ఇక మొబైల్ వాలెట్ల హవా
2020 నాటికి మొబైల్ వాలెట్ మార్కెట్ @ 6.6 బిలియన్ డాలర్లు
స్మార్ట్‌ఫోన్లతో పేమెంట్ల విధానంలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. కొత్త తరహా పేమెంట్ వాలెట్లు అందుబాటులోకి వచ్చాయి. దేశంలో వాటి వాడకం కూడా మెల్లగా పెరుగుతూ వస్తోంది. ప్రతి లావాదేవీకి నగదును వెంట తీసుకెళ్లే బదులు ఈ వాలెట్లు ఉపయోగిద్దాంలే... అనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. వివిధ అధ్యయనాల్లో వెల్లడైన అంశాలే దీనికి నిదర్శనం. ఏసీఐ వరల్డ్‌వైడ్ సంస్థ ఇటీవల ఆసియా పసిఫిక్ ప్రాంత దేశాల్లో డిజిటల్ పేమెంట్ విధానం వినియోగంపై విడుదల చేసిన నివేదిక ప్రకారం స్మార్ట్‌ఫోన్ వాలెట్లను ఉపయోగిస్తున్న వారి సంఖ్యాపరంగా భారత్ రెండో స్థానంలో ఉంది.
ఇండియా మొబైల్ వాలెట్ మార్కెట్ భవిష్యత్ అంచనాలు, అవకాశాల నివేదిక ప్రకారం... 2020 నాటికల్లా భారత మొబైల్ వాలెట్ మార్కెట్ 6.6 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోనుంది.
పెరుగుదలకు కారణాలేంటంటే..
డిజిటల్ పేమెంట్ల విధానం ప్రాచుర్యంలోకి రావడానికి ప్రధాన కారణం స్మార్ట్‌ఫోన్లే. భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరుగుతుండటం, ద్వితీయ.. తృతీయ శ్రేణి నగరాల్లో నివసించే వారికి ఇంటర్నెట్‌ను పరిచయం చేసే సాధనాల్లో ఈ ఫోన్లే ముందుండటం వంటివి దీనికి కలిసొస్తున్నాయి. యువ జనాభాలో చాలా మంది మొబైల్ వాలెట్ల వినియోగంవైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం కూడా డిజిటల్ ఇండియా తదితర కార్యక్రమాలతో వ్యవస్థలో నగదు వినియోగాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటోంది.
ఈ సానుకూల అంశాలతో మొబైల్ వాలెట్ కంపెనీలు డిజిటల్ చెల్లింపు విధానాల మెరుగుపై మరింత దృష్టి పెడుతున్నాయి. ఉదాహరణకు పేటీఎం విషయాన్నే తీసుకుంటే.. మొబైల్ రీఛార్జి, కరెంటు బిల్లుల చెల్లింపులతో యూజర్లకు చేరువయ్యింది. తర్వాత వివిధ వ్యాపార సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. పేటీఎం వెబ్‌సైట్ ద్వారా యూజర్లకు భారీ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందిస్తోంది. ఒక పేటీఎం ఖాతా నుంచి మరో పేటీఎం ఖాతాలోకి ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిమిషాల వ్యవధిలో నగదు బదిలీ చేయటానికి వెలుసుబాటు కల్పిస్తోంది. పేమెంట్స్ బ్యాంకు ఏర్పాటు చేసే దిశగా పేటీఎంకు ఇప్పటికే ఆర్‌బీఐ లెసైన్సు కూడా ఇచ్చింది.
షాపింగ్ నుంచి ట్యాక్సీ బుకింగ్ దాకా..
భారీ డిస్కౌంట్లు లభించే సమయంలో షాపింగ్ చేయాలనుకున్నా .. ట్యాక్సీని బుక్ చేసుకోవాలనుకున్నా లేదా హోటల్ నుంచి పార్సిల్ తెప్పించుకోవాలనుకున్నా.. డిజిటల్ వాలెట్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం వీటిని ఎక్కువగా ఎలక్ట్రానిక్ లావాదేవీలకే ఉపయోగిస్తున్నా.. రాబోయే రోజుల్లో సాధారణ రిటైల్ స్టోర్స్‌లో కూడా ఈ వాలెట్ల ద్వారా చెల్లింపులు జరిపే అవకాశం ఉంటుంది.
మొబైల్ వాలెట్ సంస్థలు ఇప్పటికే ఈ దిశగా కసరత్తు చేస్తున్నాయి. అదే జరిగితే ప్లాస్టిక్ మనీ (డెబిట్ కార్డులు మొదలైనవి) వినియోగం కూడా గణనీయంగా తగ్గిపోతుంది. క్రెడిట్ కార్డులతో పోలిస్తే ఎం-వాలెట్లకు నమోదు చేసుకోవడం చాలా సులభం. ఇక సాధారణ రిటైల్ స్టోర్స్‌లో ఈ తరహా చెల్లింపులతో రిస్కూ తక్కువే.. అలాగే చిల్లర కోసం వెతుక్కోవాల్సిన పని ఉండదు.
- నితిన్ మిశ్రా
వైస్ ప్రెసిడెంట్, పేటీఎం