దలాల్ స్ట్రీట్ లో తెలుగు ' షేర్' ఖాన్లు | Telugu 'Sher Khans' in Dalal Street | Sakshi
Sakshi News home page

దలాల్ స్ట్రీట్ లో తెలుగు ' షేర్' ఖాన్లు

Published Sun, Apr 23 2017 11:36 PM | Last Updated on Tue, Sep 5 2017 9:31 AM

దలాల్ స్ట్రీట్ లో తెలుగు ' షేర్' ఖాన్లు

దలాల్ స్ట్రీట్ లో తెలుగు ' షేర్' ఖాన్లు

ఏడాదిలో రెట్టింపుపైగా పెరిగిన షేర్లు
►  208 శాతం పెరిగిన రెయిన్‌ ఇండస్ట్రీస్‌
►  నిఫ్టీ, సెన్సెక్స్‌ల కంటే మంచి పనితీరు
►  బలమైన షేర్లలోనే ఇన్వెస్ట్‌ చేయాలంటున్న నిపుణులు  


అమరావతి, సాక్షి బిజినెస్‌ ప్రతినిధి : ఇండెక్స్‌లు నూతన గరిష్ట స్థాయిలను నమోదు చేస్తూ రికార్డులు సృష్టిస్తుంటే తెలుగు రాష్ట్రాలకు చెందిన కొన్ని కంపెనీల షేర్లు కూడా ఇన్వెస్టర్లకు లాభాలు కురిపిస్తున్నాయి. గడిచిన ఏడాది కాలంలో నిఫ్టీ–50 ఇండెక్స్‌ 15 శాతం లాభాలివ్వగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు షేర్లు రెట్టింపునకు పైగా  పెరిగాయి. గడిచిన ఏడాది కాలంలో నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 33 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌లు 40 శాతం మేర వృద్ధి చెందాయి. కానీ ఇదే సమయంలో  మిడ్‌ అండ్‌ స్మాల్‌ క్యాప్‌ పరిధిలోకి వచ్చే 10కి పైగా తెలుగు కంపెనీల షేర్లు ఇండెక్స్‌ల కంటే రెట్టింపుపైగా లాభాలను అందించాయి. సిమెంట్‌ తయారీ సంస్థ రెయిన్‌ ఇండస్ట్రీ ఏడాది కాలంలో 208 శాతంపైగా పెరిగి ఇన్వెస్టర్లకు భారీగా లాభాలను అందించింది.

సిమెంట్‌ రంగానికి చెందిన రెయిన్‌ ఇండస్ట్రీస్‌ షేరు ధర గతేడాది ఏప్రిల్‌లో రూ.30 వద్ద ఉంటే ఇప్పుడిది రూ.104 వరకు పెరిగింది. ఇదే సమయంలో విశాక ఇండస్ట్రీస్‌ 165%, ఆంధ్రా షుగర్స్‌ 141%, హెరిటేజ్‌ ఫుడ్స్‌ 115%, నాట్కో ఫార్మా 110%, తాజ్‌ జీవీకే 100% పెరిగి ఇన్వెస్టర్ల సంపదను రెట్టింపు చేశాయి. అదే విధంగా అవంతి ఫీడ్స్‌ 94%, ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ 89%, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ 83%, నవభారత్‌ వెంచర్స్‌ 77% షేర్లు  స్మాల్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ల కంటే రెట్టింపు లాభాలను అందించాయి.

మరింత బుల్‌ రన్‌..
ప్రస్తుత దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సెంటిమెంట్‌ చాలా బాగుందని, మరింత పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. విదేశీ సంస్థాగత మదుపుదారులు దేశీయ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేయడానికి ఆసక్తి చూపిస్తుండటంతో పాటు, కేంద్ర ప్రభుత్వ సంస్కరణలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను మరింత పటిష్టం చేస్తున్నాయని కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ హెడ్‌ తూనుగుంట్ల జగన్నాథం తెలిపారు. మధ్యలో వచ్చే చిన్నస్థాయి సర్దుబాట్లను ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉపయోగించుకోవచ్చని సూచించారు. ప్రస్తుతం నిఫ్టీ ఇండెక్స్‌ విలువ 23 పీఈ వద్ద ట్రేడ్‌ అవుతున్నా అంతగా ఆందోళన చెందనవసరం లేదన్నారు.

2008లో 29 పీఈ, 2001 ర్యాలీలో 31 పీఈ వరకు పెరిగిన సంగతిని గుర్తు చేశారు. 1992, 1994లో జరిగిన ర్యాలీలో ఏకంగా 50 పీఈ వరకు సూచీలు పెరిగాయన్నారు. ‘‘సాధారణంగా మన సూచీలు 18 పీఈ వద్ద ట్రేడ్‌ అవుతుంటాయి. దాంతో పోలిస్తే కొద్దిగా అధి క ధర వద్ద ట్రేడ్‌ అవుతున్నా.. అంతర్జాతీయంగా బిజినెస్‌ సెంటిమెంట్‌ మెరుగవుతుండటంతో అంతగా ఆందోళన చెందనవసరం లేదు. అయితే మార్కెట్‌తో పాటు పెరుగుతున్న షేర్లలోనే ఇన్వెస్ట్‌ చేయాలి. అప్పులు భారీగా ఉన్న చిన్న షేర్లలో ఇన్వెస్ట్‌ చేసి చేతులు కాల్చుకోవద్దు’’ అని ఆయన సూచించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement