ఎయిర్‌టెల్-ఎయిర్‌సెల్ స్పెక్ట్రమ్ ఒప్పందానికి ఆమోదం!
డీల్ విలువ రూ. 3,500 కోట్లు
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్, ఎయిర్‌సెల్‌ల రూ.3,500 కోట్ల 4జీ స్పెక్ట్రమ్ ట్రేడింగ్ ఒప్పందానికి టెలికం శాఖ ఆమోదం లభించిందని సమాచారం. అయితే ఈ విషయమై వ్యాఖ్యానించడానికి భారతీ ఎయిర్‌టెల్ నిరాకరించింది. ఎనిమిది టెలికం సర్కిళ్ల (ఆంధ్రప్రదేశ్, తమిళనాడు(చెన్నైతో కలుపుకొని),బిహార్, జమ్ము అండ్ కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఈశాన్య ప్రాంతం, ఒడిశా) ఎయిర్‌సెల్‌కు చెందిన 4జీ స్పెక్ట్రమ్‌ను ఉపయోగించుకునే హక్కులను రూ.3,500 కోట్లకు కొనుగోలు చేయడానికి భారత్ ఎయిర్‌టెల్ ఇంతకుముందు ఒప్పందం కుదుర్చుకుంది.
ఒక టెలికం సర్కిల్‌కు కేటాయించిన మొత్తం స్పెక్ట్రమ్‌లో ఏ కంపెనీకి 25 శాతానికి మించి స్పెక్ట్రమ్ ఉండకూడదు. ఒడిశా సర్కిల్‌లో అప్పటికే ఎయిర్‌టెల్‌కు కొంత స్పెక్ట్రమ్ ఉంది. ఒడిశా సర్కిల్‌లోని ఎయిర్‌సెల్ స్పెక్ట్రమ్ కొనుగోలు కారణంగా ఈ పరిమితిని మించిన స్పెక్ట్రమ్ భారతీ ఎయిర్‌టెల్‌కు ఉంటుంది.
అదనంగా ఉన్న 1.2 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను ఎయిర్‌టెల్ ప్రభుత్వానికి అప్పగించిందని, దీంతో ఈ ఒప్పందం సాకారమైందని సమాచారం. కాగా ఎయిర్‌సెల్ స్పెక్ట్రమ్‌ను తక్షణం స్తంభింపజేయాలని ప్రశాంత్ భూషణ్ అనే ఉద్యమ న్యాయవాది ఈ నెల 8న సీబీఐ, ఈడీలకు ఒక లేఖ రాశారు. ఆర్‌కామ్, ఎయిర్‌టెల్‌లతో ఎయిర్‌సెల్ కుదుర్చుకున్న ఒప్పందాలు సాకారమైతే, ఎయిర్‌సెల్ మాతృ కంపెనీ మ్యాక్సిస్ పారిపోతుందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.