కాలిఫోర్నియా: దేశీయ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు అమెరికా కోర్టులో ఊరట లభించింది. జాతి వివక్ష ఆరోపణల కేసులో అమెరికా కోర్టులో భారీ విజయాన్ని సాధించింది. తద్వారా భారతీయ ఐటి పరిశ్రమకు తీపి కబురందించింది. జాతీయతతో సంబంధం లేకుండా తామ పెట్టుబడులను కొనసాగిస్తామన్ టీసీఎస్ వాదనను సమర్ధించిన కోర్టు టీసీఎస్‌కు అనుగుణంగా తీర్పు చెప్పింది.
అమెరికాలో టీసీఎస్ శాఖ దక్షిణాసియాయేతర ఉద్యోగుల్ని జాతి వివక్షతో తొలగించిందని మాజీ ఉద్యోగులు కాలిఫోర్నియా కోర్టులో దావా వేశారు. అయితే టీసీఎస్‌పై వచ్చిన ఈ ఆరోపణలను కాలిఫోర్నియా జ్యూరీ ఏకగ్రీవంగా తోసిపుచ్చింది. జ్యూరీలోని తొమ్మిదిమంది సభ్యులూ ఏకగ్రీవంగా టీసీఎస్‌కు సానుకూలంగా తీర్పునివ్వడం విశేషం. విచారణ అనంతరం ఉద్దేశపూర్వకంగా కంపెనీ జాతివివక్ష చూపలేదని తీర్పునిచ్చింది. కోర్టు టీసీఎస్‌పై ఆరోపణలను తోసిపుచ్చడం భారత ఐటీ ఔట్‌సోర్సింగ్ రంగానికి లభించిన గొప్ప విజయంగా నిపుణులు అభివర్ణించారు. ఇది ఒక‍్క టీసీఎస్‌కే కాదు మొత్తం ఐటీ సేవల రంగానికి సంబంధించి చాలా ముఖ్యమైన తీర్పు అని గ్రేహౌండ్ రీసెర్చ్ సీఈవో సచిత్ గోగియా వ్యాఖ్యానించారు.
కంపెనీ తమకు తక్కువ అవకాశాలు ఇచ్చిందని, జాతీయత, మతం కారణంగా తమను ఉద్యోగాలనుంచి తొలగించిందని ఆరోపిస్తూ టీసీఎస్ మాజీ ఉద్యోగులు క్రిస్టోఫర్ స్లైట్, సయీద్ అమర్ మసౌది, నోబెల్ మాండిలి ఈ దావా వేశారు. ఈ కేసుపై నవంబరు 5న విచారణ చేపట్టగా ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు తీర్పు వెలువరించింది.
కాగా ఈ కేసులో ఫిర్యాదుదారుల ఆరోపణలు నిరాధారమైనవని తాము విశ్వసిస్తున్నామనీ, ఈ విషయాన్ని జ్యూరీ కూడా అంగీకరించి నందుకు చాలా సంతోషిస్తున్నామని టిసిఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. మెరిట్ ఆధారంగానే తాము నియామకాలు చేబడుతున్నామని స్పష్టం చేసింది. చట్ట విరుద్ధంగా తాము ఏమీ చేయలేదని, పనితీరు ప్రామాణికంగానే ఉద్యోగులను తొలగించామని తెలిపింది. ఉద్యోగుల నియామకంలో జాతీయత, నేపథ్యంతో సంబంధం లేదని, వారి సామర్థ్యాన్నిబట్టే నియమించుకుంటామని టీసీఎస్ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment