టాటా స్టీల్ యూకేలో 25% వాటా తీసుకుంటాం
బ్రిటన్ ప్రభుత్వం వెల్లడి
లండన్: సంక్షోభంలో చిక్కుకున్న టాటా స్టీల్ యూకేను గట్టెక్కించే ప్రయత్నాల్లో భాగంగా అవసరమైతే 25 శాతం మేర వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని బ్రిటన్ వాణిజ్య మంత్రి సాజిద్ జావిద్ తెలిపారు. కార్యకలాపాల కొనుగోలుకు ముందుకొచ్చే సంస్థలకు వందల మిలియన్ల కొద్దీ పౌండ్ల మేర రుణపరమైన ఉపశమనం కలిగించేందుకు కూడా సుముఖంగా ఉన్నట్లు వివరించారు. ఇందుకు సంబంధించిన ఆర్థిక ప్యాకేజీపై బ్రిటన్, వెల్ష్ ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. విశ్వసనీయమైన కొనుగోలుదారును అన్వేషించే ప్రక్రియలో టాటా స్టీల్ యూకే సంస్థతో కలసి బ్రిటన్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి వివరించారు. అయితే, ఉక్కు రంగాన్ని జాతీయం చేసే ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్యలను భావించరాదని ప్రధాని డేవిడ్ కామెరాన్ ప్రతినిధి ఒకరు తెలిపారు.