పసిడి మళ్లీ పైకే!
♦ గతవారం 1.5 శాతం పెరుగుదల
♦ దేశీయంగా మళ్లీ రూ.29వేల ఎగువకు
వడ్డీ రేట్ల పెంపు విషయంలో రాబోయే రోజుల్లో కొంత ఉదార విధానాలు పాటించే అవకాశాలున్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు పంపటంతో పసిడి మళ్లీ కోలుకుంటోంది. దాదాపు ఐదు వారాల పాటు కొనసాగిన నష్టాల పరంపరకు బ్రేక్ వేస్తూ.. గత వారం లాభాలు నమోదు చేసింది. ఔన్సు బంగారం ఆగస్టు ఫ్యూచర్స్ రేటు అంతక్రితం వారంతో పోలిస్తే సుమారు 1.5 శాతం పెరిగి 1,227.8 డాలర్ల దగ్గర క్లోజయింది. వెండి కూడా అదే ధోరణిలో కోలుకుంటోంది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్... 3 శాతం దాకా పెరిగి 15.90 డాలర్ల దగ్గర క్లోజయ్యాయి.
రిటైల్ అమ్మకాలు, ద్రవ్యోల్బణం గణాంకాలు ఊహించిన దానికన్నా బలహీనంగా ఉండటంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది వడ్డీ రేట్లను మరింతగా పెంచే అవకాశాలపై మార్కెట్ వర్గాల్లో సందేహాలు నెలకొన్నాయి. రిటైల్ అమ్మకాలు మందగించడం ఈక్విటీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని, దీంతో పసిడి పార్టీ మళ్లీ మొదలైనట్లే భావించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, పసిడికి 1,237– 1,260 డాలర్ల మధ్య గట్టి నిరోధం ఎదురు కావచ్చు కనక ఇన్వెస్టర్లు ఈ స్థాయిల దగ్గర కాస్త ఆచితూచి వ్యవహరించడం మంచిదని చెబుతున్నారు. పెరిగితే 1,240 డాలర్ల వద్ద కీలకమైన రెసిస్టెన్స్, తగ్గితే 1,204 డాలర్ల వద్ద మద్దతు లభించగలదన్నది వారి విశ్లేషణ.
రూ.29 వేల పైకి చేరిన పుత్తడి..
అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు, స్థానిక జ్యుయలర్ల నుంచి కొనుగోళ్లు పెరగడంతో దేశీ బులియన్ మార్కెట్లలో పుత్తడి గతవారం మరోసారి రూ.29 వేల ఎగువకి చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదార్ల డిమాండ్‌తో వెండి ధర కూడా రూ. 38,000 పైకి చేరింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో అంతక్రిత వారంతో పోలిస్తే ఒకింత తక్కువగా రూ. 28,780 వద్ద ప్రారంభమైన మేలిమి బంగారం రేటు వారాంతానికి రూ. 29,050 వద్ద క్లోజయ్యింది.