బంగారం ధర మళ్లీ రయ్...
ముంబై /లండన్ : అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను సెప్టెంబర్‌లో పెంచబోదన్న అంచనాలతో గురువారం విదేశీ, దేశీయ మార్కెట్లలో పుత్తడి ధర జోరుగా పెరిగింది. ముంబై స్పాట్ మార్కెట్లో 99.5 స్వచ్ఛతగల పుత్తడి 10 గ్రాములకు రూ. 465 ఎగిసి రూ. 26,500 వద్ద ముగిసింది. ఇది నెలన్నర రోజుల గరిష్టస్థాయి.
ఇక్కడ స్పాట్ మార్కెట్ ముగిసిన తర్వాత గురువారం రాత్రి న్యూయార్క్‌లో ఔన్సు బంగారం ధర ఒక్కసారిగా 24 డాలర్లు పెరిగి నెలరోజుల గరిష్టస్థాయి 1,148 డాలర్ల వద్దకు చేరింది. ఇదే ట్రెండ్‌ను ప్రతిబింబిస్తూ దేశీయంగా ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ఫ్యూచర్ ధర రూ. 600 మేర పెరిగి రూ. 26,800 స్థాయికి చేరింది. ఈ మేరకు శుక్రవారం ఇక్కడి స్పాట్ మార్కెట్లో పుత్తడి మరికొంత పెరగవచ్చని బులియన్ ట్రేడర్లు పేర్కొన్నారు.