
తెలుగు పర్యాటకులపై ఆస్ట్రేలియా దృష్టి
ఆస్ట్రేలియా టూరిజం ఇండియా మేనేజర్ నిషాంత్ కాషికర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారతీయ పర్యాటకులపై ముఖ్యంగా తెలుగు రాష్ట్ర పర్యాటకులపై ఆస్ట్రేలియా ప్రత్యేకంగా దృష్టిసారించింది. భారతీయులు అమితంగా ఇష్టపడుతున్న పర్యాటక దేశాల్లో ఆష్ట్రేలియా మూడో స్థానంలో ఉందని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకుల సంఖ్య ఏటా పెరుగుతోందని ఆస్ట్రేలియా టూరిజం కంట్రీ మేనేజర్ నిషాంత్ కాషికర్ చెప్పారు.
అంతకుముందు ఏడాదితో పోలిస్తే గతేడాది ఇండియా నుంచి వచ్చిన పర్యాటకుల సంఖ్యలో 18 శాతం వృద్ధి నమోదైందని... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పర్యాటకుల సంఖ్యలో మాత్రం ఈ వృద్ధి 21 శాతంగా ఉందని తెలియజేశారు. గతేడాది ఇండియా నుంచి 2,30,000 మంది ఆస్ట్రేలియా వెళితే అందులో 15,285 మంది ఈ రెండు రాష్ట్రాల నుంచి ఉన్నారు. భారతీయ పర్యాటకుల ద్వారా ఆస్ట్రేలియా ప్రభుత్వానికి రూ.5,000 కోట్ల ఆదాయం రాగా, అందులో రెండు రాష్ట్రాల ప్రజలు నుంచి రూ.435 కోట్ల ఆదాయం వచ్చింది. రోడ్‌షోలో భాగంగా హైదరాబాద్‌లో ‘సాక్షి’తో మాట్లాడుతూ వరల్డ్ కప్ క్రికెట్‌తో పాటు ఇండియన్ కరెన్సీతో పోలిస్తే ఆస్ట్రేలియా కరెన్సీ 15 శాతం తగ్గడం పర్యాటకులు సంఖ్య పెరగడానికి ప్రధాన కారణంగా చెప్పారు. 2020 నాటికి భారత దేశం నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్యను మూడు లక్షలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.