టాటా మోటార్స్‌కు జేఎల్‌ఆర్‌ దన్ను | Tata Motors Q2 profit trebles to Rs2,500 crore on JLR sales | Sakshi
Sakshi News home page

టాటా మోటార్స్‌కు జేఎల్‌ఆర్‌ దన్ను

Published Fri, Nov 10 2017 12:24 AM | Last Updated on Fri, Nov 10 2017 8:00 AM

Tata Motors Q2 profit trebles to Rs2,500 crore on JLR sales - Sakshi

ముంబై: వాణిజ్య, ప్యాసింజర్‌ వాహన దిగ్గజం టాటా మోటార్స్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో మూడు రెట్లు వృద్ధి చెందింది. ఈ కంపెనీకి చెందిన లగ్జరీ కార్‌ బ్రాండ్‌.. జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) పనితీరు అంచనాలను మించడంతో ఈ స్థాయి నికర లాభాన్ని కంపెనీ సాధించింది. గత క్యూ2లో రూ.848 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ2లో మూడు రెట్లు పెరిగి రూ.2,502 కోట్లకు చేరిందని టాటా మోటార్స్‌ తెలిపింది.

ఆదాయం రూ.63,577 కోట్ల నుంచి 10% వృద్ధితో రూ.70,156 కోట్లకు ఎగసిందని టాటా మోటార్స్‌ ఎండీ, సీఈవో గుంటర్‌ బుశ్చెక్‌ చెప్పారు. నిర్వహణ లాభం 43% వృద్ధితో రూ.9,010 కోట్లకు పెరిగిందని, మార్జిన్‌ 2.8% పెరిగి 12.7 శాతానికి ఎగసిందని పేర్కొన్నారు. కాగా, టాటా మోటార్స్‌ క్యూ2 ఫలితాలు అంచనాలు మించాయి. రూ. 69,985 కోట్ల ఆదాయంపై రూ.1,391 కోట్ల నికర లాభం వస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు.

కొత్త మోడళ్లకు మంచి స్పందన..
ఈ క్యూ1 సమస్యాత్మకంగా ఉందని, కానీ క్యూ2లో మంచి ఫలితాలు సాధించామని  గుంటర్‌ బుశ్చెక్‌ చెప్పారు. ఏ నెలకు ఆ నెల అమ్మకాలు, మార్కెట్‌ వాటా పెరిగాయని, తామందించిన కొత్త మోడళ్లకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించిందని వివరించారు. మొత్తం ఆదాయంలో 78%గా ఉన్న జేఎల్‌ఆర్‌ ఆదాయం ఈ సెప్టెంబర్‌ క్వార్టర్లో 11.5% వృద్ధితో 630 కోట్ల పౌండ్లకు పెరిగిందని తెలిపారు. ఇక స్థూల లాభం 38 శాతం వృద్ధితో 38.5 కోట్ల పౌండ్లకు ఎగసిందని,  నిర్వహణ లాభ మార్జిన్‌ 11.8%గా నమోదైందని వివరించారు.  

తగ్గిన దేశీయ నష్టాలు
ఇక దేశీయ వ్యాపార పరంగా చూస్తే, టాటా మోటార్స్‌ నష్టాలు తగ్గాయి. గత క్యూ2లో రూ.609 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ2లో రూ.266 కోట్లకు తగ్గాయి. ఆదాయం 30 శాతం వృద్ధి చెంది రూ.13,400 కోట్లకు చేరగా, నిర్వహణ లాభం రూ.386 కోట్ల నుంచి రెట్టింపై రూ.787 కోట్లకు పెరిగింది. ఈ క్యూ2లో మొత్తం వాహన విక్రయాలు 14 శాతం వృద్ధితో 1,52,979కు పెరిగాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement