసాద్, జోనల్ మానిటరింగ్ ఆఫీసర్ బి. జయచందర్, జి. నారాయణ, ఈఈలు కూర్మారావు, గణపతి, డీఈలు అప్పారావు, నాగేశ్వరరావు, శ్రీనివాస్, రామకృష్ణ, సత్యనారాయణ, పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement