పన్నులపై ఇన్వెస్టర్లకు సానుకూల సంకేతం | Telecom major Vodafone says stable tax regime important | Sakshi
Sakshi News home page

పన్నులపై ఇన్వెస్టర్లకు సానుకూల సంకేతం

Published Thu, Jan 29 2015 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 8:25 PM

పన్నులపై ఇన్వెస్టర్లకు సానుకూల సంకేతం

పన్నులపై ఇన్వెస్టర్లకు సానుకూల సంకేతం

వొడాఫోన్ కేసులో బాంబే హైకోర్టు ఉత్తర్వుపై అప్పీల్‌కు కేంద్రం నో...
న్యూఢిల్లీ: దేశ పన్నుల వ్యవస్థలో సమస్యలకు సంబంధించి పెట్టుబడిదారుల భయాందోళనలు పోగొట్టడంసహా, ఫలవంతంకాని లిటిగేషన్లను సాగదీయడం జరగదని కేంద్రం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. వొడాఫోన్ కేసులో బాంబే హైకోర్టు ఉత్తర్వుపై అప్పీల్‌కు వెళ్లరాదని బుధవారం నిర్ణయించింది.  

ఒక ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ కేసులో రూ.3,200 కోట్లు చెల్లించాలని గతంలో ఆదాయపు పన్ను శాఖ వొడాఫోన్‌కు డిమాండ్ నోటీసు జారీచేసింది. దీనిపై వొడాఫోన్ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. కేసులో హైకోర్టు 2014 అక్టోబర్ 10వ తేదీన వొడాఫోన్‌కు అనుకూలంగా రూలింగ్ ఇచ్చింది. దీనిపై  అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు వెళ్లరాదని బుధవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్  సమావేశం అనంతరం టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఈ విషయాన్ని విలేకరులకు తెలిపారు. ఈ తరహా మిగిలిన కేసులపైనా కేంద్ర క్యాబినెట్ నిర్ణయ ప్రభావం పడుతుందని మంత్రి పేర్కొన్నారు.

ఆయా కేసులను అధ్యయనం చేసిన తరువాత తగిన నిర్ణయం తీసుకుంటామని  తెలిపారు.  ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్, అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ తదితరులతో ఆర్థికమంత్రి వొడాఫోన్ కేసు విషయాన్ని క్షుణ్ణంగా చర్చించారని, హెకోర్టు రూలింగ్ సమంజసంగానే ఉందని ఈ సందర్భంగా భావించడం జరిగిందని  వెల్లడించారు.      కేసు ఇదీ...
 
ఇది 2010కి సంబంధించిన లావాదేవీ వ్యవహారం. బ్రిటన్‌లోని మాతృ కంపెనీ అయిన వొడాఫోన్‌కు- ఇక్కడి సబ్సిడరీ అయిన వొడాఫోన్ ఇండియా సర్వీసెస్ షేర్లను బదలాయిస్తున్నప్పుడు, వాటికి తగిన ధరను లెక్కించలేదని (అండర్ వ్యాల్యూ) ఐటీ శాఖ అప్పట్లో ఆరోపించింది. అందువల్ల అదనపు ఆదాయపు పన్ను చెల్లించాలని డిమాండ్ నోటీసు పంపింది. అయితే భారత  చట్టాల ప్రకారం, విదేశాల్లోని మాతృసంస్థకు తన షేర్ల బదిలీ లావాదేవీ పన్ను చెల్లింపుల పరిధిలోకి రాదని వొడాఫోన్ వాదించింది. ఈ వాదనతో బాంబే హైకోర్టు ఏకీభవించింది.
 
పరిశ్రమ హర్షం...
ప్రభుత్వ నిర్ణయాన్ని పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. దీని వల్ల విదేశీ ఇన్వెస్టర్లకు భారత్‌లో పన్నుల విధానాలపై సానుకూల అభిప్రాయం ఏర్పడగలదని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ సెక్రటరీ జనరల్ దీదార్ సింగ్ చెప్పారు. ఆర్థిక వ్యవస్థకు ఇదొక శుభ పరిమాణమన్నారు.
 
హెచ్‌డీఎఫ్‌సీ ప్రతిపాదనకు ఓకే
కాగా విదేశీ ఇన్వెస్టర్ల నుంచి రూ. 10,000 కోట్లు సమీకరించాలన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కార్యదర్శి (సీసీఈఏ) ఆమోదముద్ర వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement