geo-tagging
-
జియో ట్యాగింగ్ బాధ్యత పీడీలదే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల పురోగతి, గృహాల జియో ట్యాగింగ్, ఇతర వసతులకు సంబంధించిన పురోగతిపై జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ నిర్ణయించారు. ఇందులో భాగంగానే మొదట కృష్ణాజిల్లాలో గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. మిగిలిన 12 జిల్లాలకు చెందిన కలెక్టర్లు, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్లు, ఇతర అధికారులతో సమీక్షలు నిర్వహించే విషయమై ప్రణాళికను సిద్ధం చేశారు. రాష్ట్రంలో మొదటి దశలో పేదలకు 15.60 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఇప్పటికే 90 శాతానికి పైగా లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు కూడా పంపిణీ చేశారు. వీటి నిర్మాణాలు వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఇప్పటికే మంజూరు చేసిన ఇళ్లకు సంబంధించిన జియో ట్యాగింగ్‌ను వెంటనే పూర్తిచేయాల్సి ఉంది. ఈ బాధ్యత ప్రాజెక్టు డైరెక్టర్లు (పీడీ) తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కొత్తగా భారీస్థాయిలో ఏర్పాటవుతున్న వైఎస్సార్ జగనన్న కాలనీల్లో కల్పించాల్సిన వసతులపై కలెక్టర్లు పరిశీలించి వివరాలు పంపాలని జిల్లాస్థాయి అధికారులను అజయ్ జైన్ ఇప్పటికే కోరారు. జియో ట్యాగింగ్‌లో వెనుకబడ్డ జిల్లాల్లో ముందుగా ఈ సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు, ఇప్పటివరకు సాధించిన పురోగతి తదితర అంశాలపై క్షుణ్ణంగా చర్చించేందుకు పూర్తి వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని ఇప్పటికే జిల్లా అధికారులకు సమాచారం పంపారు. తక్కువ ధరకే నిర్మాణ సామగ్రి లబ్ధిదారులు సమ్మతిస్తే ఇంటి నిర్మాణానికి అవసరమైన నాణ్యతతో కూడిన నిర్మాణ సామగ్రిని మార్కెట్ ధర కంటే తక్కువ రేట్లకు పంపిణీ చేసే విషయమై ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని సమావేశంలో అజయ్ జైన్ సూచించారు. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ విడతల వారీగా ఇవ్వనున్న నిర్మాణ సామగ్రి సమాచారం, ఇతర వివరాలను లబ్ధిదారులకు ప్రత్యేకంగా ఇచ్చే పాసుపుస్తకంలో నమోదు చేస్తారు. ప్రతి గ్రామంలో సచివాలయ సిబ్బంది మొబైల్ నంబర్లు ఇందులో పొందుపరుస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులందరికీ ఉపాధి హామీ జాబ్ కార్డులు ఇస్తారు. గృహ నిర్మాణ దశల ఆధారంగా జాబ్ కార్డున్న ప్రతి లబ్ధిదారునికి 90 రోజుల పని దినములకు సమానమైన వేతనాన్ని చెల్లిస్తారు. -
విద్వేషకారులపై కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: దేవాలయాలపై సామాజిక, ప్రచార మాధ్యమాల్లో తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతం సవాంగ్ హెచ్చరించారు. బుధవారం డీజీపీ కార్యాలయంలో అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్, సిట్ చీఫ్ జీవీజీ అశోక్‌కుమార్, డీఐజీలు రాజశేఖర్‌బాబు, పాల్‌రాజులతో కలిసి సవాంగ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆలయాలు ఆపదలో ఉన్నాయంటూ దు్రష్పచారం జరుగుతోందన్నారు. ఎప్పుడో జరిగిన ఘటనలు ప్రస్తుతం జరిగినట్లుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ సమాజంలో ఉద్రిక్తతలు రేకెత్తించేందుకు ప్రయతి్నస్తున్నారని చెప్పారు. పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ కొందరు విమర్శించడం సరికాదని డీజీపీ సవాంగ్ పేర్కొన్నారు. కులం, మతం పేరుతో పోలీసులపై వ్యాఖ్యలు చేయడాన్ని తన 35 ఏళ్ల సర్వీసులో ఎప్పుడూ చూడలేదన్నారు. పోలీసులు కులమతాలకు అనుగుణంగా కాకుండా రాజ్యాంగానికి లోబడి పని చేస్తారని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో జరిగిన సంఘటనలను పరిశీలిస్తే ప్రస్తుతం తక్కువగా ఉన్నాయన్నారు. ఏపీలో ఆలయాలకు కల్పిస్తున్న భద్రతా ప్రమాణాలపై ఇతర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయని చెప్పారు. పటిష్ట భద్రత.. నిరంతర నిఘా గత ఏడాది సెప్టెంబరు 5వ తేదీ నుండి ఇప్పటి వరకు 58,871 దేవాలయాలను జియో ట్యాగింగ్‌తో అనుసంధానం చేసినట్లు డీజీపీ వెల్లడించారు. 13,089 దేవాలయాల్లో 43,824 సీసీ కెమెరాలతో నిరంతర నిఘాతో పటిష్ట భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారు. దేవాలయాలకు సంబంధించి 29 కేసులను ఛేదించి 80 మంది కరుడుగట్టిన అంతర్రాష్ట్ర నేరస్థులు, ముఠాలను అరెస్టు చేసినట్లు తెలిపారు. దేవాలయాలలో ప్రాపర్టీ అఫెన్స్‌కు సంబంధించి 180 కేసులను ఛేదించి 337 మంది నేరస్థులను అరెస్టు చేశామన్నారు. తరచూ ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. మత సామరస్యాన్ని కాపాడేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కమిటీలు నియమిస్తామని డీజీపీ చెప్పారు. గ్రామ స్థాయిలో ఇప్పటి వరకు 15,394 రక్షణ దళాలను నియమించామని, త్వరలో మరో 7,862 దళాలను ఏర్పాటు చేయనున్నుట్లు వివరించారు. సమాచారం ఇవ్వండి.. ఆలయాలు, ప్రార్థనా మందిరాల పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు కదలికలు కనిపిస్తే వెంటనే 9392903400 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని డీజీపీ కోరారు. -
చేనేతను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
► సబ్సిడీతో కూడిన రుణ సౌకర్యం కల్పిస్తాం: కేటీఆర్ ► బడ్జెట్లో చేనేతకు భారీ కేటాయింపులు చేశాం ► 14,300 చేనేత మగ్గాలకు జియోట్యాగింగ్ సాక్షి, హైదరాబాద్: చేనేత కార్మికులను కాపాడు కోవడమే ప్రభుత్వ చేనేత విధాన ప్రాథమిక లక్ష్యమని చేనేతశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. చేనేత రంగంలో లాభదా యకత లేకుంటే ఇతర రంగాలకు తరలి వెళ్లేందుకు కూడా తాము సహకారం అందిస్తామని అన్నారు. బుధవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో చేనేత, టెక్స్టైల్ శాఖాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ఇతర రంగాల్లోకి వెళ్లే కార్మికులకు ప్రత్యేక సబ్సిడీలతో కూడిన రుణాన్ని ఇవ్వాలని ఆలోచిస్తున్నామని, చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం తలపెట్టిన ప్రయోజనాలు నేరుగా వారికే అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈ బడ్జెట్లో చేనేత రంగానికి కేటాయిం పులు చేశామన్నారు. ఇందులో ఎలాంటి లీకేజీలు లేకుండా చూడాలని, ఆధార్, బయో మెట్రిక్ ఆధా రంగా నేరుగా వారి బ్యాంకుల్లో సబ్సిడీ చేరేలా పాలసీలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. చేనేత డైరెక్టరీ తయారు చేయాలి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు చేనేత స్థితిగతుల మీద క్షుణ్ణంగా అధ్యయనం చేసి, చేనేత డైరెక్టరీని తయారు చేయాలని సూచించారు. ఈ నివేదికలో రాష్ట్రంలో ఉన్న చేనేత మగ్గాలు, చేనేత కార్మికుల సంఖ్య, ఉత్పాదక సామర్థ్యం తదితర అంశాలతో కూడిన పూర్తి గణాంకాలు, అంచనాలతో కూడిన సమగ్రమైన సమాచారం ఉండాలన్నారు. ప్రసుత్తం రాష్ట్రంలో నిర్వహిస్తున్న చేనేత మగ్గాల సర్వేలో 17,000 చేనేత మగ్గాలున్నాయని.. ఇప్పటికే 14, 300 చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్ చేసినట్లు మంత్రి తెలిపారు. చేనేతలకు సబ్సిడీలు ఇస్తూనే వారి నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. తమ ఉత్ప త్తులను ప్రభుత్వానికే కాకుండా బయట మార్కెట్లో అమ్ముకునే అవకాశాన్ని సైతం కల్పిస్తామని, ప్రభుత్వమే మాస్టర్ వీవర్ పాత్రను పోషించాలని మంత్రి తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టెక్స్టైల్ డైరెక్టర్ శైలజారామయ్యర్తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
‘ఉపాధి’ పనులకూ జియో ట్యాగింగ్
► పల్లెల్లో కొనసాగుతున్న పనులు ► సాంకేతిక లోపాలతో సిబ్బందికి ఇబ్బంది గంభీరావుపేట : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో చేపట్టిన పనుల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం జియోట్యాగింగ్‌ను ప్రవేశపెట్టింది. 2006 నుంచి పనులు పూర్తయి లబ్ధిదారులకు బిల్లులు అందిన అంశాలనే ట్యాగ్ చేస్తున్నారు. ప్రగతిలో ఉన్న పనులను ట్యాగ్ చేయరు. ఇంకుడుగుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, కుంటలు, కాలువలు, పూడికతీత, అడ్డుకట్టలు తదితర పనుల్లో పూర్తయిన పనులను సిబ్బంది ట్యాగింగ్ చేస్తున్నారు. ట్యాగింగ్ చేయడం ఇలా.. ఎన్ ఆర్ఈజీఎస్ ద్వారా రూపొందించిన ప్రత్యేకమైన ‘భువన్ యాప్’ను ఓపెన్ చేసుకొని పూర్తయిన పనుల రెండు ఫోటోలు తీసుకోవాలి. వాటిని ఆన్ లైన్ లో పొందుపర్చాలి. జియోట్యాగింగ్ వల్ల ఎక్కడి పనులనైనా ఆన్ లైన్ లో చూసుకోవచ్చు. జిల్లాలో ట్యాగింగ్ వివరాలు జిల్లా వ్యాప్తంగా 32,453 పూర్తయిన పనులను జియోట్యాగింగ్‌కు టార్గెట్ చేశారు. ఇందులో ఇప్పటికీ 17,189 పనుల వివరాలను అధికారులు ట్యాగ్ చేశారు. సాంకేతిక లోపాలు జియోట్యాగింగ్ చేసే సమయంలో నెట్‌కనెక్ట్ కాకుండా క్షేత్రస్థాయిలో ఈజీఎస్ సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. పనులు జరిగిన గ్రామీణ ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఈసమస్య మరింత ఎక్కువవుతోంది. ఆన్ లైన్ లో వివరాలను పంపించడానికి కూడా కష్టంగా మారుతోంది. నెట్వర్క్ సమస్యలున్నాయి ఈజీఎస్ పనుల ట్యాగింగ్ విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నం. పల్లెల్లో నెట్వర్క్ లేక ట్యాగింగ్ చేయడంలో కాస్త జాప్యం జరుగుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలో వందశాతం ట్యాగింగ్ కోసం కృషి చేస్తున్నం. –సాయిక్రిష్ణ, టెక్నికల్ అసిస్టెంట్, గంభీరావుపేట రాష్ట్రంలో 8వ స్థానం ఈజీఎస్ జియోట్యాగింగ్ విషయంలో జిల్లా రాష్ట్రంలో 8వ స్థానంలో ఉంది. ఇప్పటికీ 53శాతం ట్యాగింగ్ పూర్తయ్యిం ది. పనులు వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించాం. సాంకేతిక లోపా లు తలెత్తడంతో రాత్రింబవళ్లు సిబ్బంది కృషి చేస్తున్నారు. –హన్మంతరావు,డీఆర్డీవో, రాజన్న సిరిసిల్ల జిల్లా -
జియో ట్యాగింగ్‌లో గీసుకొండ స్టేట్ ఫస్ట్
ద్వితీయ స్థానంలో సంగెం మండలం ఉద్యోగులను అభినందించిన కలెక్టర్ గీసుకొండ : ఉపాధి హామీ పథకంలో నాణ్యత, పారదర్శకతను చాటుతూ అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రతీ పనిని ‘భువన్’ యాప్ ద్వారా జియో ట్యాగింగ్ చేసే ప్రక్రియ చేపడుతున్న విషయం విదితమే. ఈ మేరకు వరంగల్ రూరల్ జిల్లాలోని గీసుకొండ మండలం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తం 107.55 శాతం పనులను జియో ట్యాగ్ చేసి ప్రథమ స్థానంలో నిలవగా సంగెం మండలం 102.15 శాతంతో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ మేరకు హన్మకొండలో శనివారం జరిగిన సమావేశంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్.. గీసుకొండ మండల అధికారులు, సిబ్బందిని అభినందించారని ఎంపీడీఓ వీరమల్ల సాయిచరణ్ తెలిపారు. ఉద్యోగుల కృషితోనే ఈ ఘనత సాధ్యమైందని ఎంపీడీఓ పేర్కొన్నారు. -
చెరువులకు జియో ట్యాగింగ్: హరీశ్
సాక్షి, హైదరాబాద్: చెరువులకు జియో ట్యాగింగ్ చేయాలని నీటి పారుదల శాఖ నిర్ణరుుంచింది. ఈనెల 29న ప్రారంభం కానున్న ఈ ప్రక్రియను డిసెంబర్ 2వ తేదీకల్లా పూర్తయ్యేలా చూడాలని అధికారులను నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. జియో ట్యాగింగ్‌పై మొబైల్ యాప్‌ను రూపొందించినట్టు ’కాడా’ కమిషనర్ డాక్టర్ మల్సూర్ శనివారం తెలిపారు. జియో ట్యాగింగ్ చేసే విధానంపై క్షేత్రస్థారుు ఇంజనీర్లకు, సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. జియో ట్యాగింగ్ పనుల పురోగతిని ఇరిగేషన్ సిబ్బంది ప్రతిరోజూ సంబంధిత చీఫ్ ఇంజనీరుకు తెలపాలని హరీశ్‌రావు ఆదేశించారు. జియో ట్యాగింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జియో ట్యాగ్ చేయడం వల్ల ప్రతి చెరువు ఏ జిల్లా, ఏ మండలం, ఏ గ్రామంలో ఉన్నదో, దాని కొలతలు, విస్తీర్ణం, ఫొటోలు, పేరు, ఇతర వివరాలతో సమగ్ర సమాచారం ఆన్లైన్లో ప్రభుత్వ నీటి పారుదల వెబ్సైట్లో నమోదవుతుంది. -
ఇక ఇళ్ల రాజకీయం!
* పదేళ్ల ఇళ్ల నిర్మాణాలపై సర్వే * నేటి నుంచి జియో టాగింగ్ ప్రారంభం.. * జిల్లాలో 59 బృందాలతో సర్వే శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో గృహనిర్మాణ సంస్థ ద్వారా వివిధ పథకాల కింద నిర్మించిన ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వం సర్వే ప్రారంభించింది. 2014-15 సంవత్సరానికి కొత్తగా ఒక్క ఇల్లు మంజూరు చేయకపోయినా గతంలో నిర్మించిన ఇళ్లపై మాత్రం సర్వేలు నిర్వహిస్తోంది. దీనికి రాజకీయ కారణాలే కారణమనే విమర్శలు వస్తున్నాయి. పదేళ్లుగా టీడీపీయేతర ప్రభుత్వాలు రాష్ట్రం లో ఉండడంతో నాడు నిర్మించిన ఇళ్లపై ప్రస్తుతం సర్వేలు చేస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా ఇళ్లు మంజూరు లేకుండా జాప్యం చేసేందుకు కూడా జియోటాగింగ్ విధానం పేరిట జాప్యం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విధానం వలన కొత్తగా ప్రభుత్వానికి గానీ, లబ్ధిదారులకుగానీ ఏ ప్రయోజనం లేకపోయినా సిబ్బందిని ఇబ్బంది పెట్టేందుకు, గత ప్రభుత్వం పొరపాట్లు చేసిందని ఆరోపించేందుకే జియోటాగింగ్ సర్వేను చేపడుతోందని భావిస్తున్నారు. జియోటాగింగ్ విధా నం జిల్లాలో గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకుగానూ వర్క్ ఇన్స్పెక్టర్లు, ఏఈలతో కూడిన 59 బృందాలను సిద్ధం చేశారు. ఈ బృందాలు ఆయా మండలాల్లో వారికి ప్రభుత్వం అందజేసే సెల్‌ఫోన్‌తో ఫోటోగ్రఫీ, ఇతర వివరాలు అప్లోడ్ చేసి జియోటాగింగ్ వెబ్సైట్లో పొందుపరుస్తారు. ఈ కార్యక్రమం డిసెంబరు 31 వరకు జిల్లాలో జరుగుతుంది. ఒక మం డలంలో రెండు బృందాలు పర్యటించేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ బృందాలకు మైక్రోమాక్స్ సెల్‌ఫోన్, ఎయిర్టెల్ సిమ్‌కార్డు, ప్రత్యేక రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులో ఉంచారు. వీరు ఆయా గ్రామాల్లో లబ్ధిదారుల జాబితాలను తీసుకొని జియోటాగింగ్ నిర్వహిస్తారు. ఈ సర్వేలకు 2004 నుంచి ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్ల వరకు అన్ని ఇళ్లను సర్వే చేయాలి. జిల్లా వ్యాప్తంగా ఇటువంటి గృహాలు సుమారుగా 4 లక్షల వరకు ఉంటాయని అధికారులు అంచనా వేశారు. దీనికి సంబంధించిన జాబితాలు ఆయా మండలాల వారీగా, స్కీమ్‌ల వారీగా సిద్ధం చేశారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లకు ప్రస్తుతం వాటి స్థాయిలతో కూడిన జాబితాలను తయారు చేశారు. వీటన్నింటినీ జీవో టాగింగ్ చేయాల్సి ఉంది. ఈ విధానంలో ఇందిరా ఆవాసయోజన పథకంలో మంజూరైన వాటికి తొలి ప్రాధాన్యమివ్వాలి. రెండవ ప్రాధాన్యతగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లను తీసుకోవాలి. మూడో ప్రాధాన్యత అంశంగా పూర్తిగా నిర్మాణాలు పూర్తయిన ఇతర స్కీమ్‌ల ఇళ్లను జియోటాగింగ్ చేయాలి. ఈ విధానంలో ఒక్కో బృందం రోజుకు 50 గృహాలకు తక్కువ లేకుండా నిర్వహించాలి. ఈ విధానంలో గృహం ఐడీ నెంబరు, గృహయజమాని పేరు, ఆ గృహనిర్మాణాన్ని కనీసం రెండుకు తగ్గకుండా ఫోటోలు ఈ విధానంలో అప్లోడ్ చేయాల్సి ఉంది. నెట్‌వర్క్‌లేని ప్రాంతాల్లో డేటాను తీసుకొని కార్యాలయానికి వచ్చిన అప్లోడ్ చేయాలి. ఇందుకు ఉపయోగించే సెల్‌లకు ప్రత్యేకంగా పవర్‌బ్యాంకు పేరిట ఒక ప్రత్యేక బ్యాటరీ రీచార్జర్ను అందిస్తున్నారు. దీని ద్వారా సెల్‌ఫోన్‌కు రెండు మూడు పర్యాయాలు చార్జింగ్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. ఇంతవరకు గృహనిర్మాణాల అంచనాలు వేయడం, బిల్లులు చేయడం వంటి పనుల్లో ఉన్న ఇంజినీర్లు ఒక్కసారిగా ఈ టాగింగ్ విధానం రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. పదేళ్ల నుంచి నిర్మాణాలపై ఈ విధానం నిర్వహించడం వలన కొన్ని గృహాల వివరాలు దొరికే పరిస్థితి కన్పించడం లేదు. సమాచారం తిరిగి అందుబాటులో లేకపోవడం, లబ్ధిదారుల వివరాలు అందుబాటులో ఉండక పోవడం వంటి సమస్యలు ఎదురవుతాయని సర్వే బృందాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జియోటాగింగ్‌పై ఒక్కరోజు శిక్షణ గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న జియోటాగింగ్ విధానంపై ఒక్కరోజు శిక్షణను బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ శిక్షణలో ప్రధానంగా జియోటాగింగ్ విధానం నిర్వహించడంపైన శిక్ష ణ ఇచ్చారు. ఈ శిక్షణలో ఫొటో తీసే విధానాన్ని, ఐడీ నెంబరు నమోదు అంశాలపై సెల్‌ఫోన్ ఆధారంగా శిక్షణ ఇచ్చారు. ఈ బృందాలకు సెల్‌ఫోన్, సిమ్‌కార్డు, పవర్‌బ్యాంకు ఛార్జర్ తదితర పనిముట్లను అందజేశారు. కార్యక్రమలో గృహనిర్మాణ సంస్థ రీజనల్ మేనేజర్ పి. శ్రీరాములు, ఎంజీఎస్ ప్రసాద్, జోనల్ మానిటరింగ్ ఆఫీసర్ బి. జయచందర్, జి. నారాయణ, ఈఈలు కూర్మారావు, గణపతి, డీఈలు అప్పారావు, నాగేశ్వరరావు, శ్రీనివాస్, రామకృష్ణ, సత్యనారాయణ, పాల్గొన్నారు.