టాటా విమాన సర్వీసులిక విస్తారం | Tata Sons-Singapore Airlines 'Vistara' set for October launch | Sakshi
Sakshi News home page

టాటా విమాన సర్వీసులిక విస్తారం

Published Tue, Aug 12 2014 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 11:43 AM

టాటా విమాన సర్వీసులిక విస్తారం

టాటా విమాన సర్వీసులిక విస్తారం

న్యూఢిల్లీ: టాటా సన్స్-సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ల జాయింట్ వెంచర్‌కు బ్రాండ్ నేమ్ విస్తారను, లోగోను సోమవారం ఆవిష్కరించారు. ఆకాశంలాగా పరిమితులు లేని విస్తరణను సూచించే విస్తారను బ్రాండ్‌నేమ్‌గా ఎంపిక చేశామని విస్తార సీఈవో టీక్ యోహ్ చెప్పారు.  ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశాలున్నాయి. విమాన సర్వీసులకు సంబంధించిన ఆమోదం (ఏయిర్ ఆపరేటర్ పర్మిట్-ఏఓపీ) ను పొందే ప్రక్రియ తుది దశలో ఉందని  టీక్ యోహ్ చెప్పారు.

తమ సంస్థ తొలి విమానం వచ్చే నెలలో వస్తుందని, ఈ ఏడాది చివరికల్లా మొత్తం ఐదు విమానాలతో సర్వీసులను నిర్వహిస్తామని వివరించారు. ఎయిర్‌బస్ ఏ-320 విమానాలను ఇరవై వరకూ లీజుకు తీసుకోవాలని ఇప్పటికే ఈ కంపెనీ నిర్ణయించింది. వీటిల్లో అధునాతన తాజా టెక్నాలజీతో తయారైన ఏ-320 విమానాలు ఏడు వరకూ ఉన్నాయి.

 11 నగరాలకు సర్వీసులు: కాగా విస్తార బ్రాండ్‌నేమ్, లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో టాటా-ఎస్‌ఐఏ ఎయిర్‌లైన్స్ చైర్మన్ ప్రసాద్ మీనన్, బోర్డ్ డెరైక్టర్లు ముకుంద్ రాజన్, స్వీ వాహ్ మ్యాక్‌లు కూడా పాల్గొన్నారు. ఏయే నగరాలకు విమాన సర్వీసులను నడపాలనే విషయమై దాదాపు తుది నిర్ణయానికి వచ్చామని టీక్ యోహ్ పేర్కొన్నారు. అయితే పూర్తి వివరాలను ఆయన వెల్లడించలేదు.

 ఈ సంస్థ ప్రారంభంలో ఐదు నగరాలకు విమాన సర్వీసులందిస్తుందని, ఆ తర్వాత 11 నగరాలకు వాటిని విస్తరిస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గోవా, అహ్మదాబాద్, జమ్మూ, శ్రీనగర్, పాట్నా, చండీఘర్ నగరాలకు ఈ సంస్థ విమాన సర్వీసులను అందించనున్నదని సమాచారం. భారత వైమానిక మార్కెట్లో విస్తార చెప్పుకోదగ్గ సంస్థ అవుతుందని ప్రసాద్ మీనన్ విశ్వాసం వ్యక్తం చేశారు. విస్తరంగా-ప్రయాణికుల సహజ ఎంపిక అవుతుం దని పేర్కొన్నారు. టాటా గ్రూప్ పెట్టుబడులు పెడుతున్న మరో విమానయాన సంస్థ ఎయిర్ ఏషి యా తమకు పోటీ కాదని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ అపారమైన అవకాశాలున్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement