వాట్సప్పై టెలికం కంపెనీల గుర్రు!!
వాట్సప్, వైబర్, స్కైప్, వుయ్ చాట్.. ఇలా ఏదైతేనేం, లెక్కలేనన్ని యాప్లు ఇప్పుడు వచ్చి పడ్డాయి. దాంతో టెలికం సర్వీస్ ప్రొవైడర్లకు పొట్ట కొట్టినట్లయింది. వీటిని విరివిగా ఉపయోగిస్తున్న వినియోగదారులు.. విడిగా ఎస్ఎంఎస్ పంపడం మానేశారు, కాల్స్ కూడా చాలావరకు తగ్గిపోయాయి. దాంతో ఇప్పుడు ఇటు ట్రాయ్తో పాటు అటు సర్వీస్ ప్రొవైడర్లు కూడా కొత్త ఆలోచనలు చేస్తున్నారు. తాము నష్టపోతున్న ఆదాయాన్ని ఎలాగైనా తిరిగి ఇప్పించాలని కంపెనీలు ట్రాయ్ మీద ఒత్తిడి తెస్తున్నాయట.
అయితే, వాస్తవానికి మెసెంజర్ యాప్స్ వల్ల ఎస్ఎంఎస్లు పూర్తిగా ఆగిపోలేదు. ఇంతకుముందు ఒక్క ఎస్ఎంఎస్ పంపేవాళ్లు ఇప్పుడు వాట్సప్ లాంటివాటి ద్వారా ఎక్కువ సేపు చాటింగ్ చేసుకుంటున్నారు. అలాంటప్పుడు కంపెనీలు అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అయినా, టెలికం కంపెనీలు ఒత్తిడి చేయడం, దానికి ట్రాయ్ కూడా తందానా అనడం వల్ల వినియోగదారులపై లేనిపోని భారం పడే ప్రమాదం ఉంది. అంతేకాదు, విస్తృతంగా వాడకంలో ఉన్న వాట్సప్ లాంటి యాప్లను నియంత్రించాలని అనుకోవడం మీద కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
వాస్తవానికి ఎప్పటికప్పుడు మనిషి కొత్త టెక్నాలజీకి అలవాటు పడాలనుకుంటాడే తప్ప ఎంతసేపూ పాత చింతకాయ పచ్చడిలాగే ఉండిపోవాలని అనుకోడు. ఒకప్పుడు ఫోన్లంటే కేవలం మాట్లాడుకోడానికి, ఎస్ఎంఎస్లకే ఉపయోగపడేవి. ఇప్పుడు ఫోన్లు కాస్తా మినీ కంప్యూటర్లు అయిపోయాయి. ఇలాంటి టెక్ యుగంలో కూడా సెల్యులార్ ఆపరేటర్లు వినియోగదారులను తమ గుప్పెట్లో పెట్టుకోవాలని అనుకోవడం మూర్ఖత్వమేనని పలువురు స్మార్ట్ ఫోన్ వాడకందారులు అంటున్నారు.